పన్నుల పెంపు జీవోలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-06-22T05:39:34+05:30 IST

ఇంటి, చెత్త, మంచినీటి పన్నుల పెంపు జీవోలను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

పన్నుల పెంపు జీవోలు రద్దు చేయాలి
కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా

  1. సీపీఎం నాయకుల డిమాండ్‌.. కార్పొరేషన్‌ ఎదుట నిరసన


కర్నూలు(అర్బన్‌), జూన్‌ 21: ఇంటి, చెత్త, మంచినీటి పన్నుల పెంపు జీవోలను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నగర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ 196, 197, 198 జీవోలను రద్దు చేయాలన్నారు. ఇంట్లో ఎన్ని బాతురూమ్‌లు ఉంటే అన్ని రూ.40 చెల్లించాలని మున్సిపాలిటీ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనాతో ప్రజలు తీవ్రంగా అల్లాడుతుంటే పన్నుల భారం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణలో కరోనా కష్టాల్లో ప్రజలకు ఆదుకోవడం కోసం రూ.15 వేలలోపు ఉండే పన్నులను రద్దు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యురాలు నిర్మల మాట్లాడుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డి కేంద్రం చేతిలో కీలు బొమ్మలా మారాడని ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ చెప్పినట్లు నూతన పన్నుల విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. 198 జీవో ప్రకారం ప్రతి ఏటా 15 శాతం పన్నులు పెంచడం దుర్మార్గమన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ముందు కొత్త పన్నుల విధానాన్ని ప్రజలకు ఎందుకు తెలియజేయలేదన్నారు. మేయర్‌, కార్పొరేటర్లు కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసి కొత్త పన్నుల విధానానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కె.రాజగోపాల్‌, ఎస్‌ఏ సుభాన్‌, ఎం.విజయ్‌, షరీఫ్‌, రామకృష్ణ రవి, కుమార్‌, బి.లక్ష్మి, ధనలక్ష్మి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


ఆదోనిలో..


ఆదోని, జూన్‌ 21: పన్నుల రూపంలో ప్రజలపై మోయలేని భారం వేయడం సమంజసం కాదని న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి కె.తిక్కన్న, జనశక్తి జిల్లా కార్యదర్శి నరసింహయ్య, న్యూడెమోక్రసీ పార్టీ అధికార ప్రతినిధి మల్లికార్జున అన్నారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయం వారు ధర్నా చేసి కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారిని ఆదుకోవాల్సింది పోయి పన్నుల రూపంలో మరింత భారం మోపడం సరికాదన్నారు. ఆదాయపు పన్నులు, ఇంటి, చెత్త పన్నులు పెంచేందుకు తీసుకువచ్చిన 196, 197, 198 జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ సంక్షేమ పథకాల కోసం ప్రజలపై పన్నులు రూపంలో భారం మోపుతున్నారని ఆరోపించారు. ఆ జీవోలను రద్దు చేయాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ నాయకులు మణి, స్త్రీ విముక్తి రాష్ట్ర నాయకురాలు సుజ్ఞానమ్మ, కళావతి, ప్రసాద్‌, జగదీష్‌, చెన్నకేశవులు, నరేష్‌, వెంకటేష్‌, గంగన్న, ఈరన్న, బాషా, నాగరాజు, సోమశేఖర్‌, తిరుమలేష్‌, మల్లికార్జున, జయకర్‌, జానకిరామ్‌ పాల్గొన్నారు. 


నంద్యాలలో..


నంద్యాల, జూన్‌ 21: ప్రభుత్వం పెంచిన అన్ని రకాల పన్నులను రద్దు చేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా నాయకుడు ఎం.శంకర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. శంకర్‌ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పన్నుల రూపంలో మరింత భారం మోపడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఇంటి పన్నులు, చెత్త పన్నుల వసూళ్లకు జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు రఫీ, నవీన్‌కుమార్‌, చౌడప్ప, మహమ్మద్‌, కిరణ్‌, ఫారూక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:39:34+05:30 IST