కాపురంలో కలహాలు.. సిటీలో అద్దె గదిలో వేరుగా ఉంటున్న భార్య.. 7 నెలల తరువాత ఓ రోజు రాత్రి భర్త వెళ్తే..

ABN , First Publish Date - 2021-08-31T01:48:15+05:30 IST

ఓ రోజు రాత్రి భర్త భార్యను కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు..! ఆదే అతడి జీవితంలో చివరి రాత్రి అయింది. అతడి కేమైందో తెలియక సన్నిహితులు తల్లడిల్లిపోయారు. చివరకు...

కాపురంలో కలహాలు.. సిటీలో అద్దె గదిలో వేరుగా ఉంటున్న భార్య.. 7 నెలల తరువాత ఓ రోజు రాత్రి భర్త వెళ్తే..

ఇంటర్నెట్ డెస్క్: నాలుగేళ్ల క్రితం వారికి వివాహమైంది..! భార్యభర్తల మధ్య పొరపొచ్చాలు రావడంతో ఏడు నెలల క్రితం భార్య మరో ప్రాంతంలో అద్దె గది తీసుకుని విడిగా ఉండటం ప్రారంభించింది. ఈ క్రమంలో భర్త ఓ రోజు రాత్రి భార్యను కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు..! ఆదే అతడి జీవితంలో చివరి రాత్రి అయింది. అతడి కేమైందో తెలియక సన్నిహితులు తల్లడిల్లిపోయారు. కేసు తేలకుండా మిగిలిపోతుందనుకున్న తరుణంలో ఓ టాటూ ద్వారా పోలీసులు మిస్టరీని ఛేదించారు. అసలేం జరిగిందంటే.. 


ఢిల్లీకి చెందిన నవీన్, ముస్కాన్‌లకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది.  భర్తతో గొడవల కారణంగా ముస్కాన్ ఏడు నెలల క్రితం మరో ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని నివసిస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు 7న నవీన్ తన భార్యను కలిసేందుకు అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ముస్కాన్ స్నేహితుడు జమాల్ కనిపించడంతో అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. దీంతో.. వారి మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ఈ క్రమంలో మూస్కాన్.. తన తల్లి, స్నేహితుడు జమాల్‌ సాయంతో నవీన్‌పై కత్తితో దాడి చేసి అంతమొందించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో ఇద్దరు స్నేహితులు కూడా ఆమెకు సహకరించారు. నవీన్ మృతి చెందాడని నిర్ధారించుకున్న వారు.. అతడి శవాన్ని నీటితో కడిగి, సూట్‌కేసులో పెట్టి అదే రోజు రాత్రి ఆటోలో మరో ప్రాంతానికి తరలించారు. అక్కడున్న డ్రైనేజీలో సూట్‌కేస్‌ను పారేశారు. 


కాగా.. ఆగస్టు 10న స్థానికులు ఈ సూట్‌కేసును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.  అప్పటికే అందులోని శవం బాగా కుళ్లిపోయి ఉండటంతో మృతదేహం ఎవరిదనేది గుర్తించేందుకు పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. నవీన్ కుడి చేయిపై ఉన్న టాటో ఆధారంగా చివరికి మిస్టరీని ఛేదించారు. మొదట్లో ముస్కాన్ తన భర్త టాటూ వేయించుకున్నాడన్న విషయాన్నీ దాచిపెట్టింది. అయితే..పోలీసుల తమదైన రీతిలో ప్రశ్నించడంలో చివరకు చేసిన నేరాన్ని అంగీకరించింది. ఆమె కాల్ డాటాను ఆధారంగా పోలీసులు... జమాల్, మూస్కాన్ తల్లి, మరో నలుగురు ఈ హత్యలో ఆమెకు సహకరించినట్టు గుర్తించారు. ఇటీవలే నిందితులందరినీ అరెస్టు చేశారు.

Updated Date - 2021-08-31T01:48:15+05:30 IST