పన్ను ఆదాకు ఆన్‌లైన్‌ బాట

ABN , First Publish Date - 2020-03-29T05:57:38+05:30 IST

ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడే వారు ఆదాయ పన్ను చట్టం తమకు కల్పించే పన్ను మినహాయింపులను వినియోగించుకోవాలనుకుంటారు. ఇందుకోసం పన్ను ఆదా సాధనాల్లో పెట్టుబడి పెడుతుంటారు.

పన్ను ఆదాకు ఆన్‌లైన్‌ బాట

ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడే వారు ఆదాయ పన్ను చట్టం తమకు కల్పించే పన్ను మినహాయింపులను వినియోగించుకోవాలనుకుంటారు. ఇందుకోసం పన్ను ఆదా సాధనాల్లో పెట్టుబడి పెడుతుంటారు. సాధారణంగా ఇలాంటి పెట్టుబడులకు తుది గడువు మార్చి 31 వరకు ఉంటుంది. ప్రణాళికాబద్దంగా వ్యవహరించని వారు గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళన చెందుతుంటారు. చిట్టచివరికి అనవసరమైన వాటిలో పెట్టుబడి పెడతారు. అయితే 31వ తేదీ దగ్గరపడున్న నేపథ్యంలో చాలా మంది వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో ఆందోళన ఎక్కువైంది. ఇందుకు కారణం కరోనా వ్యాప్తి మూలంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడమే. ఈ నేపథ్యంలో వీరికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కాస్త ఊరట కల్పించారు. పన్ను ఆదా సాధనాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న గడువును 2020 జూన్‌ 30 వరకు పొడిగించారు. ఇది ఎంతో మంది పన్ను చెల్లింపుదారులకు మంచి అవకాశం. అయితే ఇప్పుడు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఉద్యోగ బాధ్యతలు కూడా లేవు. కాబట్టి మీకు తగినంత ఖాళీ సమయం ఉంది కదా... అందుకే ఆన్‌లైన్‌ ద్వారా మీకు మినహాయింపు లభించే పన్ను ఆదా సాధనాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ రోజుల్లో అనేక మంది ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. మీకు కూడా ఈ సదుపాయం ఉండే ఉంటుంది. ఒకవేళ లేకపోయినా దీన్ని అందుబాటులోకి తెచ్చుకోవడం సులభం. ఇక మీకు అందుబాటులో ఉన్న సాధనాలు ఏమిటంటే..



బీమా పాలసీలు 

టర్మ్‌ ఇన్సూరెన్స్‌, జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియంను ఆదాయ పన్ను మినహాయింపుల కోసం వినియోగించుకోవచ్చు. సెక్షన్‌ 80సీ కింద టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం మొత్తానికి మినహాయింపు లభిస్తుంది. ఆరోగ్య బీమా ప్రీమియంకూ మినహాయింపు లభిస్తుంది. ఎంప్లాయర్‌ గ్రూప్‌ పాలసీ ఉంటే అది సెక్షన్‌ 80డీ కింద మినహాయింపు లభిస్తుంది. ఇక టర్మ్‌ ఇన్సూరెన్స్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను ఆన్‌లైన్‌ ద్వారా చాలా సులభంగా కొనుగోలు చేయవచ్చు. బీమా కంపెనీల వెబ్‌సైట్ల ద్వారా లేదా బీమా కంపెనీల పాలసీలను విక్రయించే పలు ఇతర వెబ్‌సైట్ల ద్వారా పాలసీలను కొనుగోలు చేయవచ్చు. 



ఐదేళ్ల బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అంటే ఎలాంటి రిస్క్‌ ఉండదనే చెప్పాలి. అయితే చేతికి అందే వడ్డీ మాత్రం తక్కువగా ఉంటుంది. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో తగ్గుతూ వస్తోంది. అయినప్పటికీ బ్యాంక్‌ డిపాజిట్లకు మంచి ఆదరణ లభిస్తోంది. సెక్షన్‌ 80సీ కింద మీ పెట్టుబడి పరిమితి రూ.1.50 లక్షలకు చేరకపోతే  ఐదేళ్ల పన్ను ఆదా బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను ఎంచుకోవచ్చు. ఈ పెట్టుబడులకు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. 


పన్ను ఆదా మ్యూచువల్‌ ఫండ్స్‌

ఆదాయ పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పన్ను చెల్లింపుదారులు నిర్దేశిత మొత్తానికి పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంది. ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్‌ స్కీమ్స్‌ (ఈఎల్‌ఎ్‌సఎ్‌స)లో పెట్టుబడుల ద్వారా సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. గరిష్ఠ పెట్టుబడి రూ.1.5 లక్షల వరకు ఇది వర్తిస్తుంది. ఈక్విటీలో పెట్టుబడి కాబట్టి కొంత రిస్క్‌ కూడా ఉంటుంది మరి. ఈ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు స్టాక్‌ మార్కెట్లలో భారీ లాభనష్టాలు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు అనేక షేర్లు చాలా తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి మరి. ఇది పెట్టుబడులకు మంచి అవకాశమని కూడా కొంత మంది స్టాక్‌ మార్కెట్‌ పండితులు చెబుతున్నారు. ఈ విషయంలో మీరు కాస్త ఆలోచించాలి. రిస్క్‌ లేనిదే రివార్డ్‌ లేదని చాలా మంది అంటుంటారు కదా. ఇక ఈఎల్‌ఎ్‌సఎ్‌సలో మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. కాబట్టి  మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉన్నాఈ కాలంలో అవి సర్దుకుంటాయని కొంత మంది విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టాలన్న నిర్ణయం తీసుకుంటే.. ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహా తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీని ఎలా నిర్వహించాలో వారు చెబుతారు. దాదాపు అన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా ఆన్‌లైన్‌లో యూనిట్లను కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. మీ మొబైల్‌ నెంబర్‌తో పాటు మరిన్ని వివరాలు అందించడం ద్వారా యూనిట్లను కొనుగోలు చేసే ప్రక్రియను చేపట్టవచ్చు. 

Updated Date - 2020-03-29T05:57:38+05:30 IST