ఎయిర్‌ ఏషియా ఇండియా పూర్తిగా ‘టాటా’ల చేతుల్లోకి?

ABN , First Publish Date - 2020-07-10T05:47:34+05:30 IST

ఎయిర్‌ ఏషియా ఇండియాలో మలేషియా భాగస్వామికి చెందిన 49శాతం వాటా కొనుగోలు కోసం టాటా సన్స్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తద్వారా ఎయిర్‌ ఏషియా ఇండియా పూర్తిగా టాటాల పరమవుతుంది...

ఎయిర్‌ ఏషియా ఇండియా పూర్తిగా ‘టాటా’ల చేతుల్లోకి?

ఎయిర్‌లైన్స్‌లో 100శాతం వాటాదారుగా.. మారేందుకు టాటా సన్స్‌ ప్రయత్నాలు  


ముంబై: ఎయిర్‌ ఏషియా ఇండియాలో మలేషియా భాగస్వామికి చెందిన 49శాతం వాటా కొనుగోలు కోసం టాటా సన్స్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తద్వారా ఎయిర్‌ ఏషియా ఇండియా పూర్తిగా టాటాల పరమవుతుంది. ప్రస్తుతం ఈ ఎయిర్‌లైన్స్‌లో టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌కు 51 శాతం, మలేషియాకు చెందిన బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ ఎయిర్‌ ఏషియా బెర్హాద్‌కు 49 శాతం వాటా ఉంది. ఎయిర్‌ ఏషియా నుంచి ఈ వాటాను టాటా సన్స్‌ చాలా చౌకగా దక్కించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే, కరోనా సంక్షోభంతో ఎయిర్‌ ఏషి యా బెర్హాద్‌ ఆర్థిక కష్టాలు తీవ్రతరమయ్యాయి.


ఆస్తులను మించిన అప్పులు, అన్ని జాయింట్‌ వెంచర్లు నష్టాల్లో నడుస్తుండటంతో ప్రస్తుతం ఈ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆర్థిక కష్టాల్లోంచి గట్టెక్కేందుకు అవసరమైన నిధుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇండియా, జపాన్‌తోపాటు పలు దేశాల్లోని జాయిం ట్‌ వెంచర్లలో వాటా విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు ఎయిర్‌ ఏషియా బెర్హాద్‌ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌ ఈ మధ్యనే సంకేతాలిచ్చారు కూడా. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్‌ ఏషియా బెర్హాద్‌ 18.8 కోట్ల డాలర్ల నష్టాన్ని నమోదు చేసుకుంది. ఇదే కాలానికి ఎయిర్‌ ఏషియా ఇండియా రూ.330 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 

Updated Date - 2020-07-10T05:47:34+05:30 IST