Abn logo
Oct 20 2021 @ 10:13AM

New York Times square వద్ద ‘తానా’ బతుకమ్మ సంబరాలు

మొట్టమొదటిసారిగా ది న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద అంబరాన్నంటిన ‘తానా’ బతుకమ్మ సంబరాలు

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో ఈనెల 16న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నిర్వహించిన బంగారు బతుకమ్మ విశ్వావేదికపై మునుపెన్నడూ జరగని ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ప్రముఖమైన మన తెలుగు పండగను మొట్టమొదటిసారి ప్రపంచవ్యాప్తంగా విశ్వవేదికపై ఘనంగా నిర్వహించిన ఘనతని తానా సొంతం చేసుకుంది. ఎప్పుడూ జనంతో కిటకిటలాడే టైమ్ స్క్వేర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై 20 అడుగుల ఎత్తుతో బతుకమ్మను తీర్చిదిద్దారు. విశ్వవేదికపై మొట్టమొదటిసారిగా ఒక తెలుగు ఈవెంట్ అందులోనూ బతుకమ్మ సంబరాలు నిర్వహించడం తెలుగువారందరూ గర్వించదగిన విషయం. లార్జర్ దాన్ లైఫ్ రేంజిలో విశ్వనగరంలో ఏర్పాటుచేసిన 20 అడుగుల బంగారు బతుకమ్మ చరిత్ర పుటల్లో నిలుస్తుంది. 

400కు పైగా తెలుగు వారు న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌లతో పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి తెలుగువారు టైమ్ స్క్వేర్‌ వద్దకు చేరుకున్నారు. క్షేమాన్ని, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో ఆడపడుచులు తాము తయారు చేసిన బతుకమ్మలతో కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు జరిగిన ఈ వేడుకలను తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి  జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ పండగను విశ్వవేదిక మీద జరుపుకోడం గర్వంగా ఉందని, మన తెలుగుజాతి సంస్కృతిని ప్రపంచానికి తెలియజేశామన్నారు. ఈ వేడుకలో తెలుగువారందరికి సమాచారం అందించి వారందరిని సమన్వయ పరిచి ఈ ఉత్సవం  విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన తానా కల్చరల్ కోఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల కృషిని అధ్యక్షుడు అభినందించారు. 


తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి  నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలు టైమ్ స్క్వేర్‌ను వైవిధ్య భరితమైన పూలవనంగా మార్చాయి. ఈ సందర్భంగా జయశేఖర్ మాట్లాడుతూ, మన సంప్రదాయంలో దేవుళ్ళని పూలతో పూజించే మనం, ఈ పండగకి మాత్రం పూలనే దేవుళ్లుగా చేసి పూజించటంలోని విశిష్టతను తెలియజేశారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ నిరంజన్ శృంగవరపు  మాట్లాడుతూ తానా వినూత్నమైన కార్యక్రమాలు చేస్తుందన్న తమ మాటని రుజువుచేసుకుంటూ ఇంకా సంస్థ ప్రతిష్టను పెంచే కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ వేడుకకు అమెరికాలోని వివిధ నగరాల నుంచి విచ్చేసిన సంస్థ సెక్రెటరీ సతీష్ కుమార్ వేమూరి, కోశాధికారి అశోక్ కొల్లాలతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, బోర్డు ఆఫ్ ట్రస్టీలు, ఫౌండేషన్ ట్రస్టీలు ఈ పండగ తెలుగు వారి సంప్రదాయాలని ప్రపంచానికి చాటిచెప్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌కు చెందిన జట్లు సమన్వయం చేశాయి. 20 అడుగుల బతుకమ్మని పేర్చడానికి కృషి చేసిన న్యూజేర్సీ BOD లక్ష్మి దేవినేని అభినందించారు. 

బ్రూక్లీన్ బరో ప్రెసిడెంట్ ఆఫీసు ప్రతినిధిగా విచ్చేసిన దక్షిణ ఆసియా డైరెక్టర్ దిలీప్ చౌహాన్ తెలుగు సంస్కృతిని చాటి సేవ చేస్తున్న తానాకి మేయర్ ద్వారా జారీ చేయబడిన అభినందన పత్రాన్ని అందజేశారు. న్యూజెర్సీ యుటిలిటీస్ కమిషనర్ చివుకుల ఉపేంద్ర తానా కృషిని అభినదించి తెలుగు వారికి ఎలాంటి అవసరాలున్నా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా హాజరై తానా చేసిన ఈ బృహత్కార్యక్రమాన్ని ప్రశంసించారు. వేదిక పరిసరాలలో ఎటు చూసినా రంగు రంగుల పూలే కనిపించాయి. ఆ పూలతో పోటీపడుతూ పట్టు చీరలలో వెలిగిపోతూ, సాంప్రదాయం బద్ధమైన  అలంకారాలతో  తెలుగుదనం ఉట్టి పడుతున్న తెలుగు ఆడపడుచుల ఉత్సాహభరితమైన బతుకమ్మ పాటలు, నృత్యాలతో టైమ్ స్క్వేర్ తెలుగు రాష్ట్రాలలో జరిగే వేడుకలను మైమరపించింది.


వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన సభ్యులు సంప్రదాయ నృత్యాలు, మహిషాసుర మర్ధిని నృత్య రూపకం, చిన్నారుల జానపద నృత్యాలను ప్రదర్శించి ఆహ్వానితులని ఆనందింపజేశారు. కార్యవర్గం ఆహ్వానితులకు తెలుగు వంటకాలతో కమ్మని విందు అందించారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా సభ్యులంతా పెద్ద సంఖ్యలో హాజరై ఆటపాటలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని లైవ్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసిన TV9కి తానా నేతలు కృతజ్ఞతలు అందజేశారు. ఇంతటి మహా కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడానికి వారాల తరబడి కృషి చేసిన వాలంటీర్లకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...