టీసీఎస్‌ లాభం రూ.8,701 కోట్లు

ABN , First Publish Date - 2021-01-09T06:49:26+05:30 IST

దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) డిసెంబరు 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో మార్కెట్‌ అంచనాలను మించి లాభాలు ప్రకటించింది.

టీసీఎస్‌ లాభం రూ.8,701  కోట్లు

ఒక్కో  షేరుపై రూ.6 డివిడెండ్‌


ముంబై: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) డిసెంబరు 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో మార్కెట్‌ అంచనాలను మించి లాభాలు ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో రూ.8701 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.8118 కోట్లతో పోల్చితే లాభం 7.2 శాతం పెరిగింది. త్రైమాసిక ఆదాయం కూడా 5.4 శాతం పెరిగి రూ.39,854 కోట్ల నుంచి రూ.42,015 కోట్లకు చేరింది. గత తొమ్మిదేళ్ల కాలంలో డిసెంబరు త్రైమాసికంలో నమోదైన బలమైన వృద్ధి ఇదేనని టీసీఎస్‌ ప్రకటించింది. కంపెనీ సాంప్రదాయాన్ని అనుసరించి రాబోయే త్రైమాసికాలకు ఎలాంటి అంచనాలు ప్రకటించలేదు. 


కీలక సేవలకు డిమాండ్‌ పెరగడం, గతంలో సాధించిన డీల్స్‌ ద్వారా అందుతున్న చక్కని ఆదాయాలు ప్రతికూలతలను కూడా ఎదురొడ్డి నిలిచే బలం ఇచ్చాయని, డిసెంబరు త్రైమాసికంలో అరుదైన ఉత్తమ పనితీరును ప్రదర్శించగలిగామని టీసీఎస్‌ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ గోపీనాథన్‌ అన్నారు.


‘‘ఆశావహ వైఖరి’’తో తాము కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని ఆయన చెప్పారు. తాము అనుసరించిన హద్దులు లేని పని ప్రదేశాల నమూనా గత ఐదేళ్ల కాలంలో అధిక నిర్వహణా మార్జిన్లు నమోదు చేయడానికి దోహదపడిందని, ఈ త్రైమాసికంలో వేతనాలు పెంచేందుకు కూడా సహాయకారి అయిందని ఆయన చెప్పారు.

సరిహద్దులు లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు క్లౌడ్‌ చక్కని వ్యాపారావకాశమని గోపీనాథన్‌ అన్నారు. కస్టమర్లకు వినూత్నమైన, ప్రయోజనకరమైన సొల్యూషన్లు అందించేందుకు  క్లౌడ్‌ విభాగం విస్తృత ప్రాతిపదికన  భాగస్వామ్యాలు, సహకారాలకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు.


షేరు జోరు:

కంపెనీ ఆర్థిక ఫలితాలు శక్తివంతంగానే ఉంటాయన్న భరోసాతో శుక్రవారం టీసీఎస్‌ షేరు బీఎ్‌సఈలో 2.89 శాతం పెరిగి రూ.3120.35 వద్ద ముగిసింది. గత ఏడాది మొత్తం మీద కూడా షేరు దూకుడు కొనసాగింది. షేరు ధరలో ఏడాది మొత్తంలో 32.4 శాతం, డిసెంబరు త్రైమాసికంలో 15 శాతం వృద్ధి చోటు చేసుకుంది. మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించడానికి ముందే టీసీఎస్‌ బైబ్యాక్‌ పూర్తి చేసింది. రూ.3,000 ధరకు 5,33,33,333 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. దీంతో ప్రమోటర్ల వాటా 72.19 శాతానికి చేరింది.  


ప్రధానాంశాలు...

 వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.6 డివిడెండును  టీసీఎస్‌ ప్రకటించింది. రికార్డు తేదీ జనవరి 16

 టీసీఎస్‌ మొత్తం ఉద్యోగుల సంఖ్య గత డిసెంబరు నాటికి 4.69 లక్షలుగా ఉంది 

 మూడో త్రైమాసికంలో టీసీఎస్‌ 680 కోట్ల డాలర్ల విలువ గల కొత్త డీల్స్‌ కుదుర్చుకుంది

 త్రైమాసిక నిర్వహణా మార్జిన్‌ 26.6 శాతం, నికర మార్జిన్‌ 20.7 శాతంగా నమోదయ్యాయి. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంతో పోల్చితే లాభం 16.4 శాతం పెరిగింది. పన్ను, వడ్డీ చెల్లింపుల ముందు రాబడి (ఎబిటా) 6.4 శాతం పెరిగి రూ.11,184 కోట్లుగా నమోదైంది 

 అన్ని వ్యాపార విభాగాల్లోనూ బలమైన వృద్ధి.  తయారీ (7.1 శాతం), బీఎ్‌ఫఎ్‌సఐ (2 శాతం), లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ (5.2 శాతం), కమ్యూనికేషన్‌ అండ్‌ మీడియా (5.5 శాతం), రిటైల్‌, సీపీజీ (3.1 శాతం) వృద్ధిని నమోదు చేశాయి

 భౌగోళిక ప్రదేశాల వారీగా చూస్తే ఉత్తర అమెరికా (3.3 శాతం), ఇండియా (18.1 శాతం), యూకే (4.5 శాతం), యూరప్‌ (2.5 శాతం) వృద్ధి నమోదైంది. ఇతర మార్కెట్లలో కూడా మంచి వృద్ధి చోటు చేసుకుంది.


Updated Date - 2021-01-09T06:49:26+05:30 IST