టార్గెట్‌ ‘రఘురామ’

ABN , First Publish Date - 2021-05-15T09:21:06+05:30 IST

‘‘నన్ను అరెస్టు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సీఐడీ అధికారులు కొంతమంది ఇదే పనిలో ఉన్నారు. 15వ తేదీ లోపు ఏమైనా జరగవచ్చు’’...

టార్గెట్‌ ‘రఘురామ’

  • 15లోగా అరెస్టు చేయవచ్చని ముందే అనుమానం.. ఏడాదిగా వైఫల్యాలపై సూటి వ్యాఖ్యలు
  • జగన్‌ బెయిలు రద్దు కోరుతూ పిటిషన్‌.. సొంత నియోజకవర్గంలో కేసులు
  • చివరికి హైదరాబాద్‌లో అరెస్టు

విజయవాడ, మే 14(ఆంధ్రజ్యోతి) : ‘‘నన్ను అరెస్టు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సీఐడీ అధికారులు కొంతమంది ఇదే పనిలో ఉన్నారు. 15వ తేదీ లోపు ఏమైనా జరగవచ్చు’’... కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన   వ్యాఖ్యలివి. ఆయన అనుమానమే నిజమైంది. 15వ తేదీకి సరిగ్గా ఒక్కరోజు ముందు.. పుట్టిన రోజునే సీఐడీ పోలీసులు రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజవర్గం నుంచి వైసీపీ ఎంపీగా నెగ్గారు. ఆ తర్వాత పార్టీతో, ప్రభుత్వ పెద్దలతో కొద్దిరోజులు మాత్రమే సఖ్యత కొనసాగింది. దాదాపు ఏడాదికిపైగా రఘురామ రాజు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ప్రభుత్వంలోని లోపాలను, తప్పులను వేలెత్తి చూపుతున్నారు. అమరావతిని అటకెక్కించడం నుంచి తాజాగా కరోనా కట్టడిలో వైఫల్యం వరకు... అన్ని అంశాలపైనా సర్కారు వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఉద్దేశాలను సూటిగా  తప్పుపడుతున్నారు. ‘రాజధాని రచ్చబండ’ పేరిట ఢిల్లీలో, హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి రోజూ మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు, సొంత నియోజకవర్గ నేతలు ఆయనపై కేసులు కూడా పెట్టారు. తాను ఏపీలో అడుగు పెడితే అరెస్టు చేస్తారని రఘురామ  చెబుతూనే ఉన్నారు.


తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ కేంద్రాన్ని ఆశ్రయించి... ‘వై’ కేటగిరీ భద్రత పొందారు. మరోవైపు... అవినీతి కేసుల్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కేసు వేశారు. ఈనెల 17వ తేదీన దీనిపై విచారణ జరగనుంది. అలాగే... ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారమే రఘురామరాజు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. వీటన్నింటి నేపథ్యంలో ఆయన అరెస్టు పెను సంచలనం సృష్టించింది. 

Updated Date - 2021-05-15T09:21:06+05:30 IST