హైదరాబాద్‌లో తాన్లా కొత్త కేంద్రం

ABN , First Publish Date - 2021-10-22T07:46:15+05:30 IST

కార్యకలాపాల విస్తరణలో భాగంగా తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ హైదరాబాద్‌లోని మైండ్‌స్పేస్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించనుంది.

హైదరాబాద్‌లో తాన్లా కొత్త కేంద్రం

300 మంది నిపుణుల నియామకంజూ క్యూ 2 లాభంలో 67 శాతం వృద్ధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కార్యకలాపాల విస్తరణలో భాగంగా తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ హైదరాబాద్‌లోని మైండ్‌స్పేస్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించనుంది. 92 వేల చదరపు అడుగల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం ఇన్నోవేషన్‌ అండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం గా పని చేస్తుందని.. దీన్ని వచ్చే ఐదు నెలల్లో ప్రారంభించనున్నట్లు తాన్లా పాట్‌ఫామ్స్‌ వ్యవస్థాపక చైర్మన్‌, సీఈఓ ఉదయ్‌ రెడ్డి తెలిపారు. దాదాపు రూ.70 కోట్లతో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో 300 మంది నిపుణులను నియమించుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా బ్లాక్‌చెయిన్‌, కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌, క్రిప్టోగ్రఫీ వంటి టెక్నాలజీలపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. తాన్లా ప్రధానంగా కమ్యూనికేషన్స్‌ ప్లాట్‌ఫామ్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ (సీపీఏఏఎస్‌) సేవలు అందిస్తోంది. దేశీయ మార్కెట్లో ఈ సేవల్లో తాన్లాకు 42 శాతం వాటా ఉంది. ఈ విభాగంలో  భవిష్యత్తులో వీడియో స్ట్రీమింగ్‌ వంటి సేవలను కూడా అందించనున్నట్లు ఉదయ్‌ రెడ్డి చెప్పారు. 


44% పెరిగిన ఆదాయం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం 44 శాతం పెరిగి రూ.583.24 కోట్ల నుంచి రూ.841.61 కోట్లకు చేరింది. సమీక్ష త్రైమాసికానికి నికర లాభం 67 శాతం పెరిగి రూ.136.17 కోట్లుగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే కాలంలో లాభం రూ.81.47 కోట్లుగా ఉంది. రెండో త్రైమాసికం చివరి నాటికి కంపెనీ వద్ద రూ.846 కోట్ల నగదు, నగదు సమానమైన నిల్వలు ఉన్నాయి. ప్రస్తుత వ్యాపారం పరి మాణం పెరగడం, ఖాతాదారుల జాబితాలో కొత్త కంపెనీలు చేరడం వంటి కారణాల వల్ల ఆదాయం 44 శాతం పెరిగిందని ఉదయ్‌ రెడ్డి చెప్పారు. కొవిడ్‌తో గత కొద్ది నెలలుగా కంపెనీల్లో డిజిటిలీకరణ పెరిగిం దన్నారు. కంపెనీలకు, ఖాతాదారులకు మధ్య కమ్యూనికేషన్‌ వ్యవస్థ అవసరం పెరుగు తోందని దీంతో సీపీఏఏఎస్‌ సేవలకు గిరాకీ పెరుగుతోందని వివరించారు. 

Updated Date - 2021-10-22T07:46:15+05:30 IST