‘పరిస్థితులను అధ్యయనం చేశాకే బరిలోకి రజనీ..’

ABN , First Publish Date - 2020-12-05T16:47:59+05:30 IST

పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసే రానున్న

‘పరిస్థితులను అధ్యయనం చేశాకే బరిలోకి రజనీ..’

చెన్నై : పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసే రానున్న అసెంబ్లీ ఎన్నికలకుసూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సిద్ధమయ్యారని రజనీ ప్రారంభించనున్న పార్టీ పర్యవేక్షకుడు, గాంధీ మక్కల్‌ ఇయక్కమ్‌ నాయకుడు తమిళురివి మణియన్‌ తెలిపారు. అభిమాన సంఘాలను రజనీ మక్కల్‌ మండ్రాలుగా మార్చినప్పటి నుంచే ఈ పనులు చురుకుగా సాగుతున్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రాజకీయ మార్పును తీసుకురావాలని, ముఖ్యంగా ఆధ్యాత్మిక రాజకీయ స్థాపన జరగాలని రజనీ యేళ్ల తరబడి భావిస్తున్నారని చెప్పారు.


జనవరిలో పార్టీని ప్రారంభిస్తే అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల గడువు మాత్రమే ఉంటుందని కనుక ఎన్నికల ఏర్పాట్లు సమర్థవంతంగా పూర్తి చేయగలరా అని విపక్షాలు అనుమానిస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే మూడేళ్లుగా రజనీ తన మక్కల్‌ మండ్రం నేతలతో తరచూ సమావేశాలు, సమీక్షలు జరుపుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో పోటీ చేయడానికి అనువైన అభ్యర్థుల గురించి అడిగి తెలుసుకుంటూనే ఉన్నారని  చెప్పారు.


ఇలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్న మీదటే రజనీ జనవరిలో పార్టీని ప్రారంభించనున్నట్టు ప్రకటించారన్నారు. ప్రతి నియోజకవర్గం పరిస్థితిని రజనీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారని, ఎవరిని  ఎక్కడ బరిలో నిలిపితే గెలుపు సాధ్యమవుతుందో ఆయనకు  తెలుసని మణియన్‌ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా, ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకుంటుందా అనే వివరాలను జనవరిలో ప్రకటిస్తామన్నారు. రజనీ రాజకీయ అరంగేట్రం చేస్తానని ప్రకటించిన వెంటనే రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఆందోళన చెందుతున్నాయని, వాటికి ఓటమి భయం పట్టుకుందన్నారు.


Updated Date - 2020-12-05T16:47:59+05:30 IST