తర్జనభర్జనలు.. మల్లగుల్లాలు...

ABN , First Publish Date - 2021-04-20T05:30:00+05:30 IST

ఎన్నికల్లో పోటీకి నిలబెట్టే అభ్యర్ధుల ఖరారు ప్రధాన పార్టీలకు కత్తిమీద సాములా మారింది. అభ్యర్థుల ఎంపిక ఎ డతెగని కసరత్తులా మారింది. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యే సమయం దగ్గర పడుతున్నా ఎంపిక ఇంకా పూర్తి కాలేదు.

తర్జనభర్జనలు.. మల్లగుల్లాలు...

ఇంకా ఖరారు కాని ప్రధాన పార్టీల అభ్యర్థులు
మార్పులు చేర్పులతో బిజీ
లాబీయింగ్‌ల ద్వారా ఒత్తిళ్లు తెస్తున్న ఆశావహులు
టీఆర్‌ఎ్‌సలో ముదురుతున్న టికెట్ల లొల్లి
పార్టీ శ్రేణుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
తూర్పు ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఆందోళనలు


ఆంధ్రజ్యోతి, హన్మకొండ
ఎన్నికల్లో పోటీకి నిలబెట్టే అభ్యర్ధుల ఖరారు ప్రధాన పార్టీలకు కత్తిమీద సాములా మారింది. అభ్యర్థుల ఎంపిక ఎ డతెగని కసరత్తులా మారింది. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యే సమయం దగ్గర పడుతున్నా ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. చివరి నిమిషంలో మార్పులు చేర్పులతో నేతలు తలమునకలైఉన్నారు. జాబితాల ప్రకటనలో జాప్యం జరుగుతోంది. దీంతో ఆశావహుల్లో అంతకంతకూ అసహనం పెరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక అత్యంత రహస్యంగా జరుగుతుండడంతో ఏమౌతుందో ఏమోనని ఉత్కంఠకు లోనవుతున్నారు.

మిగిలింది 48 గంటలే..
నామినేషన్ల దాఖలు గడువు 18వ తేదీతో ముగిసింది. టికెట్‌ వస్తుందన్న నమ్మకంతో ఆయాపార్టీల పక్షాన ఎవరికివారు నామినేషన్లు వేశారు. సోమవారం పరిశీలన పూర్తయింది. 55నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీటిపై అప్పీలు చేసుకునే గడువు కూడా మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. 35వ డివిజన్‌ నుంచి బీజేపీ పక్షాన నామినేషన్‌ వేసిన గంటా రవికుమార్‌ ఒక్కరే అప్పీల్‌కు వెళ్లారు. మిగతా వాటి విషయంలో వివాదం లేదు. అప్పీళ్లను పరిష్కరించేందుకు గురువారం సాయంత్రం 5గంటల వరకు గడువు ఉంది. 22న సాయంత్రం 3గంటలవరకు నామినేషన్ల ఉపసంహరణలకు చివరి గడువు. పోటీలో ఎవరు  ఉండాలనేది నిర్ణయించడానికి ప్రధాన పార్టీలకు ఇంకా మిగిలి ఉన్న సమయం 48 గంటలే. ఈ లోగానే అభ్యర్థుల ఖరారు కసరత్తును పూర్తి చేయాలి. పేర్లను అధికారికంగా ప్రకటించాలి. ఎంపిక చేసిన వారికి బీ ఫాంలను అందచేయాలి.

కత్తిమీద సాము

పార్టీ టికెట్ల కోసం టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రె్‌సతో సహా అన్ని ప్రధాన పార్టీలకు దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. ఒక్కో పార్టీలో 500 తక్కువ  కాకుండా దరఖాస్తులు దాఖలయ్యాయి. ఽవినతులు సమర్పించుకున్నవారంతా టికెట్లు రాకపోతాయా అన్న ఆశతో ఉన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అగ్రనేతల ఆశీస్సులు, గాడ్‌ఫాదర్ల మద్దతు ఉన్నవారు  టికెట్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. టికెట్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ప్రధాన పార్టీల నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. తిరస్కరణకు గురైనవి పోగా వివిధ పార్టీలకు సంబంధించి 1710 నామినేషన్లు మిగిలాయి. వీటిలో 66 డివిజన్ల నుంచి ఒక్క టీఆర్‌ఎస్‌ పక్షాన్నే అత్యధికంగా 688 నామినేషన్ల పడ్డాయి. బీజేపీ నుంచి 289, కాంగ్రెస్‌ నుంచి 240 దాఖలయ్యాయి. దీనిని బట్టే టికెట్లకు ఎంత డిమాండ్‌ ఉందో అర్ధమవుతోంది. గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో కన్నా ఈ సారి 20శాతం నామినేషన్ల ఎక్కువపడ్డట్టు అధికారులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి గతంలో కన్నా ఈసారి 17శాతం నామినేషన్లు అధికంగా పడ్డాయి. వీరిలో నుంచే 66 మంది అభ్యర్థులు ఎంపిక చేయడం నేతలకు కత్తిమీద సాములా  మారింది.

నివురుగప్పిన నిప్పు

ఎవరిని కాదన్నా.. నిరసన, అసంతృప్తి, ఆందోళన పెల్లుబికే ప్రమాదం ఉంది. జాబితా అధికారికంగా ప్రకటించనందువల్ల ఆశావహులంతా ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉన్నారు.  తమదైన మార్గాల ద్వారా ఎంపిక ఎలా జరుగుతుందో ఆరా తీస్తున్నారు. తమకు టికెట్‌ రాకపోతే నేతలపై ఒత్తిడి తీసుకురావడానికి ఏం చేయాలో ప్రణాళికలను ముందే సిద్ధం చేసి పెట్టుకున్నారు.  ఒక పక్క ఎంపిక ప్రక్రియ జరుగుతుండగా చివరి ప్రయత్నాలను చేస్తున్నారు.

సర్వే ప్రతిపాదికగా..

ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకి ముందే ముఖ్యనేతలు ఎవరికి టికెట్‌ ఇవ్వాలనే విషయంలో ఒక అవగాహన రావడానికి డివిజన్ల వారీగా సర్వేలు చేయించినట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఈ సర్వేలను కూడా  ప్రాతిపదికగా తీసుకుంటున్నట్టు సమాచారం. సర్వేలో వెల్లడైన అంశాలను పరిగణలోకి తీసుకొని కసరత్తు చేస్తున్న క్రమంలో పార్టీ అధిష్ఠానం సూచించిన కొన్ని పారామీటర్లు అడ్డంకులుగా మారుతున్నట్టు తెలుస్తోంది. ఈ పారామీటర్లను పరిగణలోకి తీసుకుంటే సర్వేలోని కొన్ని అంశాలు అప్రధానంగా మారుతున్నాయి. దీంతో సందిగ్దంలో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం.

దండోపాయాలు

కొన్ని డివిజన్లలో తొలుత సామ, దాన, బేద, దండోపాయాలను ప్రయోగించిన అభ్యర్థులు.. చివరి నిమిషంలో దండోపాయానికి దిగడానికి రెడీ అవుతున్నారు. తమకు టికెట్‌ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో సూత్రప్రాయంగా తెలియచేస్తున్నా రు. ఇప్పటి వరకు టికెట్‌ కోసం ప్రత్యక్షంగా ప్రయత్నాలు చేసిన కొందరు.. ఇప్పుడు తమ మద్దతుదారులను రంగంలోకి దించుతున్నారు. నేతల ఇళ్లకు పంపించి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవ్వకపోతే ఆందోళనలకు దిగేట్టు చేస్తున్నారు. 18వ డివిజన్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్‌ వస్కుల బాబుకు తప్ప ఎవరికీ టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చినా గెలిపించుకుంటామని లేబర్‌కాలనీ వాసులు మంగళవారం ఎమ్మెల్యే నరేందర్‌ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. తమ నాయకుడు మసూద్‌కు టికెట్‌ ఇవ్వాలని కోరుతూ మైనారిటీలూ ఎమ్మెల్యే నరేందర్‌ ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. టికెట్‌ రాదని నిర్ధారించుకున్నవారు ఇతర పార్టీలోకి జంప్‌ అవుతున్నారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో 32వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ నాయకుడు సింగరిరాజ్‌ కుమార్‌ తన అనుచరులతో మాజీ ఎమ్మెల్సీ  కొండా మురళీధర్‌రావు సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు.

సమన్వయం...

ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు దెబ్బతినని రీతిలో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసేందుకు, జాబితా ప్రకటన తర్వాత తలెత్తే నిరసనలు, అసంతృప్తులను చల్లార్చేందుకు ప్రధాన పార్టీలన్నీ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఈ కమిటీ కూడా పాలుపంచుకుంటోంది. టీఆర్‌ఎస్‌ పక్షాన ఇద్దరు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, పార్టీ సీనియర్‌ నాయకులతో కలిసి సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ పక్షాన జీడబ్ల్యూఎంసీ ఎన్నికల కమిటీ కోకన్వీనర్‌గా ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు నియమితులయ్యారు.

Updated Date - 2021-04-20T05:30:00+05:30 IST