‘తమిళ తాయ్‌’ గీతానికి అవమానం

ABN , First Publish Date - 2022-01-28T13:13:20+05:30 IST

నగరంలోని భారత రిజర్వుబ్యాంకు ప్రాంగణంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో తమిళ తాయ్‌ ప్రార్థనా గీతానికి అవమానం జరిగింది. ఈ గీతాలాపన సమయంలో లేచి నిల్చోవాల్సిన అధికారులు తమలో జరిగిన వాగ్వివాదంలో నిమగ్నమై

‘తమిళ తాయ్‌’ గీతానికి అవమానం

- వివాదం రేపిన ఆర్బీఐ అధికారుల తీరు ఫ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

- చెన్నై రిజర్వ్‌ బ్యాంక్‌  కార్యాలయం ముట్టడి

- విచారం వ్యక్తం చేసిన డైరెక్టర్‌


అడయార్‌(చెన్నై): నగరంలోని భారత రిజర్వుబ్యాంకు ప్రాంగణంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో తమిళ తాయ్‌ ప్రార్థనా గీతానికి అవమానం జరిగింది. ఈ గీతాలాపన సమయంలో లేచి నిల్చోవాల్సిన అధికారులు తమలో జరిగిన వాగ్వివాదంలో నిమగ్నమై కుర్చీలకే పరిమితమయ్యారు. ఈ వ్యవహారం ఇపుడు నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి చేరింది. తమిళ తాయ్‌ గీతాన్ని అవమానపరిచిన ఆర్బీఐ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టు న్యాయవాదుల సంఘం లైబ్రేరియన్‌ జి.రాజేష్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం రాత్రి ఆన్‌ లైన్‌లో కమిషన్‌ కార్యాలయానికి ఒక ఫిర్యాదు పంపించారు. భారత రాజ్యాంగం మేరకు జాతీయ పతాక ఎగురవేయడం, జాతీయ గీతాలాపన సమయంలో విధిగా లేచి నిల్చోవాలి. అదేవిధంగా రాష్ట్రాల ప్రాంతీయ ప్రార్థనా గీతాలకు కూడా తగిన గౌరవం ఇవ్వాల్సి ఉంది. అయితే, ఈ నెల 17న తమిళ తాయ్‌ గీతాన్ని రాష్ట్ర ప్రార్థనా గీతంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా జీవో జారీచేసింది. ఈ గీతాలాపన సమయంలో ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలన్న నిబంధన కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో 26వ తేదీన ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్‌ వేడుకల్లో ఈ గీతాలాపన చేసే సమయంలో అధికారులు లేచి నిలబడలేదు. హైకోర్టు ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకుని, తమ సీట్లకే పరిమితమై తమిళ తాయ్‌ ప్రార్థనా గీతాన్ని అవమానించారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో సదరు అధికారులపై రాజేష్‌ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్బీఐ అధికారుల చర్య వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని, ఆర్బీఐ అధికారులపై చర్య తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 


విచారణకు ఆదేశించిన కమిషనర్‌

ఈ ఫిర్యాదును పరిశీలించిన కమిషనర్‌ శంకర్‌ జీవాల్‌ తక్షణం విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఫ్లవర్‌ బజార్‌ పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. గణతంత్ర దినోత్సవం రోజున ఆర్బీఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమ వివరాలను, వీడియో ఫుటేజీని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని కూడా ప్రత్యక్షంగా విచారణ జరుపుతూ వివరాలు సేకరిస్తున్నారు అంతే కాకుండా, ఈ వ్యవహారంలో అమర్యాదగా ప్రవర్తించిన ఆర్బీఐ అధికారులపై కేసు నమోదు చేసే అంశంపై న్యాయనిపుణులతో పోలీసులు సమా లోచనలు జరుపుతున్నారు. 


ఆర్థిక మంత్రి వద్ద విచారం

తమిళ తాయ్‌ ప్రార్థనా గీతాన్ని అవమానించిన వ్యవహారంలో ఆర్బీఐ అధికారులు రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ను కలుసుకుని విచారం వ్యక్తం చేశారు. ఆర్బీఐ చెన్నై ప్రాంతీయ కార్యాలయ సంచాలకులు ఎస్‌ఎంఎన్‌ స్వామి స్వయంగా గురువారం విత్తమంత్రిని కలిసి గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. అలాగే ఆర్థిక శాఖ కార్యదర్శి మురుగానందంను కూడా ఆర్బీఐ బృందం అధికారులు కలిశారు. ఇదే అంశంపై ఆర్బీఐ చెన్నై ప్రాంతీయ కార్యాలయం కూడా గురువారం సాయంత్రం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. దేశంలోని ప్రతి ప్రాంతానికి చెందిన ప్రార్థనా గీతాన్ని గౌరవిస్తామని, కానీ, గణతంత్ర వేడుకల రోజున జరిగిన సంఘటనకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. 


ఆర్బీఐ ఎదుట ధర్నా

తమిళ తాయ్‌ ప్రార్థనా గీతాలాపన సమయంలో ఆర్బీఐ అధికారుల తీరును ఖండిస్తూ తమిళుగ వాళ్వురిమై కట్చి ఆందోళనకు దిగింది. గురు వారం ఆర్బీఐ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో ఆ పార్టీ అధ్యక్షుడు వేల్‌మురుగన్‌, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నాలో వందలాది మంది పాల్గొనడంతో పోలీసులను భారీ సంఖ్యలో మొహరించారు. ఇదిలా వుండగా ఆర్బీఐ అధికారుల తీరును డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ రాందాస్‌ తదితర రాజకీయ నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. 



Updated Date - 2022-01-28T13:13:20+05:30 IST