అలసత్వం వహిస్తే సంపూర్ణ లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-04-11T14:41:45+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసే దిశగా కఠిన నిబంధనలతో పాక్షిక లాక్‌డౌన్‌ శనివారం నుంచి అమలులోకి వచ్చింది. ఇరవై రోజుల

అలసత్వం వహిస్తే సంపూర్ణ లాక్‌డౌన్‌

  - కఠిన చర్యలు అమలు

  - ప్రభుత్వ హెచ్చరిక


చెన్నై: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసే దిశగా కఠిన నిబంధనలతో పాక్షిక లాక్‌డౌన్‌ శనివారం నుంచి అమలులోకి వచ్చింది. ఇరవై రోజులపాటు అమలుచేయనున్న లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించకుంటే మునుపటిలా సంపూర్ణ లాక్‌డౌన్‌, కర్ఫ్యూ విధించాల్సి వస్తుందని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. గత మార్చి నెల ప్రారంభంలో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టినా గత 45 రోజులలో కేసుల సంఖ్య పదింతలకు పెరగటంతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు  దిగ్ర్భాంతికి గురయ్యారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా కరోనా పాజిటివ్‌ కేసులు ఐదువేలు దాటాయి. చెన్నైలో 1700లకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌రంజన్‌, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులతో సమావేశమై వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిపిన సమావేశంలో రాజీవ్‌రంజన్‌ పాల్గొన్నారు. ఈ రెండు సమావేశాల తర్వాత రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఈ నెల 10 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా పాక్షిక లాక్‌డౌన్‌ అమలవుతుందని ప్రకటన జారీ చేశారు. థియేటర్లలో షాపింగ్‌మాల్స్‌, వాణిజ్య సంస్థలలో 50 శాతం మందిని అనుమతించటం, దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌లో హోటళ్లు, రెస్టారెంట్లు, టీషాపులలో కస్టమర్లంతా తప్పనిసరిగా మాస్కులు ధరించటం, రాష్ట్రంలోని ఆలయాల్లో  ఉత్సవాలన్నింటిని రద్దు చేయడం, వివాహాది శుభకార్యాలలో 100 మందిని, అశుభ కార్యాలలో 50 మందిని మాత్రమే అనుమతించటం,  ప్రభుత్వ రవాణా సంస్థ, ప్రైవేటు సంస్థల బస్సులలో నిలిచి ప్రయాణించడంపై నిషేధం విధించడం వంటి నిబంధనలతో ఈ కొత్త పాక్షిక లాక్‌డౌన్‌ శనివారం ఉదయం నుంచి రాష్ట్రమంతటా అమలులోకి వచ్చింది. శనివారం ఉదయం నుంచి రాష్ట్రమంతటా 70 శాతం మంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖాలకు మాస్కులు ధరించి సంచరించారు. థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులతో సినిమాలను ప్రదర్శించారు. హోటళ్లలో, టీ షాపులలో 50 శాతం కస్టమర్లనే అనుమతించారు. ఇక పెట్రోలు బంకుల యజమానులు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోయినా మాస్కుల ధారణను నిర్బంధం చేసే రీతిలో తీసుకున్న నిర్ణయం పట్ల్ల అధికారులు హర్షం ప్రకటిస్తున్నారు. పెట్రోలు బంకుల వద్దకు వచ్చే వాహన చోదకులు ముఖాలకు మాస్కులు ధరించి వస్తేనే పెట్రోలు పోస్తామని ప్రకటించారు. 


నిఘా కమిటీలు

రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లో నిఘా కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. ఈ నిఘా కమిటీ సభ్యులు సాధారణ వ్యక్తుల్లా సంచరిస్తూ థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లను బస్సుల రాకపోకలను పరిశీలిస్తుంటారు. కరోనా నిబంధనలు పాటించలేదని తెలిస్తే వెంటనే థియేటర్లు, హోటళ్లు సహా సంస్థలో తక్షణమే నోటీసులు జారీ చేస్తారు. ఇలా నిఘా కమిటీల ద్వారా ఓ సంస్థగానీ, థియేటర్లుగానీ రెండు నోటీసులు అందుకుంటే వాటి లైసెన్సును రద్దు చేయనున్నారు. ఈ నిఘా కమిటీలకు తోడుగా కార్పొరేషన్‌, పురపాకల సంఘాల అధికారులు కూడా మాస్కులు ధరించనివారికి, వాటిని సక్రమంగా ధరించనివారికి స్పాట్‌ఫైౖన్లు విధించేందుకు సిద్ధమవుతున్నారు.


ఆంధ్రా, కర్నాటక, పుదుచ్చేరి ప్రజలకు ఈ-పాస్‌ అవసరం లేదు

పాక్షిక లౌక్‌డౌన్‌ నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఈ-పాస్‌ అవసరం లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వం శనివారం ఓ ప్రకటన జారీ చేసింది. ఈ మూడు రాష్ట్రాలకు చెందినవారు తప్పనిసరిగా ఈ-పాస్‌లు పొందాలని సామాజిక ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలని పేర్కొంది. ఈ మూడు రాష్ట్రాలు మినహా తక్కిన అన్ని రాష్ట్రాలకు చెందినవారు. విదేశాల నుండి వచ్చేవారు తప్పనిసరిగా ఈ-పాస్‌ పొందాలని ప్రకటించింది. చెన్నై విమానాశ్రయంలో శనివారం నుంచి ఈ-పాస్‌ విధానం అమలులోకి వచ్చినట్టు అధికారులు తెలిపారు.


వారాంతపు సెలవు దినాల్లో సముద్రతీర సందర్శనపై నిషేధం

కరోనా నిరోధక చర్యలలో భాగంగా శని, ఆదివారాల్లో చెన్నై మెరీనాబీచ్‌ సహా తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాలోని సముద్రతీర ప్రాంతాల్లో ప్రజల సందర్శనపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. సినిమా థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలవుతున్న సందర్భంలో వారం రోజులపాటు 50 శాతం ప్రేక్షకులను అనుమతిస్తూ అదనంగా మరొక షోను ప్రదర్శించుకోవచ్చునని పేర్కొంది. ఇక ఆలయాలు, మసీదులు, చర్చిలలో ఆరాధన, పూజలు, భక్తుల సందర్శనను కరోనా నిరోధక నిబంధనల పాటింపు మధ్య రాత్రి 10 గంటల వరకూ కొనసాగించుకోవచ్చునని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే ఆలయాలు, క్రైస్తవ, ముస్లీం ప్రార్థనాలయాలలో వివాహాలు తదితర వేడుకలను జరుపరాదని ఆంక్షను విధించింది.


కోయంబేడులో చిల్లర వ్యాపారాలకు పాక్షిక అనుమతి?

పాక్షిక లాక్‌డౌన్‌ అమలులో భాగంగా కోయంబేడు మార్కెట్‌లో చిల్లర వ్యాపారాలపై ప్రభుత్వం నిషేధం విధించడంపై వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌లో 1800 కాయగూరల దుకాణాలు, 720 పండ్ల దుకాణాలను చిల్లర వ్యాపారులు నిర్వహిస్తున్నారు. ఈ దుకాణాలకు వారు ప్రతినెలా అద్దెలు సక్రమంగా చెల్లిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ వ్యాపారాలను పూర్తిగా నిషేధించడం తగదని శుక్రవారం ధర్నా నిర్వహించారు. దీనితో సీఎండీఎ అధికారులు, కోయంబేడు వాణిజ్య సముదాయం చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోవిందరాజన్‌ ఇతర అధికారులు చిల్లర వ్యాపారుల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆ సందర్భంగా చిల్లర వ్యాపారులు కొన్ని ప్రతిపాదనలు చేశారు. కోయంబేడు మార్కెట్‌లో రోజూ 50 శాతం చిల్లర దుకాణాలను రొటేషన్‌ పద్దతిపై నడిపేందుకు అనుమతివ్వాలని, లేకుంటే రోజూ రాత్రి 12 నుంచి ఉదయం ఏడు గంటల దాకా చిల్లర వ్యాపారాలు నడిపేందుకు అనుమతించవచ్చునని వ్యాపారులు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో శనివారం కోయంబేడు మార్కెట్‌లో చిల్లర వ్యాపారాలను అధికారులు అనుమతించారు.

Updated Date - 2021-04-11T14:41:45+05:30 IST