రాష్ట్రంలో.. 32 డెల్టా వైరస్ కేసులు

ABN , First Publish Date - 2021-08-04T15:05:01+05:30 IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మళ్లీ అధికమైతే ఆంక్షలు కఠినతరం చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను పురస్కరించుకొని స్థానిక రాజీవ్‌

రాష్ట్రంలో.. 32 డెల్టా వైరస్ కేసులు

   - మరో పదిమందికి డెల్టా ప్లస్‌

   - రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికమైతే మళ్లీ కఠిన ఆంక్షలు

    - మంత్రి సుబ్రమణ్యం

    - లాంఛనంగా ‘తల్లిపాల గది’ ప్రారంభం  


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మళ్లీ అధికమైతే ఆంక్షలు కఠినతరం చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను పురస్కరించుకొని స్థానిక రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం వైద్య విద్యార్థులు నిర్వహించిన అవగాహన ప్రచారంలో మంత్రులు ఎం.సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో మంత్రులు ‘తల్లిపాల గది’ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి సుబ్రమణ్యం మాట్లాడుతూ... ఈ ఏడాది చివరిలోగా 7 ప్రభుత్వ వైద్యశాలలు, 5 జిల్లా ప్రధాన ఆస్పత్రుల్లో కలిపి మొత్తం 12 ప్రాంతాల్లో తల్లి పాల బ్యాంకులు ఏర్పాటుచేయనున్నామన్నారు. రాష్ట్రంలో వచ్చే సెప్టెంబరులో కరోనా మూడవ అల తీవ్రమయ్యే అవకాశముందని, రోజుకు 42 వేల కేసులు నమోదవుతాయంటూ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారని, అందుకోసం మూడో అలను ఎదుక్కొనే చర్యలపై ఐఐటీ, ఎయిమ్స్‌ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని తెలిపారు. కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆయా రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా ముమ్మరం చేశామన్నారు. ఏ జిల్లాలో ప్రజలకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉందో అక్కడికి కరోనా టీకాలు అధికంగా సరఫరా చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 12.5 లక్షల టీకాల నిల్వలున్నాయని తెలిపారు. వైరస్‌ను అధ్యయనం చేసేందుకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశామని, ఇప్పటివరకు రాష్ట్రంలో 32 మందికి డెల్టా వైరస్‌, 10 మందికి డెల్టా ప్లస్‌ సోకినట్లు నిర్ధారణ అయిందని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికమైతే ఆంక్షలు కఠినతరం చేస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన నియంత్రణ చర్యలకు ప్రజలు సహకరించాలని, సాధ్యమైనంత వరకు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-08-04T15:05:01+05:30 IST