ఉగ్రవాదుల లక్షిత దాడులపై భారత్ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-10-08T00:49:53+05:30 IST

జమ్మూ-కశ్మీరులో సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని

ఉగ్రవాదుల లక్షిత దాడులపై భారత్ ఆగ్రహం

న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరులో సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తుండటంపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రాస్ బోర్డర్ టెర్రరిజంపై ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో కశ్మీరులో జరుగుతున్న సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. 


కశ్మీరులో జరుగుతున్న సంఘటనలు గట్టిగా ఖండించదగినవని పేర్కొంది. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని చంపుతున్నారని పేర్కొంది. క్రాస్ బోర్డర్ టెర్రరిజంపై ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది. భాగస్వాములందరితో జరిగే ప్రతి సమావేశంలోనూ ఈ విషయాన్ని లేవనెత్తుతామని పేర్కొంది. దీనిపై అంతర్జాతీయ సమాజం స్పందించేవిధంగా కృషి చేస్తామని తెలిపింది. 


శ్రీనగర్, బందిపొరలలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ప్రముఖ ఫార్మసిస్ట్ మఖన్ లాల్ బింద్రూ కూడా ఉన్నారు. శ్రీనగర్ మేయర్ మాట్లాడుతూ, ఓ రోడ్డుకు బింద్రూ పేరు పెడతామని చెప్పారు. గురువారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో శ్రీనగర్‌లోని సంగం ఈద్గా ఏరియాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోకి  ఉగ్రవాదులు చొరబడి, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ప్రిన్సిపాల్ సుపుందర్ కౌర్, టీచర్ దీపక్ చంద్ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో దీపక్ చంద్ ఓ హిందూ అని, సుపుందర్ కౌర్ ఓ సిక్కు అని ఆ పాఠశాలలోని ఓ టీచర్ ఓ వార్తా సంస్థకు తెలిపారు. 


మొత్తం మీద కశ్మీరు లోయలో గడచిన ఐదు రోజుల్లో ఏడుగురు సాధారణ ప్రజలు ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. మరణించిన ఏడుగురిలో నలుగురు హిందూ, సిక్కు వంటి మైనారిటీ మతాలకు చెందినవారు. 


Updated Date - 2021-10-08T00:49:53+05:30 IST