IIT-Madrasలో తమిళ తల్లి గీతం పాడాల్సిందే...

ABN , First Publish Date - 2021-11-28T18:31:55+05:30 IST

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్‌లో

IIT-Madrasలో తమిళ తల్లి గీతం పాడాల్సిందే...

చెన్నై : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్‌లో జరిగే అన్ని కార్యక్రమాల్లోనూ తమిళ తల్లి గీతాన్ని ఆలపించాలని తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి కే పొన్ముడి ఆదేశించారు. ఈ మేరకు ఐఐటీ-మద్రాస్ డైరెక్టర్ భాస్కర్ రామమూర్తికి నవంబరు 24న ఓ లేఖ రాశారు. ఇటీవల జరిగిన కాన్వకేషన్‌లో ఈ గీతాన్ని ఆలపించలేదని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చారు. 


ఇటీవల ముగిసిన స్నాతకోత్సవాల్లో రాష్ట్ర గీతాన్ని ఆలపించకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. సువ్యవస్థీకృతమైన ప్రోటోకాల్‌ దారి తప్పిందని తెలిపారు. తమిళనాడులో జరిగే అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ గీతాన్ని ఆలపించాలన్నారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి సహా అత్యున్నత స్థాయి పెద్దలు పాల్గొనే కార్యక్రమాల్లో కూడా ఈ గీతాన్ని ఆలపించాలని చెప్పారు. 


ఐఐటీ-మద్రాస్ 58వ స్నాతకోత్సవాలు నవంబరు 20న వర్చువల్ విధానంలో జరిగాయి. ఈ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. తమిళ తల్లి గీతాన్ని ఎందుకు ఆలపించలేదని ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కొందరు నేతలు ప్రశ్నించారు. 


Updated Date - 2021-11-28T18:31:55+05:30 IST