డీఎంకే చిహ్నంపై పోటీకి ఎండీఎంకే, డీపీఐ వెనుకంజ!

ABN , First Publish Date - 2020-10-04T19:54:19+05:30 IST

వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి నాయకత్వం వహిస్తున్న డీఎంకే చిహ్నం

డీఎంకే చిహ్నంపై పోటీకి ఎండీఎంకే, డీపీఐ వెనుకంజ!

చెన్నై : వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి నాయకత్వం వహిస్తున్న డీఎంకే చిహ్నం ‘ఉదయించే సూర్యుడు’ గుర్తుపై పోటీ చేయడానికి ఎండీఎంకే, డీపీఐలు వెనుకంజ వేస్తున్నాయి. ఆ చిహ్నం పోటీ చేసిన గెలిచిన అభ్యర్థుల పార్టీకి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతుండటం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు వాటి అధికారిక పార్టీ చిహ్నాలపైనే పోటీ చేసేందుకు అంగీకరించాలంటూ డీఎంకేపై ఒత్తిడి చేస్తున్నాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌, ఎండీఎంకే, డీపీఐ, సీపీఐ, సీపీఎంలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పార్టీలు డీఎంకే అధిష్ఠానం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల కేటాయింపులపై  మంతనాలు సాగిస్తున్నాయి. అన్ని పార్టీలకంటే ముందుగా జాతీయ పార్టీ కాంగ్రెస్‌ నేతలు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను తరచూ కలుసుకుని అసెంబ్లీ ఎన్నికల్లో మునుపటి కంటే అధికంగా సీట్లు కేటాయించాలని పట్టుబడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి నలభై అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించినప్పటికీ ఆ పార్టీ ఎనిమిది స్థానాలలో మాత్రమే గెలిచింది. తక్కిన 32 నియోజకవర్గాలలో ఓడిపోవడం వల్ల మెజారిటీ తగ్గి డీఎంకే అధికారంలోకి రాలేకపోయింది. ఈ పరిస్థితులలో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీకి 40 సీట్లు కేటాయించడానికి డీఎంకే తటపటాయిస్తోంది.


ఈ విషయం తెలిసిన టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి ఏఐసీసీ సీనియర్‌ నేతల ద్వారా స్టాలిన్‌తో మంతనాలు జరిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి తమ పార్టీకి కనీసం 60 సీట్లు కేటాయించాలని ఆయన పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి రోజురోజుకూ ప్రజల మద్దతు పెరుగుతోందని, ఆ కారణంగా తమకు మునుపటి కంటే అత్యధిక సీట్లు కేటాయించాలని డిమాండు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇలా 60 సీట్లు అడగటానికి బలమైన కారణం ఉంది. డీఎంకే మునుపటి ఎన్నికల్లో కేటాయించిన 40 సీట్ల కంటే తక్కువ సీట్లను ఇస్తుందన్న అనుమానమే దీనికి ప్రదాన కారణమని తెలుస్తోంది. ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీలు గెలిచిన నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయిస్తే సమంజసంగా ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఈ ప్రతిపాదను అమలు చేస్తే డీఎంకే కాంగ్రెస్‌కు 40 అసెంబ్లీ స్థానాలకంటే అధికంగా సీట్లు కేటాయించవలసి వస్తుంది. 


ఈ కారణాల వల్లే ప్రస్తుతం రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులపై జరుగుతున్న  చర్చలలో ప్రతిష్టంభన చోటుచేసుకుంటోంది. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాట్లను పక్కనెబట్టి వైగో నాయకత్వంలోని ఎండీఎంకే, తొల్‌ తిరుమావళవన్‌ నాయకత్వంలోని డీపీఐ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు తమ పార్టీ చిహ్నాలపైనే పోటీ చేసేందుకు అనుమతించాలంటూ స్టాలిన్‌ను అభ్యర్థిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే గుర్తుపై గెలిచిన మిత్రపక్షాల ఎంపీలంతా ప్రస్తుతం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో కూటమికి నాయకత్వం వహించే పార్టీల గుర్తులపై మిత్రపక్షాలు పోటీ చేయడంపై నిషేధం విధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ప్రజాహితవాజ్యం దాఖలైంది. ఆ కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే చిహ్నం ‘ఉదయించే సూర్యుడు’పై పోటీ చేసి గెలిచిన డీఎంకే మిత్రపక్షాల అభ్యర్థులకు సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 


ఎండీఎంకే తరఫున పోటీ చేసి గెలిచిన ఆ పార్టీ ఈరోడ్‌ లోక్‌సభ సభ్యుడు గణేశమూర్తి తాను డీఎంకే సభ్యత్వం స్వీకరించిన తర్వాతే పోటీ చేశానని కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. తక్కిన మిత్రపక్షాల ఎంపీలు ఇంకా కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయలేదు. ఈ పరిస్థితులలో ఎండీఎంకే, డీపీఐ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే చిహ్నం పోటీ చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని పట్టుబడుతున్నాయి. ఈ రెండు పార్టీల ప్రతిపాదనను డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ అంగీకరించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిషికేషన్‌ జారీ అయిన తర్వాత ఈ విషయమై మిత్రపక్షాలతో చర్చలు జరిపి తగు నిర్ణయం ప్రకటిస్తానని స్టాలిన్‌ చెబుతున్నారు.

Updated Date - 2020-10-04T19:54:19+05:30 IST