పన్ను కడితేనే పథకాలు

ABN , First Publish Date - 2021-06-20T06:27:49+05:30 IST

చెత్త సేకరణకు నగరాల్లో రూ.90, పట్టణాల్లో రూ.60 చొప్పున నెల బిల్లు వసూలు చేయడం ప్రారంభించారు.

పన్ను కడితేనే పథకాలు

కరోనా పీడ దినాల్లో బలవంతపు వసూళ్లు

పలుచోట్ల సచివాలయ సిబ్బంది డిమాండ్‌


చిత్తూరు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): చెత్త సేకరణకు నగరాల్లో రూ.90, పట్టణాల్లో రూ.60 చొప్పున నెల బిల్లు వసూలు చేయడం ప్రారంభించారు. ఇంటి, కొళాయి పన్నులు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. కానీ గ్రామాల్లో 40 శాతం మంది ప్రజలు పంచాయతీలకు ఇంటి, కొళాయి పన్నులు చెల్లించరు. అక్కడ ఎవరూ పట్టించుకోరు కూడా. కానీ.. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సచివాలయ సిబ్బంది బలవంతంగా పన్ను వసూలు చేస్తున్నారు. ఇంటి పన్ను చెల్లించకుంటే లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల అమలులో కోత విధిస్తామని సొంతంగానే ప్రకటిస్తున్నారు. కరోనా నేపథ్యంలో చాలా మంది ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇలా పన్ను పోటుతో వేధించడం మంచిది కాదని బాధితులు వాపోతున్నారు.


పన్ను కట్టకుంటే ‘చేయూత’ కట్‌


45 - 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రభుత్వం ఏడాదికి రూ.18,750 అందిస్తోంది. ప్రస్తుతం ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో ఇంటి పన్ను కట్టకుంటే ఈ పథకం మంజూరు చేయబోమని సచివాలయ సిబ్బంది అంటున్నారు. గుర్రంకొండలో 3500 గృహాలుండగా.. దాదాపు 60శాతం మంది ఇంటి పన్ను చెల్లించారు. కొవిడ్‌ నేపథ్యంలో ఉపాధి లేక, కూలి పనులు దొరక్క కొందరు పేదలు పన్నులు చెల్లించలేదు. వీరిలో చాలామంది వైఎస్సార్‌ చేయూత పథకానికి అర్హులున్నారు. వీరందరికీ సచివాలయ సిబ్బంది పన్ను కట్టాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. ‘పన్ను కట్టకుంటే వైఎస్సార్‌ చేయూత మంజూరు చేయ’బోమని తేల్చి చెబుతున్నారు. దీంతో చేసేదేమీలేక పలువురు అప్పు చేసి మరీ ఇంటి పన్ను చెల్లించారు. ఇదే పరిస్థితి జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో నెలకొని ఉంది. ప్రభుత్వ పథకాలకు దూరం చేస్తామని చెప్పి భయాందోళనకు గురి చేస్తున్నారు.


పన్నుకు పథకాలకు సంబంధం లేదు 


పన్ను కడితేనే పథకాలు మంజూరు చేస్తామని చెప్పడం మంచిది కాదు. ఇలా చెప్పి పన్నులు వసూలు చేయమని ఎవ్వరూ ఆదేశాలివ్వలేదు. గుర్రంకొండ విషయం నా దృష్టికి వచ్చింది. వారిని హెచ్చరిస్తాను. జిల్లాలో మరెక్కడా సచివాలయ సిబ్బంది పథకాలను అడ్డు పెట్టుకుని పన్ను వసూలు చేయవద్దు. ఇలా చేస్తే అర్హులకు పథకాలను అందించే విషయంలో ప్రభుత్వ లక్ష్యం దెబ్బ తింటుంది.

                 - దశరథరామిరెడ్డి, డీపీవో




Updated Date - 2021-06-20T06:27:49+05:30 IST