పెట్రోలు, డీజిల్‌పై పన్ను వసూళ్లు రూ.3.35 లక్షల కోట్లు!

ABN , First Publish Date - 2021-07-20T07:11:19+05:30 IST

పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 88% పెరగడం విశేషం.

పెట్రోలు, డీజిల్‌పై పన్ను వసూళ్లు రూ.3.35 లక్షల కోట్లు!

  • 2020-21లో కేంద్రానికి భారీ రాబడి..
  • 2019-20లో 1.78 లక్షల కోట్లే
  • ఈ ఏడాది తొలి 3 నెలల్లోనే 94,181 కోట్లు.. 
  • లోక్‌సభలో వెల్లడించిన  కేంద్రం

న్యూఢిల్లీ, జూలై 19: పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 88% పెరగడం విశేషం. మార్చి 31 నాటికి రూ.3.35 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. గత ఏడాది పెట్రోలుపై ఎక్సైజ్‌ సుంకాన్ని లీటరుకు రూ.19.98 నుంచి రూ.32.90కు పెంచిన సంగతి తెలిసిందే. అలాగే డీజిల్‌పై లీటరుకు రూ.15.83 నుంచి రూ.31.80కు పెంచారు. ఈ క్రమంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ వసూళ్లు రూ.3.35 లక్షల కోట్లు వచ్చినట్లు కేంద్ర మంత్రి రామేశ్వర్‌ తేలి సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. 2019-20లో పన్ను వసూళ్లు రూ.1.78 లక్షల కోట్లేనని తెలిపారు. 


వసూళ్లు ఎక్కువగానే ఉన్నప్పటికీ కరోనా కట్టడికి విధించిన ఆంక్షలు, లాక్‌డౌన్‌ కారణంగా ఇంధన విక్రయాలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లోని ధరలకు అనుగుణంగా చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్‌ ధరలను సవరిస్తూ ఉంటాయని వివరించారు. 2017 జూన్‌ 16 నుంచి దేశంలో రోజువారీ ధరల సవరణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పెట్రోలు ధరలు 39 సార్లు పెరగ్గా, ఒక్కసారి తగ్గినట్లు, డీజిల్‌ ధరలు 36 సార్లు పెరగ్గా, 2 సార్లు తగ్గినట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో పెట్రోలు, డీజిల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ రూ.94,181 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధురి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇంధన విక్రయాలు భారీగా పెరగడంతో పన్ను వసూళ్లు కూడా అదేస్థాయిలో పెరిగాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఏటీఎఫ్‌, సహజ వాయువు సహా ఇతర పెట్రో ఉత్పత్తులన్నింటిపైనా కలిపి పన్ను వసూళ్లు మొత్తం రూ.1.01 లక్షల కోట్లని తెలిపారు. 

Updated Date - 2021-07-20T07:11:19+05:30 IST