ఓడీఎఫ్‌గా మార్చడమే లక్ష్యం

ABN , First Publish Date - 2020-08-14T16:33:31+05:30 IST

గరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్లు అందుబాటులో

ఓడీఎఫ్‌గా మార్చడమే లక్ష్యం

మునిసిపల్‌, కార్పొరేషన్లలో మరుగుదొడ్ల నిర్మాణాలు

జిల్లాలో 310 పబ్లిక్‌, 96 షీ టాయిలెట్ల నిర్మాణం

15వ తేదీకి అందుబాటులోకి 55 మరుగుదొడ్లు 


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : నగరాలతో పాటు  వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్లు అందుబాటులో లేకపోవడంతో బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాలు కలుషితమవుతున్నాయి. పట్టణాలను బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా(ఓడీఎఫ్‌) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఇప్పటికే పలుచోట్ల టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే జనాభా ప్రాతిపదికన అన్ని మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో టాయిలెట్ల నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 


జిల్లాలో నాలుగు మునిసిపల్‌ కార్పొరేషన్లు, 9 మునిసిపాలిటీలు ఉన్నాయి. ప్రతి వేయిమందికి ఒకటి చొప్పున నిర్మించాలని ప్రణాళికను రూపొందించారు. ఈ మేరకు కలెక్టర్‌ పరిపాలనా అనుమతులు జారీ చేశారు. ప్రతి మునిసిపల్‌ పరిధిలో నిర్మించే టాయిలెట్లలో 50శాతం మహిళలకు కేటాయించాలని ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో నూతనంగా 310 మరుగుదొడ్లు, ప్రత్యేకంగా మరో 96 షీ టాయిలెట్లు(మహిళ) నిర్మిస్తున్నారు. వీటిలో 102 పనులు పూర్తియ్యాయి. 202 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ నెల 15 నాటికి జిల్లాలో 55 మరుగుదొడ్లను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 15వ తేదీ నాటికి మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీచేశారు. మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 


నిర్మాణాలు పూర్తి చేస్తాం 

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని నాలుగు మునిసిపల్‌ కార్పొరేషన్లు, 9 మునిసిపాలిటీల్లో పబ్లిక్‌, షీ టాయిలెట్ల నిర్మాణాలు చేపడుతున్నాం. వివిధ ప్రాంతాల నుంచే వచ్చే వారికి మరుగుదొడ్లను అందుబాటులో ఉంచేందుకు నిర్మాణాలు చేపట్టాం. ఎప్పటికప్పుడు మునిసిపల్‌ కమిషనర్లతో సమీక్షిస్తున్నాం. 

- కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

Updated Date - 2020-08-14T16:33:31+05:30 IST