Abn logo
Mar 1 2021 @ 08:51AM

తానా ఆధ్వర్యంలో ‘భక్త పోతన సాహిత్య వైభవం’ హరికథా గానం

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న 10వ సాహిత్య సమావేశం జరిగింది. అంతర్జాలం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ హరికథా భాగవతార్ డా.ముప్పవరపు వేంకట సింహాచల శాస్త్రి భక్త పోతన సాహిత్య వైభవాన్ని ఆవిష్కరించారు. 


తానా అధ్యక్షులు తాళ్ళూరి జయశేఖర్ తన ప్రారంభోపన్యాసంలో బమ్మెర పోతన.. తెలుగు సాహిత్యానికి దొరికిన విలువ కట్టలేని సహజ కవిరత్నం అని, ఆయన తెలుగు నేలపై పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అని, ఆయన కవితాశైలి అనన్యసామాన్యం, భావుకత అనితరసాధ్యం అని అన్నారు.‘బాల రసాల సాల నవ కోమల కావ్యకన్యకన్ కూలల కిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటే హాలికులైననేమి’ అంటూ సహృదయ సీమలను అక్షర హలాలతో దున్ని, భక్తి భావాలు అనే బీజాలు నాటి, తెలుగు నేలపై ఆధ్యాత్మికత అనే బంగారు పంటలు పండించిన కవన కృషీవలుడు పోతన అని అన్నారు.


“మందార మకరంద మాధుర్యమున దేలు’, ‘నల్లని వాడు పద్మనయనంబులవాడు’, ‘ఇంతింతై వటుడింతై’, ‘రవిబింబంబుపమింప’, ‘సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముంజేదోయి’, ‘ఇందుగలడందులేడని సందేహము వలదు’ లాంటి అమృత గుళికలు లాంటి పద్యాలు ఒకటా.. రెండా వేలకొలది రాసిన కవి పోతన అని, అలాంటి పద్యం ఒకటైనా వినని, నోటికి రాని తెలుగువారు ఉండరనడం అతిశయోక్తి కాదు అని వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అన్నారు.   

             

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ‘హరికథ’ తెలుగు సంస్కృతిలో పేరెన్నికగన్న ఒక గొప్ప ప్రాచీన కళా ప్రక్రియ అని అన్నారు. ఆధునిక కాలంలో హరికథలను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన వారు మాత్రం - సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, అరబ్బీ, ఫార్సీ భాషలలో మహా పాండిత్యం ఉన్న ఆదిభట్ల నారాయణదాసే అని పేర్కొన్నారు. ఒకే భాగవతుడు ఆంగిక,వాచిక, సంగీత, సాహిత్య సమ్మేళనంగా ఏకకాలంలో ప్రదర్శించే ఈ ప్రక్రియ మన పురాణ ఇతిహాసాలలో దాగి ఉన్న భక్తిని, జ్ఞానాన్ని జనరంజకంగా ఆవిష్కరించగల శక్తి ఉన్న కళ అని అభిప్రాయపడ్డారు. ఇటువంటి మన అరుదైన గొప్ప కళా ప్రక్రియలను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.        


డా. సింహాచల శాస్త్రి తెలుగు సాహితీ వినీలాకాశంలో హరికథా వైభవం గురించి వివరించారు.  ఆధునికహరికథకు ఆధ్యులు ఆదిభట్ల నారాయణదాసని, ఇతర భాషల్లో ఉన్న ఈ ప్రక్రియ కంటే తెలుగు భాష లోని హరికథ విశిష్టమైనదని, ఇటువంటి కళను పరిరక్షిస్తున్న తానాకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. కాగా.. పోతన బాల్యంనుంచి ఒక మహా కవిగా ఎదిగిన తీరును, భక్త పోతన రచించిన పద్యాలను అద్భుతంగా గానం చేస్తూ, ఆసక్తికరమైన వ్యాఖ్యానాలతో, హాస్య చతురోక్తులతో అద్భుతంగా రెండు గంటల పాటు కనులకు పసందుగా, వీనుల విందుగా ఈ కార్యక్రమం వీక్షకులను అలరించింది.చివరగా.. భక్త పోతనామాత్యుడి సాహిత్యాన్ని అద్భుతంగా, రాగయుక్తంగా, రసమయంగా ఆవిష్కరించిన ‘వాచస్పతి’, ‘హరికథా చూడామణి’, ‘సంగీత సాహిత్య భూషణ’ భాగవతార్ డా. ముప్పవరపు వేంకట సింహాచలశాస్త్రి, మరియు వాయులీన సహకారం అందించిన లోల్ల జయరాం, మృదంగ సహకారం అందించిన కోటిపల్లి రమేష్ లకు, ఈ కార్యక్రమ విజయానికి కృషి చేసిన సభ్యులందరకీ, వివిధ ప్రసార మాధ్యమాలకు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ధన్యవాదాలు తెలియజేశారు.


Advertisement
Advertisement
Advertisement