ఇక ఖాళీ స్థలాలకూ పన్ను!

ABN , First Publish Date - 2021-07-30T06:01:53+05:30 IST

నల్లగొండ మునిసిపాలిటిలో ఇక నుంచి వెకేట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌(వీఎల్టీ) విధించనున్నారు. ఖాళీ స్థలాలకు కూడా పన్ను వసూలు చేయాలని సీడీఎంఏ నుంచి ఆదేశాలు రావడంతో అందుకు మునిసిపల్‌ అధికారులు సిద్ధమయ్యారు.

ఇక ఖాళీ స్థలాలకూ పన్ను!

ప్రభుత్వ మార్కెట్‌ ధరలో 0.05శాతం

మునిసిపాలిటికి భారీగా సమకూరనున్న ఆదాయం 

కౌన్సిల్‌ తీర్మానమే తరువాయి

రామగిరి, జూలై 29: నల్లగొండ మునిసిపాలిటిలో ఇక నుంచి వెకేట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌(వీఎల్టీ) విధించనున్నారు. ఖాళీ స్థలాలకు కూడా పన్ను వసూలు చేయాలని సీడీఎంఏ నుంచి ఆదేశాలు రావడంతో అందుకు మునిసిపల్‌ అధికారులు సిద్ధమయ్యారు. పాలకవర్గ ఆమోదం కోసం 31న నిర్వహించనున్న కౌన్సిల్‌ సమావేశంలో ఈ అంశాన్ని పొందుపరిచారు. కౌన్సిల్‌ తీర్మానం అనంతరం ఖాళీ స్థలాలకు పన్ను అమల్లోకి రానుంది.

అనుమతి ఉన్న ప్లాట్‌లకు మాత్రమే వీఎల్టీ

అప్రూవ్డ్‌ లేఅవుట్‌ ప్లాట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌ అప్రూవ్డ్‌ ప్లాట్‌లకు మాత్రమే వీఎల్టీ సెక్షన్‌ 97(4) ప్రకారం 0.05శాతం నుంచి 0.20శాతం పన్ను విధించేందుకు కౌన్సిల్‌ ఆమోదం తీసుకోవాలని సీడీఎంఏ గత నెల 26న సర్క్యులర్‌ జారీ చేశారు. అయితే పాలకవర్గం మాత్రం 0.05శాతం పన్ను విధించేందుకు నిర్ణయించింది. పట్టణ పరిధిలో అనుమతిపొందిన వెంచర్లు 74 ఉన్నాయి. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతి పొందిన ఖాళీ స్థలాలు 3,781 ఉన్నాయి. ఒక్కో వెంచర్లో 80 నుంచి 100 ప్లాట్ల వరకు ఉన్నాయి. ఇవి సుమారు 8వేల వరకు ఉంటాయి. మొత్తంగా 11వేల వరకు ఖాళీ స్థలాలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటన్నిటికీ ప్రభుత్వ మార్కెట్‌ ధరలో 0.05శాతం చొప్పున పన్ను విధించనున్నారు. దీంతో మునిసిపాలిటికి అదనంగా ఆదాయం సమకూరనుంది. ఎల్‌ఆర్‌ఎ్‌సకు 35,774 దరఖాస్తులు వచ్చాయి. వీటి అనుమతి విషయం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు తీర్పు అనంతరం ఈ స్థలాలు కుడా వీఎల్టీ పరిధిలోకి రానున్నాయి. దీంతో మునిసిపాలిటికి భారీగా ఆదాయం సమకూరనుంది.

కౌన్సిల్‌ తీర్మానం అనంతరం

పట్టణంలోని ఖాళీ స్థలాలకు పన్ను విధించేందుకు మునిసిపల్‌ అధికారులు ఇప్పటికే సన్నద్దం అయ్యారు. అందుకు కౌన్సిల్‌ తీర్మానం తీసుకునేందుకు ఈ నెల 31న జరగనున్న సమావేశంలో ఎజెండాగా పొందుపరిచారు. కౌన్సిల్‌ తీర్మానం అనంతరం ఈ విధానం అమలులోకి రానుంది. విధానంతో ఓపెన్‌ స్థలాలు డబుల్‌ రిజిస్త్రేషన్‌, అన్యాక్రాంతం కాకుండా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

త్వరలో ఖాళీ స్థలాలకు పన్ను వసూలు చేస్తాం : శ్రీనివాస్‌, నల్లగొండ ఇన్‌చార్జి కమిషనర్‌

పట్టణ పరిధిలోని ఖాళీ స్థలాలకు పన్ను విధించాలని సీడీఎంఏ నెల రోజుల క్రితమే సర్క్యులర్‌ ఇచ్చింది. ఈ నెల 31న ఉదయం 11గంటలకు కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించనున్నాం. అందులో ఎజెండాగా ఈ అంశాన్ని పొందుపరిచాం. ఎంత పన్ను అనేది ఆయా ప్రాంతాన్నిబట్టి సీడీఎంఏ వెబ్‌సైట్‌లో ఉంది.

Updated Date - 2021-07-30T06:01:53+05:30 IST