Abn logo
Nov 21 2020 @ 20:08PM

ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించిన తమిళనాడు

Kaakateeya

చెన్నై: ఆన్‌లైన్ బెట్టింగ్ గేముల కారణంగా నష్టపోయిన యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. బెట్టింగులు ఉండే ఆన్‌లైన్ గేములను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇకపై, ఈ ఆదేశాలను ధిక్కరించే వారికి జరిమానాతోపాటు రెండేళ్ల జైలుశిక్ష కూడా విధించనున్నట్టు ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై గవర్నర్ బన్వర్‌లాల్ పురోహిత్ ఆర్డినెన్స్ జారీ చేశారు. కంప్యూర్ కానీ, మరే ఇతర కమ్యూనికేషన్ పరికరాన్ని కాని ఉపయోగించి ఆన్‌లైన్‌లో పందెం కాయడాన్ని నిషేధిస్తున్నట్టు ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ దొరికితే రూ. 5వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష, గేమింగ్ హౌస్ నిర్వాహకులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించనున్నారు.  

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆన్‌లైన్ గేమింగును నిషేధించింది. ఆన్‌లైన్ గేములపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆన్‌లైన్ బెట్టింగుల కారణంగా నష్టపోతున్న వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆన్‌లైన్ బెట్టింగ్ గేములపై చర్యలు తీసుకుంటామని ఇటీవల ప్రకటించారు. ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌లో భారీగా నష్టపోయిన కోయంబత్తూరుకు చెందిన ముగ్గురు ఈ నెలలో ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ కూడా ఆన్‌లైన్ గేమింగ్‌లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారిస్తోంది.   

Advertisement
Advertisement