హోల్‌సేల్‌గా జగన్‌.. రిటైల్‌గా ఎమ్మెల్యే దండేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-04-14T05:02:28+05:30 IST

‘‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హోల్‌సేల్‌ వ్యాపారి అయితే, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ రిటైల్‌ వ్యాపారి. ఆయన గూడూరులో చిల్లరకొట్టు పెట్టుకుని దండుకుంటున్నారు.

హోల్‌సేల్‌గా జగన్‌.. రిటైల్‌గా ఎమ్మెల్యే  దండేస్తున్నారు!
గూడూరులో జరిగిన సభలో పాల్గొన్న జనం

కమీషన్‌ కోసం గూడూరు అభివృద్ధి తాకట్టు

వ్యాపారుల నుంచి లాభాల పంట పండిస్తున్నారు!

ఇంత చేస్తున్నా సీఎం చేస్తున్నట్టు?

ఓటు వేయకుంటే కొంపలు మునుగుతాయ్‌!

పనిచేసే లక్ష్మి.. పనబాక లక్ష్మిని గెలిపించండి!

గూడూరు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు


నెల్లూరు ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి) : ‘‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హోల్‌సేల్‌ వ్యాపారి అయితే, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ రిటైల్‌ వ్యాపారి. ఆయన గూడూరులో చిల్లరకొట్టు పెట్టుకుని దండుకుంటున్నారు. రెస్టారెంట్స్‌, టీ స్టాల్స్‌, చికెన్‌ షాపులు ఇతర వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకుంటూ లాభాలు పంట పండిస్తున్నారు. చివరకు బదిలీ కావాలన్నా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. వాళ్ల ఎమ్మెల్యే ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే సీఎం జగన్‌రెడ్డి ఏం చేస్తున్నారు!?’’ అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఆయన గూడూరు పట్టణంలో రోడ్‌షో నిర్వహించి, మార్కెట్‌ సెంటర్‌లో జరిగిన సభలో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సిలికాను స్వేచ్ఛగా విక్రయించుకునే పరిస్థితి ఉండేదని తద్వారా ఎంతోమంది ఉపాధి అవకాశాలు పొందారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కమీషన్‌ల కోసం గూడూరు ప్రాంత అభివృద్ధిని తాకట్టు పెట్టారని విమర్శించారు. గూడూరు పట్టణంలో ప్రధాన రహదారి గుంతలమయమైతే కనీసం తట్ట తారు కూడా వేయలేని దౌర్భాగ్యం నెలకొందని దుయ్యబట్టారు.


స్వర్ణముఖి ఇసుక ఎక్కడికి వెళుతోంది!?


స్వర్ణముఖి ఇసుక ఆ ప్రాంత ప్రజలకు దొరకటం లేదని అది ఎక్కడకు పోతుందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురిస్తే దానిపై ముఖ్యమంత్రి మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు మరో కొత్త ఇసుక పాలసీ పేరుతో సీఎం ఒకే కంపెనీకి కట్టబెట్టి హోల్‌సేల్‌ డోపిడీకి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో సహజ వనరులన్నీ సీఎం కంట్రోల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. లాయర్‌గా ఉన్న బల్లి దుర్గాప్రసాద్‌రావును తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశానని గుర్తు చేశారు. తమ పార్టీ ఎంపీ చనిపోతే కనీసం ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం జగన్‌ రాకపోడటం దారుణమన్నారు. తిరుపతి పార్లమెంట్‌ను విద్యాహబ్‌గా, ఇండస్ట్రియల్‌ హబ్‌ రూపుదిద్దింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. తిరుపతిలో ఐఐటీ, మహిళా మెడికల్‌ కళాశాల, స్విమ్స్‌, శ్రీసిటీలో త్రిబుల్‌ ఐటీ వంటి విధ్యాసంస్ధలను స్థాపించావని చెప్పారు. ఇప్పుడు ఒక్క పరిశ్రమైనా ఏర్పాటయిందా!? అని ప్రశ్నించారు. చెన్నై, తిరుపతి, నెల్లూరు ఎయిర్‌పోర్టులను కలుపుతూ ఈ ప్రాంత అభివృద్దికి ప్రణాళికలు రచించామని కానీ జగన్‌రెడ్డి ప్రభుత్వం వాటిని నాశనం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు.  నదుల అనుసంధానం ద్వారా కృష్ణాజలాలను సోమశిలకు తీసుకువచ్చామని, ఇప్పుడు గోధావరి పెన్నా నదుల అనుసంధానం నిలిచి పోయిందన్నారు. ఓటు వేయక పోతే ఏం కాదులే అన్న నిర్లక్ష్యం వద్దని, ఓటు వేయకపోతే కొంపలు మునుగుతాయని ప్రజలకు సూచించారు. పనిచేసే లక్ష్మిగా పేరుతెచ్చుకున్న పనబాక లక్ష్మిని గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాశం సునీల్‌కుమార్‌, భూమా బ్రహ్మానందరెడ్డి, పనబాక కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 

 

తరలివచ్చిన ప్రజలు


గూడూరు రూరల్‌ : గూడూరు పట్టణంలో మంగళవారం నిర్వహించిన చంద్రబాబునాయుడు రోడ్‌షోలో జనం భారీగా తరలివచ్చారు. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని విఘ్నేశ్వరస్వామి ఆలయం వద మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌, పనబాక కృష్ణయ్యలు  చంద్రబాబుకు స్వాగతం పలికారు. అక్కడ నుంచి పాదయాత్రగా బయలుదేరి పాతమోతి మహల్‌ సెంటర్‌లోని సభాస్థలికి చేరుకున్నారు.  సభ జరిగిన ప్రాంతమంతా జనాభాతో కిక్కిరిసి పసుపుమయంగా మారడంతోపాటు టీడీపీ జెండాలు రెపరెపలాడాయి.  యువత డాన్స్‌ చేస్తుండటంతో వారిని మరింత ఉత్తేజ పరుస్తూ చంద్రబాబు కూడా చేతులు ఊపటం విశేషం. అనంతరం పలువురు వ్యాపారులు, అభిమానులు నిమ్మకాయలతో తయారు చేసిన భారీ మాలను చంద్రబాబుకు వేశారు. 



Updated Date - 2021-04-14T05:02:28+05:30 IST