రుచుల కేళి!

ABN , First Publish Date - 2021-03-27T05:41:12+05:30 IST

హోలీ అంటే రంగులు చల్లుకోవడమే కాదు, కమ్మటి రుచులను ఆస్వాదించాల్సిందే. ముఖ్యంగా థాండై, భాంగ్‌ పకోడా ఉంటే హోలీ మజా రెట్టింపవుతుంది. మల్‌పావు, బాదం ఫిర్నీ, రస్‌మలాయి, నమక్‌ పరెలు కూడా లొట్టలేయించేవే. మరి రంగుల పండుగ

రుచుల కేళి!

హోలీ అంటే రంగులు చల్లుకోవడమే కాదు, కమ్మటి రుచులను ఆస్వాదించాల్సిందే. ముఖ్యంగా థాండై, భాంగ్‌ పకోడా ఉంటే హోలీ మజా రెట్టింపవుతుంది. మల్‌పావు, బాదం ఫిర్నీ, రస్‌మలాయి, నమక్‌ పరెలు కూడా లొట్టలేయించేవే. మరి రంగుల పండుగ రోజున ఈ రెసిపీలను మీరూ రుచి చూడండి.


మల్‌పావు


కావలసినవి: మైదా - ఒక కప్పు, బొంబాయి రవ్వ - అర కప్పు, పంచదార - పావుకప్పు, సొంపు - అర టీస్పూన్‌, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, పాలు - అరకప్పు, నూనె - డీప్‌ ఫ్రైకి తగినంత, డ్రైఫ్రూట్స్‌ - గార్నిష్‌ కోసం.


పంచదార పానకం కోసం:

పంచదార - ఒక  కప్పు, నీళ్లు - అరకప్పు, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, కుంకుమ పువ్వు - కొద్దిగా.


తయారీ విధానం:

  • ముందుగా ఒక పాత్రలో నీళ్లు పోసి పంచదార వేసి పానకం తయారుచేసుకోవాలి. యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి. 
  • ఒక పాత్రలో మైదా, రవ్వ, పంచదార, సోంపు, 
  • యాలకుల పొడి వేసి కలపాలి.
  • తరువాత పాలు పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి మిశ్రమం పలుచగా ఉండేలా చూసుకోవాలి. 
  • ఈ మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టాలి. 
  • ఒక పాన్‌లో నూనె పోసి కాస్త వేడి అయ్యాక చెంచాతో మల్‌పావు మిశ్రమాన్ని వేయాలి.
  • రెండు వైపులా గోధుమరంగులోకి మారే వరకు కాల్చాలి.
  • తరువాత పంచదార పానకంలో వేయాలి. పది నిమిషాల తరువాత ప్లేట్‌లోకి మార్చి డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

నమక్‌ పరె  


కావలసినవి:  గోధుమపిండి - రెండు కప్పులు, రవ్వ - రెండు టేబుల్‌స్పూన్లు, వాము - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం:

  • ఒక పాత్రలో గోధుమపిండి తీసుకుని అందులో రవ్వ, వాము, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి.
  • ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్న నూనెను పిండిపై పోయాలి. అంతటా పట్టేలా బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. అవసరాన్ని బట్టి నీళ్లు పోస్తూ కలపాలి.
  • తరువాత మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ బాల్స్‌లా చేసుకోవాలి. 
  • పొడి పిండి అద్దుకుంటూ చపాతీలా చేయాలి. అయితే కొద్దిగా మందంగా ఉండేలా చేసుకోవాలి.
  • కత్తి సాయంతో నచ్చిన ఆకారాల్లో కట్‌ చేయాలి. 
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక నమక్‌ పరెలు వేసి వేగించాలి. 
  • చిన్నమంటపై గోధుమరంగులోకి మారే వరకు వేగించి తీసుకోవాలి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి భద్రపరుచుకుని స్నాక్స్‌గా తినొచ్చు.

బాదం ఫిర్ని


కావలసినవి:  పాలు - ఒక లీటరు, బియ్యం - అరకప్పు, కుంకుమపువ్వు - చిటికెడు, జీడిపప్పు - పది పలుకులు, పంచదార - అరకప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, రోజ్‌ వాటర్‌ - అర టేబుల్‌స్పూన్‌.


తయారీ విధానం:

  • బియ్యంను శుభ్రంగా కడిగి గంటన్నర పాటు నానబెట్టాలి.
  • ఒక పాత్రలో పాలు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • నానబెట్టిన బియ్యంలో నీళ్లు తీసేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. 
  • ఇప్పుడు పాలను మళ్లీ వేడి చేయాలి. మెత్తగా గ్రైండ్‌ చేసిన బియ్యం పేస్టును వేసి ఉండలు లేకుండా కలపాలి. 
  • తరువాత పంచదార వేసి కలియబెట్టాలి. యాలకుల పొడి, కుంకుమ పువ్వు, రోజ్‌ వాటర్‌ వేయాలి.
  • మిశ్రమం చిక్కగా అవుతున్న సమయంలో స్టవ్‌పై నుంచి దింపి చిన్నచిన్న కప్పుల్లో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి.
  • జీడిపప్పు, కుంకుమ పువ్వుతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

భాంగ్‌ పకోడి


కావలసినవి: సెనగపిండి - రెండు కప్పులు, పసుపు - చిటికెడు, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, మామిడికాయ పొడి - అర టీస్పూన్‌, భాంగ్‌ పౌడర్‌ - కొద్దిగా, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, బంగాళదుంప - ఒకటి.


తయారీ విధానం:

  • ఒక పాత్రలో సెనగపిండి తీసుకుని  అందులో కారం, మామిడికాయ పొడి, భాంగ్‌ పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి, నీళ్లు పోసి కలపాలి. తరిగిన ఉల్లిపాయలు, బంగాళదుంపలు వేయాలి. మిశ్రమం మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. 
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక మిశ్రమాన్ని చేత్తో తీసుకుని కొద్దికొద్దిగా వేసి వేగించాలి. 
  • పకోడి గోధుమరంగులోకి మారే వరకు వేగించుకోవాలి.
  • ఈ భాంగ్‌ పకోడి పుదీనా చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.

రస్‌ మలాయి


కావలసినవి:

పనీర్‌ కోసం: పాలు - ఒక లీటరు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, నీళ్లు - ఒక కప్పు. 


పంచదార పానకం కోసం: పంచదార - ఒకటిన్నర కప్పు, నీళ్లు - ఎనిమిది కప్పులు.


రబ్డీ కోసం: పాలు - ఒక లీటరు, పంచదార - పావు కప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, కుంకుమ పువ్వు పాలు - రెండు టేబుల్‌స్పూన్లు, పిస్తాలు - ఏడు, బాదం - ఐదు పలుకులు, జీడిపప్పు- పది పలుకులు.


తయారీ విధానం:

  • ఒక పాత్రలో పాలు పోసి మరిగించాలి. తరువాత నిమ్మరసం పోసి కలపాలి. మరుగుతూ ఉన్నప్పుడు కలుపుతూనే ఉండాలి. చివరగా అదనంగా మిగిలిన నీటిని తీసేయాలి. అరగంట 
  • తరువాత గట్టిపడిన పనీర్‌ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న బాల్స్‌ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • నీళ్లు, పంచదార మరిగించుకుని పంచదార పానకం తయారు చేసుకోవాలి. తరువాత అందులో పనీర్‌ బాల్స్‌ వేయాలి. 
  • రబ్డీ తయారీ కోసం ఒక పాత్రలో పాలను మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో పైన తేరుకునే మీగడను స్పూన్‌తో మరొక పాత్రలోకి తీసుకోవాలి. మళ్లీ పాలు మరిగించాలి. ఇలా ఐదు సార్లు మీగడ తీయాలి. తరువాత మిగిలిన పాలలో పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు పాలు పోసి మరికాసేపు మరిగించాలి. ఈ రబ్డీ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో రెండు, మూడు గంటల పాటు పెట్టాలి.
  • తరువాత పనీర్‌ బాల్స్‌పై రబ్డీ మిశ్రమాన్ని పోసి, నట్స్‌తో అలకంరిచాలి.  
  • చల్లని రస్‌మలాయిని ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. 

థాండై


కావలసినవి: బాదం పలుకులు - పావు కప్పు, జీడిపప్పు - ఐదారు పలుకులు, పుచ్చకాయ గింజలు - రెండు టేబుల్‌స్పూన్లు, గసగసాలు - ఒక టేబుల్‌స్పూన్‌, సోంపు - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులు - ఐదు, మిరియాలు - నాలుగైదు, పంచదార - రుచికి తగినంత, పాలు - ఒక లీటరు, నీళ్లు - పావు కప్పు, రోజ్‌ ఎసెన్స్‌ - కొద్దిగా, కుంకుమపువ్వు - కొద్దిగా.


తయారీ విధానం: 

  • బాదం పలుకులు, పుచ్చకాయ గింజలు, గసగసాలను రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.
  • స్టవ్‌పై పాత్రను పెట్టి పాలు పోసి మరిగించాలి. పంచదార వేయాలి. పంచదార కరిగిన తరువాత స్టవ్‌ పై నుంచి దింపాలి.
  • నానబెట్టిన బాదం పలుకుల పొట్టు తీయాలి. పుచ్చకాయ గింజ లు, గసగసాలలో ఉన్న నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీలో బాదం పలుకులు, పుచ్చకాయ గింజలు, గసగసాలు, జీడిపప్పు, మిరియాలు, యాలకులు, సోంపు వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తటి పేస్టులా చేసుకోవాలి.
  • ఈ పేస్టుని పాలు-పంచదార మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత పావుగంట పాటు పక్కన పెట్టాలి.
  • తరువాత కుంకుమ పువ్వు, రోజ్‌ ఎసెన్స్‌ వేసి కలియబెట్టుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లటి థాండై సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-03-27T05:41:12+05:30 IST