మినీ ఐపీఎల్‌ ఆడిద్దామా!

ABN , First Publish Date - 2020-03-15T10:21:03+05:30 IST

కరోనా ధాటికి ఐపీఎల్‌-13వ సీజన్‌ షెడ్యూల్‌ ప్రకారం పూర్తి స్థాయిలో నిర్వహించే వీలు లేకుండా పోయింది.

మినీ ఐపీఎల్‌ ఆడిద్దామా!

  • ప్రత్యామ్నాయాలపై చర్చ
  • ఫ్రాంచైజీలతో పాలకమండలి భేటీ

ముంబై: కరోనా ధాటికి ఐపీఎల్‌-13వ సీజన్‌ షెడ్యూల్‌ ప్రకారం పూర్తి స్థాయిలో నిర్వహించే వీలు లేకుండా పోయింది. దీంతో మ్యాచ్‌లను కుదించి మినీ ఐపీఎల్‌ మాదిరి లీగ్‌ను జరిపితే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. శనివారం ఎనిమిది ఫ్రాంచైజీల యజమానులతో ఐపీఎల్‌ పాలకమండలి సమావేశం జరిగింది. దీంట్లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా టోర్నీ నిర్వహణకు ఏడు అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. ఈనెల 29 నుంచి ఏప్రిల్‌ 15 వరకు ఈ లీగ్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత స్థితిని బట్టి చూస్తే ఆ తర్వాతైనా వీలవుతుందా? అనే విషయం చెప్పలేమని పంజాబ్‌ కింగ్స్‌ లెవెన్‌ సహ యజమాని నెస్‌ వాడియా చెప్పాడు. ‘ఐపీఎల్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందని అడిగితే ఇప్పుడైతే ఎవరూ చెప్పలేరు. రెండు, మూడు వారాల తర్వాతే పరిస్థితిని సమీక్షించగలం. అప్పటివరకు ఈ వైరస్‌ తీవ్రత తగ్గాలని ఆశిద్దాం’ అని నెస్‌ వాడియా అన్నాడు. మరోవైపు బీసీసీఐ, ఫ్రాంచైజీలతో పాటు స్టార్‌ స్పోర్ట్స్‌ కూడా ఆర్థిక నష్టంపై ఆందోళన చెండడం లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతానికి ప్రజల భద్రతకే పెద్దపీట వేశామని గుర్తుచేశాడు. ఏప్రిల్‌ 15 తర్వాతైనా ఐపీఎల్‌ జరిగితే మంచిదేనని.. లేకుంటే చేసేదేమీ లేదన్నాడు.


రెండు గ్రూపులుగా మార్చి..

ఫ్రాంచైజీలతో జరిగిన సమావేశంలో ఆరు నుంచి ఏడు ప్రత్యామ్నాయాలపై చర్చ జరిగినట్టు బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఇందులో ఐపీఎల్‌ను కుదించడం కూడా ఒకటని అన్నారు. ‘రెండోది.. ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించడం. టాప్‌-4 జట్లు ప్లేఆ్‌ఫ్సకు చేరుకుంటాయి. ఇక మూడోది.. డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌(ఒకేరోజు రెండు మ్యాచ్‌లు)లను పెంచడం. అన్ని మ్యాచ్‌లను రెండు, మూడు స్టేడియాలకే పరిమితం చేస్తే ఆటగాళ్లు, సిబ్బంది, టీవీ క్రూ ప్రయాణ భారాన్ని తగ్గించడం నాలుగోది. తక్కువ కాల వ్యవధిలోనే ఖాళీ స్టేడియాల్లో 60 మ్యాచ్‌లను ఆడించడం మరో పద్ధతి. దీని ద్వారా ఆర్థిక నష్టాన్ని కూడా అరికట్టవచ్చు. విదేశాల్లో ఐపీఎల్‌ను నిర్వహించడంపై చర్చ జరగలేదు’ అని ఆ అధికారి వివరించారు. 


‘మరోసారి సమావేశమవుతాం’

లీగ్‌ను నిర్వహించే విషయమై మరోసారి సమావేశమవుతామని ఢిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని పార్థ్‌ జిందాల్‌ వెల్లడించాడు. ‘పరిస్థితులను సమీక్షిస్తున్నామని మాకు చెప్పడమే ఈరోజు భేటీలో ప్రధాన ఉద్దేశం. అంతా మెరుగైనప్పుడు మరోసారి సమావేశమై టోర్నీ ఎప్పుడు జరపాలనేది చర్చిస్తాం. అంతవరకు అందరి భద్రతే మాకు ముఖ్యం’ అని పార్థ్‌ జిందాల్‌ స్పష్టం చేశాడు. ఇక ఎక్కువ డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లను ఆడించాలనే విషయంపై మాట్లాడలేదని అన్నాడు. 

Updated Date - 2020-03-15T10:21:03+05:30 IST