ఎద్దు.. వద్దు

ABN , First Publish Date - 2021-04-11T08:42:36+05:30 IST

ఎద్దు ఒకనాడు స్టేటస్‌ సింబల్‌! ఎన్ని ఎకరాల పొలం ఉందనే కంటే...ఇన్ని ఎద్దులున్నాయనే లెక్కే గొప్ప! ‘ఎద్దు’లా పనిచేయడం గ్రామాల్లోని శ్రమ సంస్కృతిని పట్టిచ్చే మాట! ఎద్దుల్లేని మోతుబరి

ఎద్దు.. వద్దు

చాకిరీ చేసిన పశువే బరువయింది

గణనీయంగా తగ్గిన వృషభ రాజాలు

ఒకనాడు వ్యవసాయంలో అవే నం.1

పెరిగిన పెట్టుబడులు, యాంత్రీకరణతో

సొంతం నుంచి కిరాయికి మారిన స్థితి

విభజన నాటికి ఏపీలో 12 లక్షల ఎద్దులు

అవిప్పుడు నాలుగు లక్షలు మాత్రమే

పశు ప్రయోగాలపై సర్కారూ నిరాసక్తి

ఇలాగే కొనసాగితే మ్యూజియంలో బొమ్మలే


ఎద్దు ఒకనాడు స్టేటస్‌ సింబల్‌! ఎన్ని ఎకరాల పొలం ఉందనే కంటే...ఇన్ని ఎద్దులున్నాయనే లెక్కే గొప్ప! ‘ఎద్దు’లా పనిచేయడం గ్రామాల్లోని శ్రమ సంస్కృతిని పట్టిచ్చే మాట! ఎద్దుల్లేని మోతుబరి రైతులే ఉండేవారు కాదు. కానీ, తర్వాత్తర్వాత మోతుబరి, ఉమ్మడి రైతు కుటుంబాలు విచ్ఛిన్నం అయి, ఎద్దుల బాగోగులు చూడటం కొత్త తరాలకు నామోషీగా మారిపోయింది. పైగా, ఆధునిక విధానాలపై పెరిగిన ఆసక్తి పశు పోషణకు వ్యవసాయంతో ఉన్న లంకెను తెంపేస్తోంది. ‘ఎద్దు.. వద్దు’ అనే పరిస్థితికి పల్లెసీమలను నెట్టేస్తోంది!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రైతు ఇంటి ముంగిట రంకెలు వేస్తూ, మెడలో గంటలతో చిరుసవ్వడి చేస్తూ, యజమానికి విశ్వాసం చూపుతూ, సాగు పనుల్లో చేయూతనందించేవి ఎద్దులు. కష్టపడి పని చేసే మనిషిని ఎద్దులా చాకిరి చేస్తారంటారు! గ్రామీణ వ్యవసాయ జీవనంలో ఎద్దు కష్టం అలాంటిది! ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, సాగులో పెరిగిన యాంత్రీకరణ, అసలు వ్యవసాయమే వదిలేస్తున్న రైతుల సంఖ్య పెరగడం, గ్రామాలొదిలి పట్టణాలకు పెరిగిన వలసలతో ఆలనాపాలనకు వీలు లేకపోవడం వంటి కారణాలు ఇప్పుడు ఎద్దుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ కాలంలో ఎద్దుల పెంపకందారుల్లో ఎక్కువ మంది సంపాదన కోసమే వాటిని వినియోగిస్తున్నారు. ఏడాదంతా ఎవరు మేపుతారనే ధోరణి పెరిగి.. కిరాయికి తెచ్చుకోవడం ఎక్కువయింది. ఈ సంస్కృతి సన్నచిన్నకారు, కౌలు రైతుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. జాతి లక్షణాలున్న ఎద్దులను బండలాగుడు పోటీలు, ఎద్దుల ప్రదర్శనలకు సిద్ధం చేస్తున్నారు. 


ఎందుకింత కష్టం! 

యంత్రాల రాకతో  పని పశువులు బలి పశువులవుతున్నాయి. యంత్రాలైతే ఏదొక మూల పడేసినా ఉంటాయి. పశువులు అలా కాదు. రోజూ కుటుంబ సభ్యుడిలా బాగోగులు చూసుకోవాలి. ప్రత్యేకంగా పశుశాలలు ఏర్పాటు చేసి, నిత్యం సంరక్షించాలి. అది చేసే చాకిరి కంటే, దానికి పెట్టే పెట్టుబడి ఎక్కువన్న భావనతో ఎద్దుల ఊసెత్తడం లేదు. ట్రాక్టర్లు, గొర్రు యంత్రాలు రాయితీలపైన, రుణాల పద్ధతిలో అందుబాటులోకి రావడం మరో కారణం. ఒంగోలు జాతి పశు సంతతి వృద్ధికి గుంటూరు సమీపంలోని లాంఫాంలో పరిశోధనలు జరుగుతున్నాయి. గతంలో కేంద్ర పథకాలతో విరివిగా పరిశోధనలు జరగా, ప్రస్తుతం ఆ స్థాయిలో లేవని సమాచారం. ఇక పుంగనూరు పశు సంతతి వృద్ధికి పులివెందులలోని ఏపీ కార్ల్‌లో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్‌ను చేపడుతున్నారు. స్వదేశీ ఆవుల పెంపకానికి కొత్త ప్రాజెక్ట్‌కు ప్రభుత్వ రూపకల్పన చేసింది. ఇంకా కార్యాచరణలోకి రాలేదు. 


ఏడేళ్లలో సగానికి సగం

నాలుగు దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో కోటిన్నర దాకా ఎద్దులు ఉన్నాయి. 2014లో అవి 12లక్షలకు తగ్గాయి. అప్పట్లో 13 జిల్లాల్లో ఎనిమిది లక్షల దాకా ఉండేవి. వాటి సంఖ్య ఇప్పుడు నాలుగు లక్షల్లోపే ఉండొచ్చునని అంచనా. రాష్ట్రంలో స్వదేశీ రకాలైన ఒంగోలు, పుంగనూరు జాతుల ఎద్దులే ఎక్కువగా ఉండగా, అరుదైన పుంగనూరు జాతి సంఖ్య అతితక్కువగా రెండు వేలే. ఒంగోలు జాతి లక్షణాలు కలిగిన ఎద్దులు 70ుదాకా ఉండగా, నాటురకం 30% ఉన్నాయి.


ఇదే పరిస్థితి కొనసాగితే.. రానున్న కాలంలో మ్యూజియంలో బొమ్మలకే ఎద్దులు పరిమితమవుతాయన్న ఆవేదన జంతుప్రేమికుల్లో వ్యక్తమవుతోంది. ఆడ పశువులు పాడికి ఉపయోగించుకుంటూ, మగ పశువుల పోషణ మానేయడం ఈజాతుల ఉనికికే ప్రమాదం తెచ్చిపెడుతోంది. జాతి అంతరించకుండా మేలు జాతి పశువుల వీర్యాన్ని సేకరించి, నిల్వ చేయవచ్చు. ఈ పశువులకు హాస్టళ్ల ఏర్పాటు చేసి, పేడను సేకరించి, సేంద్రియ సాగుకు అందించవచ్చని పలువురు జంతు ప్రేమికులు, సహజ సేద్యనిపుణులు సూచిస్తున్నారు. 

Updated Date - 2021-04-11T08:42:36+05:30 IST