Abn logo
Jun 22 2021 @ 00:32AM

వలస వెళ్లే సంపన్నులపై పన్ను

సంపన్నులు ఒక దేశం నుంచి మరో దేశానికి వలస వెళ్ళేందుకు కన్సల్టెన్సీ కంపెనీ హెన్లే అండ్ పార్టనర్స్ సహాయపడుతుంది. 2020 సంవ త్సరంలో భారత్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్ళదలుచుకున్నవారి సంఖ్య 63 శాతం పెరిగిందని ఆ సంస్థ పేర్కొంది. ఆ సంపన్నులు ఈ నిర్ణయానికి రావడానికి కోవిడ్ మహమ్మారి ఒక కారణమై ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఆ మహమ్మారి విరుచుకుపడకముందు 2018లో చైనా నుంచి 15 వేల మంది, రష్యా నుంచి 7 వేల మంది, భారత్ నుంచి 5 వేల మంది, టర్కీ నుంచి 4వేల మంది సంపన్నులు ఇతర దేశాలకు వలసపోయినట్టు ఆఫ్రో -ఆసియన్ బ్యాంక్ తన ‘గ్లోబల్ వెల్త్‌ మైగ్రేషన్ రివ్యూ’లో వెల్లడించింది. ప్రజాస్వామ్య పాలన ఉన్న భారత్ నుంచి అన్ని వేల మంది వలసవెళ్ళడమంటే దేశ ఆర్థికవ్యవస్థకు శుభస్కరం కాదన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. భద్రతే వారి వలసకు ప్రధాన కారణమని ప్రస్తావిత నివేదిక పేర్కొంది. మతతత్వ అల్లర్లు రెండో కారణం. మతపరమైన వివాదాలు ఆందోళనలకు దారి తీసి భద్రత కొరవడుతోంది. మీడియా స్వేచ్ఛ మూడో కారణం. ‘స్వేచ్ఛాయుత’ వాతావరణంలో జీవించేందుకు సంపన్నులు ఆరాటపడతారు. సమాచారాన్ని స్వేచ్ఛగా పొందే పరిస్థితులు లేకపోవడాన్ని సంపన్నులు హర్షించరు. ఆర్థికాభివృద్ధి రేటు తక్కువగా ఉండడం నాలుగో కారణం. అవకాశాలు తక్కువగా లభ్యమవడాన్ని ఇది సూచిస్తుంది. మరి అవకాశాలు లేకపోవడమనేది అనివార్యంగా సామాజిక అశాంతికి దారితీస్తుంది కదా. విదేశాలకు సంపన్నుల వలసలను అరికట్టేందుకు ఈ కింద సూచించిన చర్యలను ప్రభుత్వం తప్పక పరిశీలనలోకి తీసుకోవాలి.


సీనియర్‌ పోలీస్‌ అధికారుల విధి నిర్వహణ తీరుతెన్నులపై బాహ్య మూల్యాంకనం చేయించాలి. క్లాస్‌–ఏ అధికారుల పనితీరుపై బాహ్య మూల్యాంకనం తప్పనిసరి అని ఐదవ వేతనసంఘం సిఫారసు చేసింది. అయితే ఐఏఎస్ అధికారుల ఒత్తిడి ఫలితంగా ప్రభుత్వం ఆ సిఫారసును ఉపేక్షిస్తోంది. అటువంటి మూల్యాంకనం వల్ల నేరాలను నియంత్రించడంలో అత్యంత సమర్థతతో వ్యవహరిస్తున్న పోలీస్‌ అధికారుల గురించిన సమాచారం ప్రభుత్వానికి నిష్పాక్షికంగా సమకూరుతుంది.


వారణాసిని ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా రూపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించారు. మలేసియా లాంటి దేశాలలోను, మనదేశం లోని కేరళ వంటి రాష్ట్రాలలోనూ వివిధ మతాల అనుయాయులు శాంతియుత సహజీవనం చేస్తున్నారు. అన్ని మతాలవారు ఇతర మతాల ప్రబోధాల గురించి అవగాహన కలిగి ఉండడం వల్లే సహజీవనం సాధ్యమవుతోంది. అన్ని మతాలు మౌలికంగా ఒకే సత్యాన్ని బోధిస్తున్నాయనే వివేకమే పరమత సహనభావాన్ని పెంపొందిస్తుంది. ఐఐటిలు, ఐఐఎమ్‌లు లాగా ప్రతి రాష్ట్రంలోనూ ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రెలిజియన్స్’ నేర్పాటు చేసేందుకు ప్రభుత్వం పూనుకోవడం రెండో చర్య. సదరు సంస్థలలోని వివిధ మతాల అధ్యయన విభాగాలు విభిన్న మతాల మధ్య నిర్మాణాత్మక చర్చలకు, మెరుగైన అవగాహనకు దోహదం చేస్తాయి. ‘విమర్శకులను సన్నిహితంగా ఉంచుకో. వారు సదా నీ ఆలోచనలను సంస్కరిస్తుంటారు’ అని కబీర్ అన్నాడు. ప్రభుత్వ కార్యకలాపాలను నిర్మాణాత్మకంగా విమర్శించే పత్రికలు, టీవీ చానెళ్లకు ప్రభుత్వం ప్రత్యేక వాణిజ్య ప్రకటనలు ఇచ్చి తీరాలి. ప్రభుత్వ ఉదారవాద వైఖరి వల్ల సంపన్నులకు తాము స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నామనే భరోసా కలుగుతుంది. గత ఆరు సంవత్సరాలుగా మన స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు క్రమంగా తగ్గిపోతోంది. అదే సమయంలో షేర్‌మార్కెట్లు అంతకంతకూ పుంజుకుంటున్నాయి. ఈ విరుద్ధ పరిణామాలకు కారణమేమిటి? మన ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు. అవి కార్పొరేట్ వ్యాపార సంస్థలు మరింతగా లాభార్జన చేసేందుకు తోడ్పడుతున్నాయి. చిన్నతరహా, మధ్యతరహా వ్యాపార సంస్థల మనుగడకు తీవ్ర విఘాతమవుతున్నాయి. చిన్న వ్యాపారసంస్థల మనుగడను దెబ్బ తీసి, వాటి మార్కెట్‌ను కార్పొరేట్ సంస్థలకు ఎందుకు ధారాగతం చేస్తున్నారు? అలా చేయడం వల్ల, దేశ ఆర్థికవ్యవస్థ ఇతోధికంగా అభివృద్ధి చెంది సంపన్నులు భారత్‌లోనే ఉండిపోయేందుకు దోహదం జరగుతుందని విధానకర్తలు భావిస్తున్నారు. అయితే వాస్తవానికి అందుకు పూర్తిగా వ్యతిరేక పర్యవసానాలు జరుగుతున్నాయి. చిన్న వ్యాపారసంస్థలు మూత పడడం ఆర్థికవ్యవస్థలో డిమాండ్‌ తగ్గిపోవడానికి దారితీస్తుంది. వృద్ధిరేటు పడిపోతుంది. ఫలితంగా సంపన్నులు ఎంతగా లాభాల నార్జిస్తున్నప్పటికీ కొత్త వ్యాపార అవకాశాలు వారికి కొరవడతాయి.అంతిమంగా, సంపన్నులు ఇతర దేశాలకు వలసపోవడం అనివార్యమవుతుంది.  


భారతీయ పౌరసత్వాన్ని వదులుకోదలుచుకున్న సంపన్నులు, విద్యాధికులపై ‘నిష్క్రమణ పన్ను’ విధించి తీరాలి. అమెరికాలో చాలాకాలంగా ఇటువంటి పన్ను అమల్లో ఉంది. అమెరికా పౌరసత్వాన్ని త్యజించేవారు విధిగా భారీ ‘నిష్క్రమణ పన్ను’ చెల్లించడం అనివార్యమవుతుంది. అమెరికా ప్రభుత్వం అందిస్తున్న సేవల నుంచి లబ్ధిపొందుతున్న వ్యక్తి విధిగా అందుకయ్యే వ్యయాన్ని అమెరికాకు తిరిగి చెల్లించవలసి ఉంది. ఇది నైతిక పౌర బాధ్యత. రాజ్యం నుంచి ప్రయోజనాలు పొందుతున్నవారు సంబంధిత సమాజశ్రేయస్సుకు తప్పకతోడ్పడాలి. ఐఐటి, ఐఐఎమ్‌ పట్టభద్రులతో సహా ఎంతో మంది సంపన్నులు మన దేశం నుంచి విదేశాలకు తరలిపోతున్నారు. తమ విద్యకు, వృత్తి శిక్షణకు దేశం భారీ మొత్తంలో చేసిన వ్యయాన్ని వారు విస్మరిస్తున్నారు. కనుక దేశ పౌరసత్వాన్ని వదులుకోదలుచుకున్న వారిపై భారీ నిష్క్రమణ పన్ను విధించితీరాలి. 

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)


ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...