మంత్రి కేటీఆర్‌ వద్దకు తాండూరు పంచాయితీ

ABN , First Publish Date - 2022-04-29T08:09:17+05:30 IST

తాండూరు నియోజకవర్గ టీఆర్‌ఎ్‌సలో చెలరేగిన వర్గ విభేదాలు అధిష్ఠానానికి చేరాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ గురువారం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ

మంత్రి కేటీఆర్‌ వద్దకు తాండూరు పంచాయితీ

 మహేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలతో వేర్వేరుగా భేటీ..

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై అధిష్ఠానం సీరియస్‌

నోరు జారినట్లు ఒప్పుకొన్న ఎమ్మెల్సీ.. క్షమాపణ

తన గొంతు కాదని ఖండన.. తర్వాత మాట మార్పు

సీఐని దూషించినందుకు కేసు నమోదు

యాలాల్‌ ఎస్‌ఐ పైనా పరుష పదజాలం.. కేసు!


తాండూరు, ఏప్రిల్‌ 28: తాండూరు నియోజకవర్గ టీఆర్‌ఎ్‌సలో చెలరేగిన వర్గ విభేదాలు అధిష్ఠానానికి చేరాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ గురువారం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో వేర్వేరుగా సమావేశమయ్యారు. తదనంతర పరిణామాలపై శ్రేణుల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే, కేటీఆర్‌తో ఏం మాట్లాడారనే దానిపై వెల్లడించేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ నిరాకరించారు. తాండూరు ప్రజాప్రతినిధుల వర్గ పోరుపై ఇప్పటికే పలుసార్లు కేటీఆర్‌ జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. అయినా సఖ్యత కుదరలేదు. మరోవైపు అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తుండగా.. నాయకుల పోరు తీవ్రమవుతోంది. ఆధిపత్య నిరూపణకు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డిని ఫోన్‌లో దూషించడంపై దుమారం రేగింది. ఆడియో వైరల్‌ కావడం చర్చనీయాంశమైంది. కాగా, ఎమ్మెల్సీ తనను దూషించినట్లు సీఐ రాజేందర్‌రెడ్డి బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే, ఇటీవల యాలాల్‌ మండలంలో రంజాన్‌ కానుకల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్సీ అక్కడి ఎస్‌ఐపై పరుష పదజాలంతో మాట్లాడినట్లు తాజాగా బయటపడింది. ఈ విషయంలోనూ గురువారం మహేందర్‌రెడ్డిపై మరో కేసు నమోదు చేశారు.


మనసు నొప్పించినందుకు విచారిస్తున్నా: ఎమ్మెల్సీ

పోలీసుల మనసు నొప్పించినందుకు విచారిస్తున్నానని, అది తనకూ బాఽధాకరంగానే ఉందని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఫోన్‌లో ఆవేశంతో నోరుజారానని, కొందరు మిత్రులు, పోలీసులు బాధపడితే విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. కాగా, సీఐని దూషించినట్లు వైరలైన ఆడియో తనది కాదని, మార్ఫింగ్‌ అని గురువారం ఉదయం ఎమ్మెల్సీ ప్రకటించారు. కొన్ని గంటల్లోనే మాట మార్చారు. ఘటనపై అధిష్ఠానం సీరియస్‌ కావడంతోనే ఆయన వెనక్కితగ్గినట్లు తెలిసింది. కేటీఆర్‌తో భేటీ తర్వాత.. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు.


దుర్భాషలాడితే క్షమాపణ చెప్పాల్సిందే: ఎమ్మెల్యే

తాండూరు సీఐని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. పోలీసులు, అధికారులను గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు. సీఐని ఎమ్మెల్సీ తిట్టిన ఆడియో పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లిందన్నారు. కాగా.. మహేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా గురువారం ఎమ్మెల్యే వర్గీయులు తాండూరు ఇందిరా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. అటు.. ఆడియోను మార్ఫింగ్‌ చేశారని, మహేందర్‌రెడ్డిని బద్నాం చేసేందుకే ఇలా చేశారని ఎమ్మెల్సీ వర్గీయులు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. మహేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ నేతలు డీఎస్పీ కార్యాలయం ఆయన దిగి దిష్టిబొమ్మను దహనం చేశారు.

Updated Date - 2022-04-29T08:09:17+05:30 IST