నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-06-23T04:55:22+05:30 IST

నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలి

నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలి
దామస్తాపూర్‌లో సర్పంచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్‌ పౌసుమిబసు

  • గ్రామాల్లో శ్మశానవాటికల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్‌ 
  • అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహించిన టీఏ, సర్పంచ్‌లపై ఆగ్రహం 
  • బిల్లులు వచ్చేలా చూడాలని కోరిన సర్పంచులు


మర్పల్లి: ఈనెల 30వ తేదీలోగా వైకుంఠదామం నిర్మాణ పనులు  పూర్తిచేయాలని కలెక్టర్‌ పౌసుమిబసు అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని కొత్లాపూర్‌, దామస్తాపూర్‌, రావులపల్లి గ్రామ పంచాయతీలను ఆమె సందర్శించారు. ముందుగా కొత్లాపూర్‌ గ్రామంలో హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు తీసిన గుంతలు సరిపడకపోయేసరికి సంబంధిత టీఏపై మండిపడుతూ ఆయనకు షోకాజ్‌ నోటీసులకు జారీ చేయమని సంబంధిత అధికారులకు సూచించారు. ఇలా నిర్లక్ష్యంగా మొక్కలు నాటితే నాటిన మొక్కలు బతకవని, దీంతో చేసిన పని వృథా అవుతుందని ఆమె అన్నారు. గ్రామంలో కంపోస్ట్‌ షెడ్‌ నిర్మాణం సక్రమంగా లేదని, పారిశుధ్యం కూడా అస్తవ్యస్తంగా ఉందని మండిపడ్డారు. వైకుంఠదామం నిర్మాణ పనులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, గత 5 నెలల క్రితం గ్రామాన్ని సందర్శించినపుడే పది రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి 5 నెలలు కావస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని సర్పంచ్‌ జైపాల్‌రెడ్డిపై మండిపడ్డారు. ఈనెల 30వ తేదీలోగా శ్మశానవాటిక పనులు పూర్తి చేయాలని లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే సర్పంచ్‌ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి వేరే కాంట్రాక్టర్‌కు అప్పజెప్పి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అన్నారు. నిర్లక్ష్యం వహించిన సర్పంచుకు కూడా షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. అనంతరం రావులపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతివనంను సందర్శించి జిల్లాలోనే ఉత్తమంగా ఉందని కితాబిచ్చారు. కాగా శ్మశానవాటిక పనులు పూర్తయి చాలా కాలం అయిందని, ఇంతవరకు వాటి బిల్లులు రాలేవని, వెంటనే బిల్లులు ఇప్పించాలని సర్పంచ్‌ కలెక్టర్‌ను కోరారు. ఆమె వెంట జిల్లా, మండల స్థాయి అధికారులు ఉన్నారు. 

Updated Date - 2021-06-23T04:55:22+05:30 IST