పన్ను పోటు..!

ABN , First Publish Date - 2021-08-11T05:53:07+05:30 IST

పట్టణాల్లో పన్నుల మోతకు ప్రభుత్వం తెరలేపింది. మున్సిపాలిటీలు, నగరాల్లో పన్నులు పెంచి ఆదాయ వనరులు పెంచుకునేందుకు జీవో నెం.198 విడుదల చేసింది.

పన్ను పోటు..!
ఒంగోలు కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ కార్పొరేటర్లు

మున్సిపల్‌ పాలకవర్గాలు ఏర్పాటుకాగానే బాదుడు

ఇకపై రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా ఆస్తి పన్ను వసూలు

గృహాలపై 0.15, వాణిజ్య సంస్థలపై 0.30, 

ఖాళీస్థలాలపై 0.50 శాతం వసూలు 

పట్టణ ప్రాంతాల ప్రజలపైౖ మరింత భారం

ఒంగోలు కార్పొరేషన్‌ పాలవకర్గం ఆమోదం


మున్సిపల్‌ పాలకవర్గాలు ఏర్పాటు కాగానే జనానికి తొలి నజరానా అందింది. అసలే కొవిడ్‌ విపత్కర కాలం. ఉపాధి లేక, జీవనం సాగక, అతలాకుతలమైపోతున్న ప్రజలపై ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఒకవైపు పెరిగిన  నిత్యావసరాలు, మరోవైపు పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరల మంట, ఇంకోవైపు చార్జీల మోతతో సతమతమవుతున్న వారిపై పన్ను భారం మోపింది. ఆస్తి పన్ను పెంచుతూ జీవో నెం.198 జారీ చేసింది. దీంతో ప్రజలు మరింత కష్టాల్లో కూరుకుపోయారు. పన్నులు తగ్గించాలని అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజాసంఘాలు నెలరోజులుగా రోడ్డెక్కి గగ్గోలుపెడుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ప్రజల బాగోగులు పట్టించుకోకుండా పన్నుల పెంపునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో సామాన్య, మధ్యతరగతితో పాటు వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇకపై పట్టణాల్లో ఇళ్లపై పన్నులను రెట్టింపుచేయడంతో పరోక్షంగా ఈ భారం పేదలైన అద్దెదారులపై పడనుంది. రాష్ట్రంలో  పెద్దనగరాలతో సమానంగా మిగతా పట్టణాలపై పన్ను భారం మోపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఒంగోలు (కార్పొరేషన్‌), ఆగస్టు 10 : పట్టణాల్లో పన్నుల మోతకు ప్రభుత్వం తెరలేపింది.   మున్సిపాలిటీలు, నగరాల్లో పన్నులు పెంచి ఆదాయ వనరులు పెంచుకునేందుకు జీవో నెం.198 విడుదల చేసింది. అందుకు అనుగుణంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ పాలకవర్గాలు తీర్మానం చేసి, ఆమోద ముద్ర వేశాయి. దీంతో ఇకపై ఒంగోలు నగరంలో ఇంటి పన్నుల పెంపు పెనుభారంగా మారనుంది. వివరాల్లోకెళితే రాష్ట్రంలోని నగరపాలక, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను భారీగా పెరగనుంది. పట్టణ స్థానిక సంస్థల్లో మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదలపై యూజర్‌ చార్జీల మోత మోగించిన ప్రభుత్వం, తాజాగా ఆస్తి పన్నులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా వైసీపీ ఏలుబడిలో ఉన్న మున్సిపల్‌ పాలకవర్గాలు తీర్మానం చేయడంతో కొత్త విధానం అమల్లోకి రానుంది. 


రిజిస్ట్రేషన్‌ ఆధారంగా పన్ను..

కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న అద్దె ప్రాతిపదికన ఆస్తి పన్నుకు బదులుగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు నిర్ణయించిన ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వసూలు చేయనున్నారు. ఇప్పటి వరకు భవనానికి మాత్రమే పన్నులు విధిస్తుండగా, కొత్త విధానంలో ఆ భవానికి, అది ఉన్న స్థలానికి వేర్వేరుగా పన్నులు లెక్కిస్తారు. ఇదివరకు ఐదేళ్లకొకసారి పన్ను సవరించాలన్న నిబంధన ఉండగా, కొత్త విధానంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆస్తి విలువలను సవరించిన ప్రతిసారీ అంటే దాదాపు ఏటా ఆస్తి పన్ను పెరుగుతుంది. సాధారణ పన్ను, నీటి పన్ను, డ్రైనేజీ పన్ను, లైటింగ్‌, పర్యవేక్షణ పన్ను, లైబ్రరీ సెస్‌తో కలిపి భారీగా పన్నులు వసూలు చేయనున్నారు. ఒంగోలు కార్పొరేషన్‌లో ఇప్పటివరకు పన్నుల ద్వారా రూ.30 కోట్లదాకా ఆదాయం లభిస్తుండగా, ఈ విధానం ద్వారా మరో ఏడెనిమిది కోట్ల వరకూ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


పట్టణాల్లో పన్నల పెంపు ఇలా.. 

పట్టణ ప్రాంతాల్లో నూతన పన్నుల విధానం రెండు పద్ధతుల్లో అమలవుతుంది. ఇప్పటికే పన్నులు విధించిన ఆస్తుల విషయంలో ఒక విధానం, కొత్తగా కట్టిన నివాసగృహాల విషయంలో ఒక పద్ధతిని అమలు చేస్తారు.  పాత ఆస్తుల విషయాన్ని పరిశీలిస్తే ఒంగోలు నగరంలో ఒక నివాస భవనానికి అద్దె ఆధారంగా ప్రస్తుతం అర్ధ సంవత్సరానికి రూ.5వేలు వరకు పన్ను చెల్లిస్తారని అనుకుంటే కొత్త విధానం ప్రకారంమార్కెట్‌ విలువ ఆధారంగా ఆ ఆస్తి విలువ రూ.50లక్షలు ఉంటే 0.15 శాతం ప్రకారం రూ.7500 పన్ను చెల్లించాలి. అంటే దాదాపుగా 50 శాతం పన్ను భారం పడుతుంది. ఆ భారం తెలియకుండా ఉండేందుకు మరో వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం చెల్లిస్తున్న ఆస్తి పన్నుపై గరిష్ఠంగా 15 శాతానికి మించి కొత్త పన్ను వేయరాదని నిర్ణయించారు. రూ.5వేలపైన 15 శాతం అదనంగా ఉంటే రూ. 5,750 వరకు పన్ను విధిస్తారు. 


సెప్టెంబరు పన్నుల చెల్లింపుల్లో పెరిగిన భారం

వాస్తవానికి 2021 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త విధానం అమలులోకి రావాల్సి ఉంది. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధ వార్షిక సంవత్సరం సెప్టెంబరు 30వ తేదీతో ముగియనుండగా ఆనాటికే కొత్త పన్నులు అమలులోకి తేనున్నారు. అప్పడు జారీ చేసే పన్నుల నోటీసుల ఆధారంగా గృహ యజమాని పెరిగిన పన్నులు చెల్లించాలి.ప్రస్తుతం మార్కెట్‌ విలువ ప్రకారం నిర్ణయించే పన్నుల మదింపు ఇలా ఉంటుంది. నూతన భవన నిర్మాణాలకు మార్కెట్‌ విలువపైనే నేరుగా నివాస భవనాలకు 0.15శాతం వాణిజ్య భవనాలకు 0.30 శాతం పన్ను విధిస్తారు. రూ.50లక్షల విలువ చేసే నూతన భవనాల విషయాన్ని పరిశీలిస్తే భవనానికి అర్ధ సంవత్సరానికి రూ.7,500, ఏడాదికి రూ.15వేలు చెల్లించాలి. మార్కెట్‌ విలువ సవరణ ప్రకారం ఏటా పన్ను మారుతుంది. ఖాళీస్థలాల విషయానికొస్తే ఒక స్థలం మార్కెట్‌ విలువ ప్రస్తుతం రూ.10లక్షలు ఉంటే 0.50 శాతం పెంచనున్నారు. ఖాళీస్థలంలో చెత్త, వ్యర్థ పదార్థాలు ఉండి, అనారోగ్య పరిస్థితులు నెలకొన్నట్లయితేఅదనంగా 0.25శాతం పెనాల్టీ విధిస్తారు. 


ఆస్తి పన్ను పెంపుపై టీడీపీ, జనసేన నిరసన

ఆస్తి పన్నులు పెంచుతూ ఒంగోలు కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశం తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం కౌన్సిల్‌ సమావేశం అనంతరం కార్యాలయం బయట ప్లకార్డులు చేతబట్టి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్పొరేటర్లు మాట్లాడుతూపెద్ద నగరాలతో సమానంగా ఆస్తిపన్ను పెంచుతూ అధికార వైసీపీ నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ఒంగోలులో పారిశ్రామికంగా ఎలాంటి సంస్థలు లేవనీ, అదేవిధంగా ఆదాయ వనరులు వచ్చేలా వ్యవసాయం కూడా సాగని పరిస్థితి ఉందన్నారు. ఆర్థిక వనరులకు అవకాశాలు లేని నగరంలో ప్రజలపై భారం మోపే విధంగా పన్నులు పెంచడం అన్యాయమన్నారు. సమావేశంలో అజెండా అంశాలపై అభ్యంతరాలు కోరాల్సి ఉందని, అదేసమయంలో కారణాలు తెలుసుకోవాల్సిన మేయర్‌ సభా మర్యాదను పాటించకుండా తాము ఇవ్వదలచుకున్న డీసెంట్‌ నోట్‌ని తీసుకోకపోవడం బాధాకరమన్నారు. కమిషనరును కలిసి పన్నుల పెంపు వ్యతిరేకంగా వినతి పత్రాన్ని ఇచ్చామని టీడీపీ కార్పొరేటర్లు దాచర్ల వెంకటరమణయ్య, తిప్పరమల్లి రవితేజ, గుట్లపల్లి మస్తానమ్మ, వర్డ్స్‌వర్త్‌, అంబూరి శ్రీను, వేమూరి అశ్విని తెలిపారు. అదేవిధంగా కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట జనసేన ఆధ్వర్యంలో కార్పొరేటర్‌ మలగా రమేష్‌  నేతృత్వంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులుచిట్టెం ప్రసాద్‌, కార్యదర్శి రాయని రమేష్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-11T05:53:07+05:30 IST