ఆన్‌లైన్‌ తెచ్చిన తంటా

ABN , First Publish Date - 2020-09-15T05:30:00+05:30 IST

ప్రస్తుత కరోనా పరిస్థితులకు అద్దం పట్టే లఘుచిత్రం ‘గర్ల్స్‌ ఇన్‌ ఆన్‌లైన్‌ క్లాసెస్‌’. ఎప్పటికప్పుడు వినూత్న

ఆన్‌లైన్‌ తెచ్చిన తంటా

ప్రస్తుత కరోనా పరిస్థితులకు అద్దం పట్టే లఘుచిత్రం ‘గర్ల్స్‌ ఇన్‌ ఆన్‌లైన్‌ క్లాసెస్‌’. ఎప్పటికప్పుడు వినూత్న చిత్రాలతో ముందుకొచ్చే ‘ఛాయ్‌ బిస్కెట్‌’ యూట్యూబ్‌ ఛానల్‌ ఇటీవలే దీన్ని విడుదల చేసింది. ఒక్క రోజులోనే రెండు లక్షల మందికి పైగా ఈ షార్ట్‌ ఫిలిమ్‌ను వీక్షించారు.


ఇక కథ ఏంటంటే... బడి ఈడు ఆడపిల్లలు పొద్దున్నే లేచి ఆన్‌లైన్‌ తరగతుల కోసం మేకప్‌లు వేసుకొని మరీ రెడీ అవుతారు. తీరా టీచర్‌ పాఠాలు మొదలెట్టే సరికి ఒక్కోరికీ ఒక్కో సమస్య... ఒకరికి మొబైల్‌ డేటా అయిపోతుందన్న టెన్షన్‌. ఇంకొకరిది సిగ్నల్‌ దొరక్క ఇబ్బంది. మరికొంతమందికి అసలు ఆన్‌లైన్‌ క్లాసులంటేనే విరక్తి. టీచర్‌ కంట పడకుండా, అటెండెన్స్‌ మిస్సవ్వకుండా ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచన. అలా తప్పించుకొనేందుకు వీడియో పాస్‌లో పెట్టి కొందరు, లాప్‌టాప్‌ పక్కన మొబైల్‌లో వెబ్‌సిరీస్‌లు చూసుకొంటూ, ఛాటింగ్‌ చేసుకొంటూ మరికొందరు కాలక్షేపం చేస్తుంటారు. ఇక టీచర్‌ ప్రశ్నలు అడుగుతుంటే ఒక్కరూ సమాధానం చెప్పరు.


‘అసలు మీరేం చేస్తున్నారో నేను చూస్తాను... స్ర్కీన్‌ షేర్‌ చేయండి’ అంటారు టీచర్‌. అది చూసి మాస్టర్‌ షాకవుతాడు. అన్నీ ఆయన్ను తిడుతూ చేసుకున్న ఛాటింగ్‌లే! దీంతో చిర్రెత్తిన మాస్టర్‌ విద్యార్థినులపై సీరియర్‌ అవుతారు. ఇంతలో ఆయన ఇంట్లో భార్య, పిల్లల గోల. అది తట్టుకోలేక ఆయన క్లాస్‌ వదిలేసి వెళ్లిపోవడంతో చిత్రం ముగుస్తుంది. సరదాగా సాగిపోయే ఈ పదొకొండు నిమిషాల లఘుచిత్రానికి రచన, దర్శకత్వం చాణక్య. అభిజ్ఞ, శ్వేత, సిరి, సింధుల నటన సహజంగా, ఆకట్టుకుంటుంది. ప్రత్యక్ష్‌ రాజు సినిమాటోగ్రఫీ, హరీష్‌ ఎడిటింగ్‌తో ప్రతి ఫ్రేమూ ఆహ్లాదంగా కనిపిస్తుంది. 



గర్ల్స్‌ ఇన్‌ ఆన్‌లైన్‌ క్లాసెస్‌ 

రచన, దర్శకత్వం: చాణక్య 

విడుదల: సెప్టెంబర్‌ 14 

వ్యూస్‌: 2.5 లక్షలు 


Updated Date - 2020-09-15T05:30:00+05:30 IST