వయసు- 21.. చోరీలు - 27

ABN , First Publish Date - 2022-01-21T16:22:05+05:30 IST

పలుమార్లు జైలుకెళ్లిన ఓ పాతనేరస్థుడు మళ్లీ చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. సైబరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ గురువారం వివరాలు వెల్లడిస్తూ 21 ఏళ్ల వయసులోనే 27 చోరీలు చేశాడని

వయసు- 21..  చోరీలు - 27

ఆటకట్టించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: పలుమార్లు జైలుకెళ్లిన ఓ పాతనేరస్థుడు మళ్లీ చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. సైబరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ గురువారం వివరాలు వెల్లడిస్తూ 21 ఏళ్ల వయసులోనే 27 చోరీలు చేశాడని తెలిపారు.  వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన చిడిరిక అరవింద్‌ అలియాస్‌ సూర్య అలియాస్‌ నాని ప్రస్తుతం బోరబండ రాజ్‌నగర్‌లో ఉంటున్నాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో దారితప్పాడు. ఇంటర్‌ చదువును మధ్యలో ఆపేసి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అవసరమైన డబ్బు కోసం దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చి ట్రై కమిషనరేట్‌ పరిధిలో పలు ప్రాంతాల్లో చోరీలు చేశాడు. 2017 నుంచి చోరీలు చేస్తూ పలుమార్లు జైలుకు వెళ్లాడు. 2020 ఫిబ్రవరిలో ఎల్‌బీనగర్‌ పరిధిలో చోరీ చేసి జైలుకు వెళ్లాడు. బయటకు వచ్చిన తర్వాత బుద్ధిగా బతకాలనుకున్నాడు. లాక్‌డౌన్‌లో శానిటైజర్స్‌ అమ్మాడు. కొద్దిరోజులకు అదిమానేసి వాచ్‌మన్‌గా చేరాడు.


ఆ తర్వాత ఫుడ్‌డెలివరీ బాయ్‌గా మారాడు. అపోలో ఫార్మసీలో పనిచేశాడు. కొద్దిరోజులకు మానేసి మళ్లీ వాచ్‌మన్‌గా చేరాడు. అయినా ఎక్కడా అవసరాలకు సరిపడా డబ్బులు రాకపోవడంతో మళ్లీ చోరీల బాట పట్టాడు. ఇలా 21 ఏళ్ల వయసు వచ్చే సరికి హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, కరీంనగర్‌ కమిషనరేట్స్‌ పరిధిలో 27 చోరీలు చేశాడు. మాదాపూర్‌ పరిధిలో ఒక బైక్‌ను చోరీ చేశాడు. దానిపై తిరుగుతూ పలు ఇళ్లను రెక్కీ చేసేవాడు. ఇటీవల ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చేసిన దొంగతనం కేసులో వెస్టు జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతని నుంచి 661 గ్రాముల బంగారం, రూ. 21.57లక్షలు, రెండు ద్విచక్రవాహనాలు, ఐ ఫోన్‌ సహా 13 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. 

Updated Date - 2022-01-21T16:22:05+05:30 IST