‘మనం’ అనుకుంటేనే...ముందడుగు!

ABN , First Publish Date - 2020-03-01T21:05:57+05:30 IST

రావనుకున్న లెక్కలు, రెక్కలు కట్టుకుని మరీ వాలాయి. కొరుకుడుపడని ఇంగ్లిష్‌ ఆ చిత్తశుద్ధికి మురిసిపోయి, ‘కంగ్రాచ్యులేషన్స్‌’ అంటూ అభినందించింది. సమాజానికి నా

‘మనం’ అనుకుంటేనే...ముందడుగు!

రావనుకున్న లెక్కలు, రెక్కలు కట్టుకుని మరీ వాలాయి. కొరుకుడుపడని ఇంగ్లిష్‌ ఆ చిత్తశుద్ధికి మురిసిపోయి, ‘కంగ్రాచ్యులేషన్స్‌’ అంటూ అభినందించింది. సమాజానికి నావంతుగా ఏమీ చేయలేనా అన్న వెలితిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం తీర్చిపెట్టింది. నేను నుంచి మనం వైపుగా తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌ ప్రయాణం ఆయన మాటల్లోనే...


నన్ను వేధిస్తున్న మూడు ప్రశ్నలు... మొత్తంగా నా జీవితాన్నే మార్చేశాయి. నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చాయి. జీవితమేమీ ఎన్‌సైక్లోపీడియా కాదు, అడిగిన వెంటనే జవాబు ఇవ్వడానికి. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ కూడా కాదు. మీట నొక్కగానే పరిష్కారం చూపడానికి. దేనికైనా సమయం రావాలి. ఓ సందర్భం ఉండాలి. అలాంటి మూడు విలువైన సమయాలూ, కీలకమైన సందర్భాలూ నా జీవితాన్ని మార్చేశాయి.


భద్రాచలం దగ్గర ఓ పల్లెటూరు మాది. ఊరిపేరు విరివెండి. నాన్న పంచాక్షరయ్యగారు. అమ్మ భారతీదేవి. గుడివాడ దగ్గర ఓ గ్రామం అమ్మ పుట్టిల్లు. ఏడుగురు సంతానంలో నేను ఒకడిని. నా బాల్యమంతా కాకినాడలోనే గడిచిపోయింది. సెలవులకి మాత్రం ఊరికి వచ్చేవాడిని. నాన్న రాజకీయ నాయకుడు. మాది గిరిజన ప్రాంతం. ఎటు చూసినా పేదరికమే. కష్టాలనూ కన్నీళ్లనూ చూస్తూ పెరిగాను. రవాణా సౌకర్యం ఉండేది కాదు. మాకు జీపులు, ఇతర వాహనాలు ఉండేవి. దీంతో ఎవరికి ఏ వైద్యపరమైన అవసరం వచ్చినా పరిగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చేవారు. నాన్నగారు డ్రైవరును ఇచ్చి పంపేవారు. సామాజిక కార్యక్రమాల కోసం ఆయన ఆస్తుల్ని అమ్మిన సందర్భాలూ ఉన్నాయి. రోజూ మా ఇంట్లో ఇరవై ముప్పై మంది భోంచేయాల్సిందే. చిట్టచివరి పంక్తిలో అమ్మ కూర్చునేది. నలుగురికి సాయం చేయడంలోని ఆనందం అమ్మానాన్నల్ని చూసే తెలుసుకున్నాను. 


మా ఊళ్లో మాంకాళి కృష్ణ అనే కుర్రాడూ, నేనూ ఒకేరోజు పుట్టాం. నేనేమో... కాకినాడలో, రాయచూర్‌లో చదువుకుంటూ - సెలవులకు ఊరికి వెళ్లేవాడిని. తనేమో మా ఇంట్లో పనిచేసుకుంటూ బతుకు వెళ్లదీసేవాడు. నేను ఈ ఇంట్లో పుట్టాను కాబట్టి ఇలా ఉన్నాను. తను ఆ ఇంట్లో పుట్టాడు కాబట్టి అలా ఉన్నాడు. మాంకాళి కృష్ణనూ ప్రోత్సహించి ఉంటే, నాలానే చదువుకునేవాడేమో? సమాజం ఎందుకా అవకాశం ఇవ్వలేదు? ఇలాంటివాళ్ల కోసం నా వంతుగా ఏమీ చేయలేనా? - ఇలా రకరకాల ఆలోచనలు నన్ను స్థిమితంగా ఉండనిచ్చేవి కాదు. అందుకేనేమో చదువు మీద పెద్దగా ఆసక్తి చూపించేవాడిని కాదు. దీంతో అత్తెసరు మార్కులు వచ్చేవి. ఫలితంగా ఓరకమైన ఆత్మన్యూనత వేధించేది. దానికితోడు, నన్ను ఎంతోకాలంగా వెంటాడుతున్న ప్రశ్నలొకటి. 


మొదటి ప్రశ్న....

గణితం మీద పట్టు సాధించగలనా?

నా ప్రాథమిక విద్య అంతా కాకినాడలోనే. ఇంటర్మీడియట్‌ మాత్రం భద్రాచలంలో చేర్పించారు. నేను లెక్కల్లో చాలా వీక్‌. ఆ సబ్జెక్టు అంటేనే ఓరకమైన భయం. అమ్మకేమో నేను డాక్టరో ఇంజినీరో కావాలని కోరిక. దీంతో అయిష్టంగానే ఎంపీసీలో చేరిపోయాను. ఓసారి ఓ స్నేహితుడి తండ్రి మా ఇంటికి వచ్చారు. నా ప్రతిభను పరీక్షించాలని అనుకున్నారో ఏమో... లెక్కల్లో కొన్ని ప్రశ్నలు అడిగారు. అన్నీ చిన్నచిన్నవే. ఒక్కదానికీ జవాబు చెప్పలేకపోయాను. దీంతో చులకనగా మాట్లాడారు. చాలా బోళా మనిషి. ఆయన తత్వమే అంత. అయినా నాకు అవమానంగా అనిపించింది. గణితం అంతు చూడాలన్న కసి మొదలైంది. పాఠ్యపుస్తకాల్ని ముందేసుకుని కూర్చుంటేనేమో ఒక్క ముక్కా అర్థం కాలేదు. దీంతో ప్రాథమిక సూత్రాలతో మొదలుపెట్టాను. స్నేహితుల సాయంతో సందేహాలు తీర్చుకున్నాను. నన్ను నేను పరీక్షించుకోడానికి బెటర్‌మెంట్‌ రాశాను. గణితంలో వందశాతం మార్కులు వచ్చాయి. ఆ విజయం గుండెబలాన్ని ఇచ్చింది. నన్ను వేధిస్తున్న ఓ తీవ్ర సమస్యకు జవాబు దొరికింది. ధైర్యంగా ఇంజినీరింగ్‌లో చేరాను. 


రెండో ప్రశ్న...

ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలనా?

గుల్బర్గా యూనివర్సిటీలో సీటొచ్చింది. మెకానికల్‌ ఇంజినీరింగ్‌. మంచి మార్కులతో పట్టా అందుకున్నాను. అప్పట్లో ఇంజినీర్లకు పెద్దగా అవకాశాలు ఉండేవి కాదు. భద్రాచలం పేపర్‌బోర్డ్స్‌లో ఉద్యోగం సంపాదించుకో గలిగితే చాలు, జీవితంలో స్థిరపడినట్టే అనుకునేవాడిని. అదృష్టమో దురదృష్టమో... నాకు అక్కడ ఉద్యోగం రాలేదు. ఆ ప్రయత్నాల్లో మూడునాలుగేళ్లు వృథాగా గడిచిపోయాయి. ‘ఇప్పుడేం చేయాలి?’ అన్న ప్రశ్న ఎదురైంది. అప్పటికే అన్నయ్య రాజా జమైకాలో డాక్టర్‌. నేనూ అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. జమైకా చక్కని దేశం. మనుషులూ మంచివాళ్లే. అక్కడ ఓ కాలేజీలో మ్యాథ్స్‌ లెక్చరర్‌గా చేరాను. అప్పటికి నా ఇంగ్లిష్‌ పరిజ్ఞానం అంతంతమాత్రమే. దీనికి నా గ్రామీణ నేపథ్యం ఓ కారణం కావచ్చు. విద్యార్థులు నా తడబాటునూ, ఉచ్ఛారణనూ చూసి నవ్వుకునేవారు. ఆ చేదు అనుభవం, ఇంగ్లిష్‌ మీద పట్టుసాధించాలనే పట్టుదలను పెంచింది. ఆరు నెలల సాధనతో అనర్గళంగా మాట్లాడగలిగాను. డిక్షనరీ మొత్తం బట్టీ పట్టేశాను. ఆ ఆత్మవిశ్వాసంతో అమెరికాను నా తదుపరి మజిలీగా ఎంచుకున్నాను. 


మా చెల్లి భర్త... ప్రవీణ్‌ అప్పటికే అమెరికాలో వ్యాపారం చేస్తున్నారు. నేనూ భాగస్వామిగా చేరాను. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విశ్వమంతా విస్తరిస్తున్న సమయం అది. నాకూ బొత్తిగా పరిచయం లేని రంగం. మొదట్లో గణితం నేర్చుకున్నట్టే, ఆతర్వాత ఆంగ్లం మీద పట్టు సాధించినట్టే... వ్యాపారంలోనూ మెలకువలు తెలుసుకున్నాను. పదేళ్ల తర్వాత ఆ సంస్థను ఐసీఐసీఐ బ్యాంకుకు విక్రయించాం. కొత్తగా, హాల్‌మార్క్‌ గ్లోబల్‌ టెక్నాలజీస్‌ను ప్రారంభించాం. ఇదీ ఐటీ సర్వీసుల వ్యాపారమే. అమెరికా, భారత్‌లలో శాఖలు ఉన్నాయి. స్థానికంగా నలుగురికి ఉపాధి లభిస్తుందన్న ఉద్దేశంతో ఖమ్మంలో స్పిన్నింగ్‌ మిల్లు ప్రారంభించాను. బెంగళూరులోనూ ఓ ఐటీ కంపెనీలో పెట్టుబడులు పెట్టాను. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న హెల్త్‌కేర్‌లోకి ప్రవేశించాం. నింబుల్‌ అకౌంటింగ్‌ అనే ప్రాడక్ట్‌ను తీసుకొచ్చాం.


ఇదో అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌. ఆసుపత్రులకూ, రిటైల్‌ సంస్థలకూ ఉపయోగపడుతుంది. దీంతోపాటే, ఇ-ట్యూటర్‌... పేరుతో ఆన్‌లైన్‌ కోచింగ్‌ సంస్థను మొదలుపెట్టాం. ఆన్‌లైన్‌లో బట్టలూ పుస్తకాలూ షాపింగ్‌ చేసినట్టే, ఆటోపార్ట్స్‌నూ కొనే అవకాశం ఎందుకు ఉండకూడదు? ఆ ఆలోచనతోనే ‘ది ఆటోపార్ట్‌ షాప్‌’ అనే ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశాం. వ్యాపార విజయాన్ని టర్నోవర్‌లో కొలవడం నాకు ఇష్టం ఉండదు. మన సంస్థల వల్ల ఎంతమందికి ఉపాధి లభించింది, మన ఉత్పత్తి ప్రజల జీవితాల్ని ఏమేరకు ప్రభావితం చేసింది... అన్నదే నాకు ముఖ్యం. 


మూడో ప్రశ్న.

నా వంతుగా సమాజానికి ఏమీ చేయలేనా?

అమెరికాకు వెళ్లకముందు నుంచే తానా గురించి వినేవాడిని, చదివేవాడిని. అనుకోకుండా ఓసారి తానా సభల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. వేలమంది తెలుగువారిని ఓచోట చూడటం గొప్ప అనుభూతి. ఎంతోకాలంగా వేధిస్తున్న ఓ ప్రశ్నకు, తానా సామాజిక కార్యక్రమాల్లో జవాబు దొరికింది. ఇంకేముంది, తానా నా జీవితంలో ఓ భాగమైపోయింది. వాలంటీర్‌గా చేరాను. నాకు అప్పగించిన ప్రతి బాధ్యతకూ సంపూర్ణ న్యాయం చేశాను. నా పట్ల ప్రగాఢమైన విశ్వాసంతో తానా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ప్రవాసులు. మన భాషని, సంస్కృతిని రేపటి తరాలకు అందించాలన్నది తానా లక్ష్యం. బసవతారకం క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌, శంకర ఐ హాస్పిటల్‌, సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సర్వీస్‌... ఇలా ఎన్నో సంస్థలకు వెన్నుదన్నుగా నిలిచింది తానా. వేయి పాఠశాలల్ని పునరుద్ధరించింది. 


నాలుగున్నర వేల పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేసింది. ఇంకొన్ని వేల విద్యాసంస్థల్లో లైబ్రరీలు నెలకొల్పింది. అమెరికాలోని తెలుగువారి కోసం, భారతీయుల కోసం.. తానా టీమ్‌ స్క్వేర్‌ పేరుతో ఓ అత్యవసర సహాయ బృందం నిరంతరాయంగా పనిచేస్తోంది. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా 911 అనే హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయవచ్చు. వాలంటీర్లు క్షణాల్లో రంగంలోకి దిగిపోయి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. ‘పాఠశాల’ పేరుతో నడుస్తున్న తెలుగు బడిని తానా తన నిర్వహణలోకి తీసుకుంది. ప్రస్తుతం ఐదొందలమంది పిల్లలు మాతృభాషను నేర్చుకుంటున్నారు. తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా, సెక్రెటరీగా అనేక కార్యక్రమాలు చేపట్టాను. ‘మన ఊరి కోసం’ అందులో ఒకటి. దాదాపు యాభైగ్రామాల ముఖచిత్రాన్ని మార్చే ప్రయత్నం ఇది. 


భద్రాచలం బాలోత్సవ్‌ బాధ్యతలనూ తానా సంతోషంగా భుజానికి ఎత్తుకుంది. ‘అమ్మ-నాన్న-గురువు’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాం. చిన్నచిన్న పద్యాల రూపంలో పిల్లలకు విలువల విలువ చాటి చెప్పడమే దీని ఉద్దేశం. ఇది కన్నవారికి కనకాభిషేకం, పద్యానికి పట్టాభిషేకం, అమ్మభాషకు అమృతాభిషేకం. ఇప్పటికే కొన్ని లక్షలమంది చిన్నారులు పాల్గొన్నారు. దేశంలో చేనేతరంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో... చింతకింది మల్లేశం ఆసుయంత్రాల్ని వేయి మంది నేతకారులకు ఇవ్వాలన్నది సంకల్పం. ఈ కార్యక్రమంలో ప్రభుత్వాన్నీ భాగస్వామిని చేస్తున్నాం.


 తానా తెలుగు విభాగం ‘ఐటీ సర్వ్‌’లోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నాను. ప్రతి ప్రవాసుడూ పుట్టిన ఊరికి, చదివిన బడికి తోచిన సాయం చేయాలన్న ఆలోచనతో డిస్ర్టిక్ట్‌ ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ను స్థాపించాను. మా కుటుంబ ఆధ్వర్యంలోని తాళ్లూరి పంచాక్షరయ్య ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా... దాదాపు నూటయాభైమంది అనాథలకు చదువులు చెప్పిస్తున్నాం. వాళ్లలో కొంతమంది ఐఐటీలలోనూ చదువుతున్నారు. ఇవన్నీ చాలా సంతృప్తినిచ్చే విషయాలు. వచ్చే ఏడాది జులైలో, తానా 23వ కాన్ఫరెన్స్‌ను ఫిలడేల్ఫియాలో ఘనంగా నిర్వహించబోతున్నాం. నేను అనుకుంటే ఒక అడుగు... మనం అనుకుంటే ముందడుగు... అని బలంగా విశ్వసించే వ్యక్తిని నేను. ఆ నమ్మకమే దారిదీపమై నన్ను ముందుకు నడిపిస్తోంది.

                                                                         

చిన్నప్పుడు మా నాన్నగారు ఎవరికైనా పరిచయం చేసేముందు... ‘ఏం చదువుతున్నావురా?’ అని నన్నే అడిగేవారు. ఆయనకు కుటుంబ విషయాలు పెద్దగా గుర్తుండేవి కాదు. ప్రజా జీవితంలో అంత బిజీగా ఉండేవారు. ఆ మాట అనగానే నాకు చాలా కోపం వచ్చేది. నా జీవిత భాగస్వామి నీలిమ.. సహకారం లేకపోతే నా పరిస్థితీ అలానే ఉండేదేమో! తన వల్లే నేను కుటుంబాన్నీ, వ్యాపారాన్నీ, తానా బాధ్యతల్నీ సమర్థంగా సమన్వయం చేసుకుంటున్నా. సేవా కార్యక్రమాల్లో అన్నయ్య డాక్టర్‌ రాజా సహకారం మరువలేనిది.


Updated Date - 2020-03-01T21:05:57+05:30 IST