ఆ కిక్కే వేరు!

ABN , First Publish Date - 2020-02-22T08:44:25+05:30 IST

ఆ కిక్కే వేరు!

ఆ కిక్కే వేరు!

నచ్చిన బ్రాండ్‌ కోసం 

సరిహద్దులు దాటుతూ...

తెలంగాణ, తమిళనాడుల్లోని 

దుకాణాలు కళకళ 

రోజుకు రూ.10 లక్షల 

వరకూ మద్యం విక్రయాలు

నాలుగు నెలల్లోనే 

వ్యాపారం నాలుగింతలు 

సరిహద్దు పొడవునా 

వెలుస్తున్న బెల్టుషాపులు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ‘ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా... అక్కడేమో సర్కారుకు నచ్చిన బ్రాండ్‌ ఉంది.. ఎక్కువ రేటుతో ఇష్టం లేని మందు ఉంది... ఇక్కడేమో కోరుకున్న బ్రాండ్‌ ఉంది. ఇష్టమైన మద్యం తక్కువ రేటుకే ఉంది’ అంటూ మద్యంప్రియులు జల్సా చేస్తున్నారు. రాష్ట్రంలోని మద్యాన్ని కాదని పొరుగు రాష్ట్రాల్లో దొరికే మందు కోసం తహతహలాడుతున్నారు. నచ్చిన బ్రాండ్‌, కోరుకున్న మద్యం తక్కువ ధరకే దొరుకుతుండటంతో తెలంగాణ, తమిళనాడుకు క్యూ కడుతున్నారు. ఫలితంగా సరిహద్దుల్లో ఉన్న మద్యంషాపులు వెలవెలబోతుండగా, పొరుగు రాష్ట్రాల్లో దుకాణాలు మాత్రం పగలు, రాత్రి తేడా లేకుండా కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. ఏపీలో నూతన మద్యం పాలసీ పుణ్యమాని అక్కడి షాపుల్లో వ్యాపారం నాలుగు నెలల్లోనే నాలుగింతలకు పైగా పెరిగిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యంషాపులు నిర్వహిస్తున్నా, మండలానికి ఒకటి రెండు మాత్రమే ఉండటం, పొరుగు రాష్ట్రాల్లో కంటే అధికంగా ధర ఉండటంతో పాటు తమకు ఇష్టంలేని బ్రాండ్లు అమ్మడం లాంటి కారణాలతో మద్యంప్రియలు అనాసక్తి చూపుతున్నారు. ఇక్కడి షాపుల్లో సిట్టింగ్‌కు అనుమతులు లేకపోవడం కూడా వారిని అటుువైపు మళ్లేలా చేస్తోంది. 


తెలంగాణకు కాసుల వర్షం 

కృష్ణాజిల్లా సరిహద్దుల్లో తెలంగాణ వైపు ఉన్న మద్యం దుకాణాలకు కాసుల వర్షం కురుస్తోంది. గతంలో అక్కడి దుకాణాల్లో రోజుకి రూ.లక్ష జరిగే విక్రయాలు ఇప్పుడు రూ.5-10లక్షలకు పెరిగాయి. వీరులపాడు మండలం జయంతి, జుజ్జూరు దుకాణాల్లో కలిపి మద్యం విక్రయాలు రోజుకి రూ.2లక్షలు మాత్రమే. ఇదే మండలాన్ని ఆనుకుని తెలంగాణలో ఉన్న ఎర్రుపాలెంలోని మద్యం దుకాణంలో రోజుకి రూ.6లక్షలు, మీనవోలు దుకాణంలో రూ.5లక్షలు, దెందుకూరు, మడుపల్లి దుకాణాల్లో రూ.3లక్షల చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేట, గండ్రాయి దుకాణాలు రెండూ కలిపి రోజుకి రూ.2లక్షల్లోపే వ్యాపారం చేస్తుంటే ఇక్కడికి కూతవేటు దూరంలో ఉన్న సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్‌రోడ్డులోని దుకాణం ఒక్కటే రోజుకి రూ.10లక్షల విక్రయాలు చేస్తోంది. దొండపాడు దుకాణంలో రూ.4.50లక్షల అమ్మకాలు జరుగుతున్నాయి.  వత్సవాయిలోని రెండు దుకాణాల్లో రోజుకి రూ.లక్ష వ్యాపారం జరుగుతోంది. జి.కొండూరు మండలం గంగినేనిపాలెం, దుగ్గిరాలపాడు, తెల్లదేరపాడు, సున్నంపాడు, చెర్వుమాధవరంలోని మద్యంప్రియులు పక్కనే ఉన్న ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలోని బెల్ట్‌షాపుల్లో మందు కొంటున్నారు. అక్కడే కూర్చొని తాగుతున్నారు. చిన్నగ్రామమైన మైలవరం మండలంలో అనంతరం, పొందుగల, చండ్రగూడెం నుంచి ఎర్రుపాలెం మండలం గౌరవరం గ్రామానికి, మొర్సుమిల్లి నుంచి తెలంగాణలోని రాజపాలెం, అడవివెంకటాపురం గ్రామాల్లోని బెల్టు దుకాణాలకు, తిరువూరుతో పాటు కోకిలంపాడు గ్రామం నుంచి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మర్లకుంట గ్రామానికి మందుబాబులు క్యూ కడుతున్నారు. తిరువూరు బార్‌లో ధర అధికంగా ఉండటంతో 3కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ గ్రామాలకు పెద్దఎత్తున మద్యంప్రియులు తరలిపోతున్నారు. గంపలగూడెం మండలం గోసవీడు గ్రామం నుంచి ఎర్రుపాలెం మండలం బనిగళ్లపాడు, మీనవోలు, మధిర మండలంలోని రాజవరం గ్రామాలకూ వెళ్తున్నారు. ఇక్కడి వైన్‌షాపుల్లో విశ్రాంత గదులు తీసివేయడంతో తెలంగాణలోని మద్యం దుకాణాలకు వెళ్లి అక్కడే తాగి వస్తున్నారు. మరికొందరు కొనుగోలు చేసి పొలాల్లో, చెట్ల కింద కూర్చొని తాగేస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు న్యూసెన్స్‌ కేసులు పెడుతున్నారు.  పైగా ఏపీలోని దుకాణాల్లో ఎంపిక చేసిన బ్రాండ్లు మాత్రమే విక్రయిస్తున్నారు. ధర ఎక్కువ వసూలు చేస్తున్నారు. దీంతో అధిక శాతం మందుబాబులు తెలంగాణ వైపు మొగ్గుచూపుతున్నారు. కర్నూలు జిల్లా నుంచి తెలంగాణలోని అలంపూర్‌ మండలంలో ఉన్న మద్యం దుకాణాలకు క్యూ కడుతున్నారు. అక్కడ రోజుకు రూ. 4లక్షల వరకూ అదనపు అమ్మకాలు జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. వీరివల్ల గద్వాల జిల్లాకు రోజుకు రూ.10- 15లక్షల ఆదాయం పెరిగిందని ఆబ్కారీ అధికారుల అంచ నా. కృష్ణానది నుంచి పుట్టీల్లో తెలంగాణ లిక్కర్‌ను ఆంధ్రాకు తరలించి బెల్టుషాపుల ద్వారా విక్రయిస్తుండడంతో నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్‌, దోమలపెంట, పెంట్లవెల్లిలో బాగా గిరాకీ ఏర్పడింది. 


తమిళ షాపులు కళకళ 

నెల్లూరు జిల్లాలో తడ, సూళ్లూరుపేట తమిళనాడు సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు. 6నెలల క్రితం పాత మద్యం విధానం ఉన్నప్పుడు సరిహద్దుల్లోని బీవీపాళెం, తడ, రామాపురం, పెరియవట్టు, కారూరుమిట్ట, టీవీనగర్‌ కుప్పం తదితర షాపుల్లో మద్యాన్ని తమిళనాడు వాసులు సైతం ఎగబడి కొనేవారు. పగలు, రాత్రి తేడా లేకుండా జనంతో కిటకిటలాడేవి. దాంతో తడ మండలంలోని 15 షాపులు నిత్యం కళకళలాడేవి. రోజుకు సరాసరిన రూ.లక్ష- 2లక్షల వ్యాపారం జరిగేది. అయితే రాష్ట్రంలో గత సెప్టెంబరు నుంచి ప్రభుత్వమే మద్యంషాపులు నడుపుతోంది. షాపుల సంఖ్యను సగానికి పైగా తగ్గించడంతో పాటు మద్యం ధరలు సైతం విపరీతంగా పెంచారు. గతంలో హెచ్‌డీ మద్యం(చీప్‌ లిక్కర్‌) ప్యాకెట్‌ రూ.50-60కి అమ్మేవారు. పేరున్న బ్రాండ్‌ ధర క్వార్టర్‌ రూ.80- 160వరకు ఉండేది. అయితే ప్రభుత్వం ధరలు పెంచిన తర్వాత హెచ్‌డీ మద్యం ప్యాకెట్‌ రూ.100కు అమ్ముతుండగా సాధారణ బ్రాండ్‌ నుంచి ఖరీదైన మద్యం రూ.120-250 వరకు నిర్ణయించారు. దీంతో తమిళనాడులో షాపులు ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. రెండురోజుల క్రితం అక్కడి ప్రభుత్వం సైతం రూ.20వరకు మద్యం ధరలు పెంచింది. అయినా అక్కడ ఎప్పుడైనా మద్యం దొరుకుతుండటంతో మందుబాబులు ఎగబడుతున్నారు. అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 12నుంచి రాత్రి 10గంటల వరకు మద్యాన్ని అమ్మల్సి ఉంది. అలాగే ఒక్కొక్కరు ఎన్ని బాటిళ్లయినా కొనుగోలు చేయవచ్చు. దీంతో కొంతమంది ఇక్కడ మద్యాన్ని పెద్దఎత్తున కొనుగోలు చేసి చుట్టుపక్కల గ్రామా ల్లో మన ప్రభుత్వం అమ్మే రేటుకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఒకప్పుడు రోజుకు రూ.50-60వేల వరకే అమ్మకాలు జరిపే తమిళనాడు షాపుల్లో ప్రస్తుతం రూ.2- 2.50లక్షల వ్యాపారం జరుగుతోంది. 



Updated Date - 2020-02-22T08:44:25+05:30 IST