ఆమె నిర్భీతికి భద్రత కావాలి!

ABN , First Publish Date - 2020-07-05T05:30:00+05:30 IST

కాపాడాల్సిన చట్టమే ఇద్దరిని కబళించిన ఘటనకు ఆమె సాక్షి.. తమిళనాడులోని సాత్తాన్‌కుళమ్‌ పోలీస్‌స్టేషన్‌లో తండ్రీ కొడుకులపై తన తోటి పోలీసులు పాల్పడిన అమానుషం గురించి ఆమె నోరు విప్పారు.

ఆమె నిర్భీతికి  భద్రత కావాలి!

కాపాడాల్సిన చట్టమే ఇద్దరిని కబళించిన ఘటనకు ఆమె సాక్షి.. తమిళనాడులోని సాత్తాన్‌కుళమ్‌ పోలీస్‌స్టేషన్‌లో తండ్రీ కొడుకులపై తన తోటి పోలీసులు పాల్పడిన అమానుషం గురించి ఆమె నోరు విప్పారు. జరిగిందేమిటో కోర్టులో నిర్భయంగా చెప్పి సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే, నిజం చెప్పినందుకు అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి ప్రతీకార చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే బెంగ ఆమెను వెంటాడుతోంది. 


‘‘నువ్వు మంచి పని చేశావంటూ ఎందరో మెచ్చుకుంటున్నారు. సామాన్యులు మొదలు ప్రముఖుల వరకూ చాలామంది అభినందిస్తున్నారు. నేను ప్రచారం కోసమో, మెప్పుకోళ్ళ కోసమో ఇదంతా చెయ్యలేదు. జరిగిందేమిటో చెప్పానంతే! కానీ ఇప్పుడు నన్ను భయం వెంటాడుతోంది’’ అని అంటున్నారు 37 ఏళ్ల ఆ మహిళా కానిస్టేబుల్‌ (తన పేరు వెల్లడించవద్దన్నది ఆమె అభ్యర్థన). 


తండ్రీకొడుకులైన ఇద్దరిని తమిళనాడులోని తూతుక్కుడి జిల్లా సాత్తాన్‌కుళమ్‌ పోలీసులు ఇటీవల చిత్రహింసలు పెట్టి చంపిన ఘటన దేశాన్ని దిగ్ర్భాంతిలో ముంచింది. సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇంతకీ ఆ తండ్రీకొడుకులు చేసిన తప్పల్లా లాక్‌డౌన్‌ సమయాన్ని మించి పావుగంట సేపు వారి దుకాణం తెరవడమే! దీనిపై ఆగ్రహించిన పోలీసులు జూన్‌ 19న జయరాజ్‌ అనే వ్యక్తినీ, అతని కుమారుడు బెన్నిక్స్‌నూ అరెస్ట్‌ చేశారు. వారిని పోలీస్‌ స్టేషన్‌లో ఉంచి దారుణంగా హింసించారు. పోలీసు కస్టడీలో వారిద్దరూ మరణించడంతో సర్వత్రా ఆందోళనలు చెలరేగాయి. ఈ ఉదంతంపై దర్యాప్తు సాగుతోంది. అయితే సంఘటన జరిగిన రోజున పోలీస్‌ స్టేషన్‌ సీసీ టీవీల దృశ్యాలు లేవు. కానీ ఆ మహిళా కానిస్టేబుల్‌ మాత్రం మేజిస్ట్రేట్‌కు జరిగిందేమిటో పూసగుచ్చినట్టు వివరించారు. ఈ కస్టోడియల్‌ డెత్‌ కేసులో... పోలీసు సిబ్బందిపై చర్యలతో పాటు హత్యా నేరం నమోదు కావడానికి ఆమె సాక్ష్యమే కీలక ఆధారంగా నిలిచింది.


ఆ ప్రస్తావన వద్దన్నాను.. కానీ...

‘‘ఆ రోజు రాత్రి జయరాజ్‌నూ, బెన్నిక్స్‌నూ మా సిబ్బంది పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. మర్నాడు ఉదయం వరకూ కొడుతూనే ఉన్నారు. ఎంత తీవ్రంగా కొట్టారంటే వాళ్ళ లాఠీలూ, స్టేషన్‌లోని టేబుళ్ళూ రక్తసిక్తమైపోయాయి. నేను కళ్ళారా చూసిందే మేజిస్ట్రేట్‌కు వివరించాను. నేను ఇచ్చిన వాఙ్మూలాన్ని బహిరంగపరచవద్దని కోరాను. ఈ విజ్ఞాపనను నేను ప్రత్యేకంగా చేశాను’’ అని ఆ మహిళా కానిస్టేబుల్‌ తెలిపారు. తన భర్త, ఇద్దరు పిల్లలతో సాత్తాన్‌కుళమ్‌లో నివసిస్తున్న ఆమె ఇప్పుడు తన కుటుంబానికి ముప్పు ఎదురవుతుందే మోనని భయపడుతున్నారు. ‘‘మా శాఖ సిబ్బందికి వ్యతిరేకంగా నేను వాఙ్మూలం ఇచ్చినందుకు ఉన్నతాధికారులు నన్ను లక్ష్యంగా చేసుకొని వేధిస్తారేమోనని ఆందోళనగా ఉంది’’ అని ఆమె అంటున్నారు. ‘‘నా పేరును డాక్యుమెంట్లలో న్యాయాధికారులు చేర్చకపోతే నేను ఇంత ఆందోళన చెందేదాన్ని కాదు. నా పేరు ప్రస్తావించవద్దని వారిని కోరాను. కానీ వాళ్ళు ఉపయోగించారని తెలిసింది. నాకు ప్రమాదం పొంచి ఉందని భయంగా ఉంది’’ అని చెబుతున్నారామె.




మాకు కావాల్సింది అదే!

ఈ కేసులో ఆమె వాఙ్మూలం ఎంత కీలకమో తెలుసు కాబట్టి ఆమెకు అవసరమైన రక్షణ కల్పించాలని మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌ ఆదేశాలిచ్చింది. సాత్తాన్‌కుళమ్‌ పోలీస్‌ స్టేషన్‌నుంచి ఆమెను ఉన్నతాధికారులు రిలీవ్‌ చేశారు. పక్క పోలీస్‌ స్టేషన్లో రిపోర్ట్‌ చెయ్యాల్సిందిగా సూచించారు. అయితే విధుల్లో చేరడానికి ఆమె సంకోచిస్తున్నారు. ‘‘నాకూ నా భర్తకూ రక్షణ ఇవ్వాలనీ, నెల రోజులు సెలవు ఇవ్వాలనీ లేఖ రాశాను. నాకు తెలిసిందంతా మేజిస్ట్రేట్‌కు చెప్పాను. ఇప్పుడు నాకూ, నా కుటుంబానికీ  కావాల్సిందల్లా భద్రత’’ అని ఆమె స్పష్టం చేశారు. 


ఆమె భయాలు అసంబద్ధమేమీ కావు. ప్రోటోకాల్‌కు ఎంతో ప్రాధాన్యం ఉండే పోలీసు వ్యవస్థలో ఒక కానిస్టేబుల్‌, అందులోనూ మహిళ తన పై అధికారులూ, తోటి సిబ్బందీ పాల్పడిన దారుణం గురించి బహిరంగపరచడం పెద్ద సాహసమే! అందులోనూ, విచారణ కోసం వచ్చిన న్యాయమూర్తులనే బెదిరించినట్టు ఆరోపణలున్న పోలీసు అధికారులు తన పట్ల భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తారో ఆమెకు తెలియదనుకోలేం. కానీ న్యాయం పక్షాన నిలబడిన ఆమె భయాలే నిజమైతే, నిజం చెప్పడానికి ముందుకొచ్చేవారికి దారులు మూసుకుపోయినట్టే!


‘మా శాఖ సిబ్బందికి వ్యతిరేకంగా నేను వాఙ్మూలం ఇచ్చినందుకు ఉన్నతాధికారులు నన్ను లక్ష్యంగా చేసుకొని వేధిస్తారేమోనని ఆందోళనగా ఉంది.’




సుమోటో నుంచి సీబీఐ దాకా..

తమిళనాడులోని సాత్తాన్‌కూళమ్‌ ఘటనలో పోలీసుల పైశాచికత్వం పౌర సమాజాన్ని నివ్వెరపరచింది.. గాయపడిన జయరాజ్‌, బెన్నిక్స్‌లకు తీవ్రంగా రక్తస్రావం అవుతున్న స్థితిలో ఆసుపత్రికి తీసుకువెళ్ళాలని ఆదేశించాల్సిన స్థానిక మేజిస్ట్రేట్‌ వారిని జైలుకు తీసుకువెళ్ళాలని ఆదేశాలు ఇవ్వడం, దీన్ని సహజమరణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిసామి చేసిన ప్రకటన తమిళ ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. తమిళ స్టార్స్‌ రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, విజయ్‌, సూర్య, జయం రవి, లారెన్స్‌, హీరోయిన్లు తాప్సీ, కాజల్‌లతో సహా పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. జూన్‌ 24న ఈ కేసును మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌ సుమోటోగా స్వీకరించింది. సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడంతో దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు తమిళనాడు డీజీపీకి, తూతుక్కుడి జిల్లా ఎస్పీకి జాతీయ మానవహక్కుల కమిషన్‌  నోటీసులు జారీ చేసింది. కాగా, అయిదుగురిపై ఐపిసి 302 సెక్షన్‌ కింద హత్యా నేరం నమోదు చేసిన ిసీబీ - సీఐడీ అరెస్ట్‌ చేసింది. వారిలో సాత్తాన్‌కుళమ్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌,  ఇద్దరు ఎస్‌ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్ళు ఉన్నారు. 

Updated Date - 2020-07-05T05:30:00+05:30 IST