స్వలింగ సంపర్కులుగా తమిళ యువ హీరోయిన్లు.. వీడియో వైరల్

తమిళ యువ హీరోయిన్లు గౌరీకిషన్‌ - అనఘలు కలిసి ఓ స్వలింగ సంపర్క ఆల్బమ్‌లో నటించారు. ఎల్‌జీబీటీలుగా పిలిచే స్వలింగ సంపర్కుల గురించి సమాజంలో అవగాహన కల్పించే నిమిత్తం ఈ ఆల్బమ్‌ను రూపొందించారు. ‘మగిళిని’ అనే పేరుతో రూపొందించిన ఈ ఆల్బమ్‌కు విజి. బాలసుబ్రమణియన్‌ దర్శకత్వం వహించగా, మదన్‌ కార్కి గేయరచన చేశారు. గోవింద్‌ వసంత్‌ స్వరాలు సమకూర్చారు. అరుణ్‌కృష్ణ కెమెరామెన్‌గా పనిచేశారు. 


ఈ ఆల్బమ్‌ గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘స్వలింగ సంపర్కం నేరం కాకపోయినప్పటికీ ఈ వర్గానికి చెందినవారిని సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. ఇలాంటి వారిపట్ల ప్రజలలో ఒక మంచి అభిప్రాయాన్ని కల్పించాలన్న ఉద్దేశంలో ఈ ఆల్బమ్‌ను రూపొందించాం. ఇందులో గౌరీ కిషన్‌, అనఘలు అద్భుతంగా నటించారు. పలు సన్నివేశాల్లో వారిద్దరూ పాత్రల్లో లీనమై బెస్ట్‌ ఔట్‌పుట్‌ను ఇచ్చారు’ అని వివరించారు. 


కాగా, గౌరీ కిషన్‌ గతంలో విజయ్‌ సేతుపతి హీరోగా వచ్చిన ‘96’ చిత్రంలో త్రిష పాత్రకు పాఠశాలకు వెళ్ళే బాల్యం రోల్‌లో నటించింది. ఆ తర్వాత విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ చిత్రంలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె కేవలం తమిళంలోనే కాకుండా, తెలుగు, మలయాళ భాషల్లో కూడా నటిస్తూ బిజీగా వుంది. మరోవైపు, మరో నటి అనఘ ‘నట్పే తుణై’ అనే చిత్రంలో నటించిన తర్వాత హీరో సంతానం నటించిన ‘డిక్కిలోనా’ మూవీలో నటించింది. ఇపుడు గౌరీ కిషన్‌తో కలిసి ఈ ఆల్బమ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకురానుంది.


Advertisement