Abn logo
Oct 21 2020 @ 11:20AM

టార్గెట్ టాప్ 3.. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021కి జీవీఎంసీ మహా ప్రణాళిక

‘కెపాసిటీ బిల్డింగ్‌’ పేరుతో ఉద్యోగులకు శిక్షణ

చెత్త విభజనకు త్రీ బిన్‌ విధానం అమలు

నవంబరు నెలాఖరు నాటికి అందుబాటులోకి బయోమైనింగ్‌ ప్లాంట్‌

డిసెంబరు నాటికి చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు రెడీ

నగరంలో కూడళ్లు సుందరీకరణకు ప్రత్యేక బృందం

బాగా పనిచేసే పారిశుధ్య సిబ్బందికి అవార్డులు

వారానికొకసారి కాలనీ సంఘాలతో వార్డు కార్యదర్శులు భేటీ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ సర్వేక్షణ్‌-2020లో తొమ్మిదో ర్యాంకు దక్కించుకున్న మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)...వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021లో టాప్‌-3లో వుండేలా కార్యాచరణ రూపొందించుకుంటోంది. ఇందులో భాగంగా గతంలో ఎదురైన అవాంతరాలను అధిగమించడంతోపాటు మరికొన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. 


దేశంలో పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015 అక్టోబరు రెండున స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. ప్రధానమైన పట్టణాలు, నగరాల్లో పరిశుభ్రత పెంచేందుకు ఏటా ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’ పోటీ నిర్వహిస్తోంది. పారిశుధ్యం మెరుగు, పరిశుభ్రత పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు నిధులు మంజూరుచేస్తోంది. పోటీలో పాల్గొనే నగరాలు, పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బృందాలు ఏటా జనవరిలో సర్వే నిర్వహిస్తాయి. సర్వేలో భాగంగా ఆయా నగరాల్లో ప్రజలకు పరిశుభ్రత పట్ల వున్న అవగాహన, స్థానిక సంస్థల కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం, పరిశుభ్రత కోసం ఆయా స్థానిక సంస్థలు చేస్తున్న కృషి, ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెత్తను శాస్త్రీయంగా పునర్వినియోగం చేయడం, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలు, కొత్త ప్రాజెక్టులు, అవి సకాలంలో పూర్తయ్యేలా పర్యవేక్షించడం, ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారుల జవాబుదారీతనం...తదితర అంశాలను పరిశీలించి కేంద్రానికి నివేదిస్తాయి. ఈ నివేదిక ఆధారంగా నగరాలకు ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ర్యాంకులను ప్రకటిస్తారు. జీవీఎంసీకి 2015లో 237, 2016లో ఐదు, 2017లో మూడు, 2018లో ఏడు, 2019లో 23.....దక్కగా ఈ ఏడాది తొమ్మిదో ర్యాంకు లభించింది. 


మూడో ర్యాంకు లక్ష్యం

2021లో టాప్‌-3లో నిలవాలని జీవీఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఈ ఏడాది  వెనుకబడిన చెత్త నిర్వహణలో మెరుగుపడేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. వేస్ట్‌ ప్రాసెసింగ్‌లో వందకు కేవలం 50 శాతం మార్కులు మాత్రమే లభించాయి. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో వున్న బయోమైనింగ్‌ (చెత్తను సేంద్రీయ ఎరువుగా మార్చడం) ప్లాంట్‌ను నవంబరు నాటికి అందుబాటులోకి తెచ్చేలా అధికారులు పనులను వేగవంతం చేశారు. అలాగే చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టును కూడా డిసెంబరు నాటికి అందుబాటులోకి తేవాలని కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ఆదేశించారు. దీనివల్ల వేస్ట్‌ ప్రాసెసింగ్‌లో శతశాతం మార్కులు సాధిస్తే గార్బేజ్‌ ఫ్రీ సిటీస్‌లో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ దక్కుతుంది. అప్పుడు ఈ ఏడాది వెల్లడించిన ఫలితాల్లో సాధించిన మార్కుల కంటే అదనంగా 400 మార్కులు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. దీనికితోడు ఇప్పటివరకూ తడి, పొడి చెత్త సేకరణకు నీలం, ఆకుపచ్చ రంగు బుట్టలను మాత్రమే వాడుతున్నారు. ఇకపై ఎలక్ర్టానిక్‌, వైద్యపరమైన వ్యర్థాల సేకరణకు నలుపు రంగు బుట్టను అందజేసి, త్రీ బిన్‌ సిస్టమ్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. 


2021 కోసం కొత్త విధానాలు

పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న 5,200 మందిలో ఉత్సాహం నింపేందుకు ఉత్తమ పనితీరు కనబరిచే వారికి అవార్డులు అందజేస్తున్నారు. 

సిబ్బంది విధి నిర్వహణలో సమయపాలన పాటించేలా ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. 

వాణిజ్య ప్రాంతాలు, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా, ఉమ్మినా, మల, మూత్ర విసర్జన చేసినా జరిమానా విధించేందుకు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, వార్డు సెక్రటరీలకు అధికారం ఇచ్చారు.

ప్రజలను స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగస్వాములను చేయడంతోపాటు పోటీకి సంబంధించిన విధివిధానాలు తెలిసేలా వార్డు సెక్రటరీలో ప్రతివారం తమ పరిధిలోని కాలనీ సంఘాలు, రెసిడెన్సియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

జీవీఎంసీ ఉద్యోగులు, సిబ్బంది స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేను అత్యుత్తమంగా ఎదుర్కొనేలా ‘కెపాసిటీ బిల్డింగ్‌’ పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీవీ ఎంసీతోపాటు నగరవాసుల భాగస్వామ్యం పెంచేందుకు వీలుగా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో జీవీఎంసీ యాష్‌ ట్యాగ్‌తో పోస్టులు భారీగా పెడుతున్నారు.

నగరంలో ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన గోడలు సుందరంగా కనిపించేందుకు వీలుగా ప్రత్యేక బృందంతో పెయింటింగ్‌లు వేయించాలని నిర్ణయించారు.

నగరంలోని సామాజిక మరుగుదొడ్ల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ వుండడంతోపాటు, వినియోగించినవారు తమ అభిప్రాయాలను ఆన్‌లైన్‌లోనే తెలిపేందుకు వీలుగా ట్యాబ్‌లను ఏర్పాటుచేసే పనులు ప్రారంభించారు.

ఓడీఎఫ్‌ ప్లస్‌ప్లస్‌ నుంచి వాటర్‌ ప్లస్‌ నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021లో నగరాన్ని ఉత్తమ స్థానంలో నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిచేయాలని జీవీఎంసీ అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావు అన్నారు.