డాక్టర్ కాకర్ల సుబ్బారావుకు ‘తానా’ కన్నీటి నివాళి

ABN , First Publish Date - 2021-04-17T00:26:19+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వ్యవస్థాపకుడు, ఆ సంఘం తొలి అధ్యక్షుడు కాకర్ల సుబ్బారావు మరణ వార్త తమను

డాక్టర్ కాకర్ల సుబ్బారావుకు ‘తానా’ కన్నీటి నివాళి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వ్యవస్థాపకుడు,  ఆ సంఘం తొలి  అధ్యక్షుడు కాకర్ల సుబ్బారావు మరణ వార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని  తానా పేర్కొంది. అమెరికాలోని తెలుగు వారందరినీ ఒక చోటికి చేర్చి తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని పరిరక్షించుకునేందుకు, వాటిని భావితరాలకు అందించేందుకు ఒక వేదిక కావాలని భావించి నాలుగు దశాబ్దాల క్రితం తానాకు రూపకల్పన చేసిన మహోన్నత వ్యక్తి సుబ్బారావు అని కొనియాడింది. తెలుగు వారి సేవలో పూర్తిగా నిమగ్నమయ్యేలా తానాను రూపకల్పన చేశారని గుర్తు చేసుకుంది. ఓ గొప్ప వ్యవస్థగా తానాను నిర్మించేందుకు ఎంతగానో శ్రమించారని ప్రశంసించింది.


కాకర్ల సుబ్బారావు సేవలు మరువలేనివని, వెలకట్టలేనివని తానా పేర్కొంది. అందరికీ ఆయన ఆదర్శప్రాయులని, మార్గదర్శకులని కీర్తించింది. వారు లేరన్న వార్తను జీర్ణించుకోవడం కష్టంగా ఉందని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, కార్యవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. డాక్టర్ కాకర్ల సుబ్బారావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు. తానా తరపున కాకర్ల సుబ్బారావుకు అశ్రు నివాళులు అర్పిస్తున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - 2021-04-17T00:26:19+05:30 IST