ఏప్రిల్‌లోగా వాళ్లంతా జైలుకే : సీఎం హెచ్చరిక

ABN , First Publish Date - 2021-01-07T17:40:17+05:30 IST

ఏప్రిల్‌ నెలలోగా జైలుకెళ్లడం ఖాయమని ముఖ్యమంత్రి

ఏప్రిల్‌లోగా వాళ్లంతా జైలుకే : సీఎం హెచ్చరిక

  • అన్నాడీఎంకేలో కుటుంబ రాజకీయాలకు తావు లేవు
  • ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి

చెన్నై : అవినీతి కేసుల్లో చిక్కుకున్న పలువురు డీఎంకే నేతలు ఏప్రిల్‌ నెలలోగా జైలుకెళ్లడం ఖాయమని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి హెచ్చరించారు. రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరుగనున్న ఎన్నికలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి పళనిస్వామి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. ఈరోడ్‌ జిల్లా భవానీలో బుధవారం పలు ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించిన సీఎం భవానీ బస్టాండ్‌ ప్రాంతంలో జరిగిన సభలో మాట్లాడుతూ... దేశంలో అవినీతి కోసం ప్రారంభమైన ఏకైక పార్టీ డీఎంకే అని, కానీ ఎంకే స్టాలిన్‌ మాత్రం అన్నాడీఎంకే అవినీతి పాలన సాగిస్తోందని మాట్లాడడం విడ్డూరంగా వుందన్నారు. దీనికోసం గవర్నర్‌ను సంప్రదించి ఒక జాబితా కూడా అందించారని తెలిపారు. 


డీఎంకే పాలనలో తమకు ఇష్టులైన వారికి టెండర్లు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అన్నాడీఎంకే ప్రభుత్వం ఈ-టెండర్‌ ద్వారా అన్ని టెండర్లను ఖరారు చేస్తుందని, ఈ విధానంలో అవినీతికి అవకాశమే లేదన్నారు. తనపై సీబీఐ విచారణ చేయించాలని స్టాలిన్‌ కోరుతున్నారని, 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపులో మీ పార్టీకి చెందిన వారే రూ.1.76 కోట్ల అవినీతి పాల్పడ్డారనే వ్యవహారంలో సీబీఐ విచారించడాన్ని మరచిపోరాదన్నారు. కరుణానిధి మీకు ఎంత ఆస్తి ఇచ్చారు? ప్రస్తుతం ఆయన కుటుంబానికి 52 ఆస్తులున్నాయని, డీఎంకేకు చెందిన పలువురు నేతలకు సంబంధించిన అవినీతి ఆరోపణలు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్నాయన్నారు.


మాజీ మంత్రులు ఐ.పెరియస్వామి, కేఎన్‌ నెహ్రూ, తంగం తెన్నరసు, అనిత రాధాకృష్ణన్‌, ఎంఆర్‌కే పన్నీర్‌ సెల్వం, సురేష్‌రాజన్‌, తంగవేలన్‌, రఘుపతిలపై 30 కేసులున్నాయన్నారు. ఇప్పటివరకు వారు విచారణకు వెళ్లకుండా వాయిదాలు కోరుతూ వచ్చారని, ఈ కేసులను సత్వరం పూర్తిచేయాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ కేసులు పూర్తయితే పలువురు డీఎంకే నేతలు ఏప్రిల్‌లోగా జైలుకెళ్లడం ఖాయమన్నారు. 

Updated Date - 2021-01-07T17:40:17+05:30 IST