‘టంగుటూరు’లో కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-01-22T04:33:55+05:30 IST

టంగుటూరు మండలంలోని వివిధ ప్రభుత్వ విభాగాల అధికారుల్లో కరోనా అలజడి రేగింది. కార్యాలయాల్లో పలువురు ఉద్యోగులు, సిబ్బంది కొవిడ్‌ బారినపడడంతో విధులకు ఆటంకం ఏర్పడింది.

‘టంగుటూరు’లో కరోనా కలకలం
వెలుగు కార్యాలయానికి జరుగుతున్న శానిటేషన్‌

మండల కార్యాలయంలో పలు విభాగాధిపతులకు పాజిటివ్‌ లక్షణాలు

హడలిపోతున్న సిబ్బంది


టంగుటూరు, జనవరి 21 : మండలంలోని వివిధ ప్రభుత్వ విభాగాల అధికారుల్లో కరోనా అలజడి రేగింది. కార్యాలయాల్లో పలువురు ఉద్యోగులు, సిబ్బంది కొవిడ్‌ బారినపడడంతో విధులకు ఆటంకం ఏర్పడింది.  తహసీల్దార్‌ చిరంజీవికి కరోనా నిర్ధారణ అయింది. తనను కలసిన సిబ్బందితోపాటు మిగిలిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన శుక్రవారం వాట్సాప్‌ గ్రూప్‌లో కార్యాలయ ఉద్యోగులందరికీ మె సేజ్‌ పెట్టారు. అలాగే వెలుగు కార్యాలయంలోని మర్లపాడు సీసీకి కరోనా పాజిటివ్‌ రాగా, మండల వికలాంగుల సమాఖ్య సీసీ కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెలుగు కార్యాలయంలోని ఇద్దరు సీసీలు కరోనా బారినపడడంతో శుక్రవారం కార్యాలయానికి సిబ్బంది ఎవరూ రాలేదు. ఏపీఎం రమేష్‌ సూచనతో పంచాయతీ వారు వెలుగు కార్యాలయ ఆవరణంతా శానిటేషన్‌ చేశారు. మండల వ్యవసాయ శాఖాధికారి కూడా కరోనా బారినపడ్డారు. మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీహెచ్‌వో కరోనా లక్షణాలు ఉండడంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. మరికొంతమంది వైద్య సిబ్బంది ఐసోలేషన్‌లో ఉన్నారు. కరోనా విజృంభణతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విధులకు హాజరయ్యేందుకు హడలిపోతున్నారు. వివిధ పనుల కోసం కార్యాలయాలకు వచ్చే వారిపట్ల అప్రమత్తంగా ఉంటున్నారు. నిత్యం జనాభాతో కలసి ఉండే వీరు ఎవరి ద్వారా ఎక్కడ, ఎప్పుడు కరోనా అంటుకుంటుందోనని భయపడుతున్నారు. 


మండలంలో 38 పాజిటివ్‌ కేసులు

సంక్రాంతి పండుగ తర్వాత మండలంలో 38 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం 14 కేసులు నమోదుకాగా, శుక్రవారం 6కేసులు నిర్ధారణ అయ్యాయి. గురు, శుక్రవారాల్లో వైద్య సిబ్బంది 92 కరోనా పరీక్షలు చేశారు. కందులూరులో 6 పాజిటివ్‌ కేసులు రావడంతో గురువారం అక్కడ 57 మందికి పరీక్షలు చేశారు. వీరందరికీ నెగటివ్‌ వచ్చింది. శుక్రవారం పీహెచ్‌సీలో 35 మందికి పరీక్షలు చేశారు. ప్రస్తుతం పీహెచ్‌సీలో 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోస్‌ వేస్తున్నారు. సెకండ్‌ డోస్‌ వేసుకొని 9 నెలలు గడచిన వారికి మాత్రమే బూస్టర్‌ డోస్‌ అని పీహెచ్‌ఎన్‌ కెజియారాణి చెప్పారు. 


కొవిడ్‌ పరీక్షల కోసం క్యూ

కొండపి, జనవరి 21 : కొవిడ్‌ పరీక్షల కోసం జనం క్యూ కడుతున్నారు. స్థానిక సీహెచ్‌సీలో రోజు మార్చి రోజు ర్యాపిడ్‌ పరీక్షలను తీవ్రమైన లక్షణాలు ఉన్న వారికి మాత్రమే చేస్తున్నారు. శుక్రవారం అధిక సంఖ్యలో కొవిడ్‌ అనుమానిత రోగులు రావడంతో ఆస్పత్రి ఆవరణ అంతా భయాందోళన నెలకొంది. కొండపి ప్రాంతంలో సంక్రాంతి పం డుగ అనంతరం నుంచి డెంగ్యూ కేసులు కూడా పెరిగాయి. కొవిడ్‌, డెం గ్యూ లక్షణాలు ఇంచుమించు ఒకే రకంగా ఉంటున్నాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జలుబు, దగ్గు లక్షణాలున్న రోగులు ప్రైవేటు, ప్రభుత్వ వైద్యశాలలకు పరీక్షల కోసం వస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటు రక్త పరీక్షల కేంద్రాల వద్ద రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. వివిధ పరీక్షల కోసం ప్రైవేటు రక్త పరీక్షల కేంద్రాల నిర్వాహకులు, ఆర్‌ఎంపీలు దాదాపు 1500 నుంచి 2000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. డెంగ్యూ కేసులు కొండపిలో ఈ వారంలో అధికంగా నమోదయ్యాయి. అదేవిధంగా ర్యాపిడ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌ కేసులు ఐదు వచ్చాయి. కొవిడ్‌ పరీక్షలు ఒకరోజు కొండపి సీహెచ్‌సీలో, మరుసటి రోజు పెట్లూరు పీహెచ్‌సీలో నిర్వహిస్తున్నామని సీహచ్‌సీ వైద్యుడు పి. భక్తవత్సలం చెప్పారు. అత్యవసర, అనుమానిత లక్షణాలు ఉన్న అన్ని కేసులకు కొవిడ్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2022-01-22T04:33:55+05:30 IST