Abn logo
Nov 28 2020 @ 01:03AM

గ్రేటర్‌లో టీడీపీ సమరం

గత వైభవం కోసం ఎత్తులు  

150 డివిజన్లకు గాను 106 స్థానాల్లో పోటీ

ఓటు బ్యాంకు ఆదుకుంటుందన్న ఆశ

మెజారిటీ స్థానాలు గెలుచుకునేందుకు నేతల యత్నాలు

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ పరిధిలో తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఈ ఎన్నికలు మంచి అవకాశంగా తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. తమకంటూ స్పష్టమైన జనాదరణ ఉందని, దానిని ఈ ఎన్నికలలో మరోసారి రుజువు చేసుకుంటామని ఆ పార్టీ అభ్యర్థులు చెబుతున్నారు. మొత్తం 150 డివిజన్లకు గాను 106 స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టారు. వివిధ సామాజికవర్గాల మధ్యన బ్యాలెన్స్‌ పాటిస్తూ అభ్యర్థుల్ని ప్రకటించారు. వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ జాబితా రూపొందించారు. నేర చరిత్ర లేని వారినే సెలక్ట్‌ చేశారు. ప్రచారంలో హంగూ, ఆర్భాటాలూ పెద్దగా ప్రదర్శించపోయినా, తెలుగుదేశం పార్టీ విధానాలను ప్రచారం చేయడంలో అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌కు గుర్తింపు తెచ్చింది తమ నేత చంద్రబాబే అన్న అంశాన్ని అక్కడక్కడా ప్రస్తావిస్తున్నారు. అన్నింటికంటే ప్రధానంగా.. ‘దేశం’ పాలకులు సిటీలో శాంతి, సామరస్యం కాపాడడానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అటు పాతతరం వారిని, ఇటు యువజనులనూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

శేరిలింగంపల్లి.. ఒకప్పటి కంచుకోట..

మియాపూర్‌: ఒకప్పుడు శేరిలింగంపల్లి టీడీపీకి కంచుకోట. హైటెక్‌ సిటీ కారణంగా ఈ నియోజకవర్గం ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది. ఈ అభివృద్ధి అంతా తమ నేత చంద్రబాబు చేసేందేనని, ఆయన వల్లే హైదరాబాద్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని ఆ పార్టీ నేతలు పలుమా ర్లు చెబుతుంటారు. నియోజకవర్గంలో ఒకప్పుడు ఉన్న బలమై న పట్టును ఈ పార్టీ కోల్పోయింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్‌గౌడ్‌పై టీడీపీ అభ్యర్థి గాంధీ 79,800 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలో దిగిన ఆనంద్‌ప్రసాద్‌ 40 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అంతకు ముందు 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పది డివిజన్లలో పోటీ చేసిన అభ్యర్థులంతా టీఆర్‌ఎస్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ ఫలితంతో నియోజకవర్గంలో తెలుగుదేశం కేడర్‌ చతికిలపడింది. అనంతరం కీలక నాయకుడు మొవ్వా సత్యనారాయణ బీజేపీలో చేరడంతో టీడీపీకి నాయకత్వలోపం ఎదురైంది. ప్రస్తుత గ్రేటర్‌ ఎన్నికల్లోనూ టీడీపీ పది మంది అభ్యర్థులను బరిలో దింపింది. వారి గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా.. టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల విజయావకాశాలపై మాత్రం కచ్చితంగా ప్రభావం చూపిస్తారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

సెటిలర్ల ఓట్లపై ఆశలు..  

బేగంపేట: సనత్‌నగర్‌ నియోజకవర్గంలో ఐదు డివిజన్ల లో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సనత్‌నగర్‌, అమీర్‌పేట డివిజన్లలో అధికంగా సెటిలర్లు ఉండటంతో టీడీపీ ఈ ప్రాంతాలపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. కానూరి జయశ్రీ, వరలక్ష్మిలు ఈ డివిజన్లలో బరిలో ఉన్నారు. బేగంపేటలో ఫరానాబేగం, రాంగోపాల్‌పేట నుంచి రేఖారాజు పోటీలో ఉన్నారు. ఎస్సీ రిజర్వుడు స్థానమైన బన్సీలాల్‌పేట నుంచి టీడీపీ సీనియర్‌ మహిళా నేత హేమలత పోటీ చేస్తున్నారు. 

ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని బంజారాహిల్స్‌లో సుజాత, వెంకటేశ్వర కాలనీలో స్వప్న, జూబ్లీహిల్స్‌లో సనీమా, ఖైరతాబాద్‌లో చంద్రమణిలు పోటీలో ఉన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని వెంగళరావునగర్‌లో విజయశ్రీ, యూసు్‌ఫగూడలో రమేష్‌, బోరబండలో అరుణ్‌ రాజ్‌లు పోటీ చేస్తున్నారు.

తిరిగి పట్టు  సాధించాలని..

సికింద్రాబాద్‌: ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మునిసిపల్‌ డివిజన్లను తిరిగి సొంతం చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఈ ప్రాంతాల్లో 2014 వరకూ తెలుగుదేశం పార్టీ పరిస్థితి మెరుగ్గానే ఉండేది. ఆ తర్వాత కీలక కేడర్‌ కొంతవరకు పార్టీని వీడటంతో కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుత గ్రేటర్‌ వార్‌లో అన్ని డివిజన్లలోనూ అభ్యర్థులను పోటీకి దించింది. సికింద్రాబాద్‌ సెగ్మెంట్‌లోని అడ్డగుట్ల డివిజన్‌ నుంచి లక్ష్మీప్రసన్న, మెట్టుగూడ డివిజన్‌ నుంచి మంజుల, సీతాఫల్‌మండి డివిజన్‌ నుంచి జి.విజయలక్ష్మి, బౌద్ధనగర్‌ డివిజన్‌ నుంచి ఎన్‌. విజయలక్ష్మి బరిలో ఉన్నారు. కంటోన్మెంట్‌ పరిధిలో ఏకైక డివిజన్‌ మోండా మార్కెట్‌ నుంచి బాలబోయిన సాయిరాణి యాదవ్‌ పోటీ చేస్తున్నారు.

జోరుగా ప్రచారం.. 

ముషీరాబాద్‌, అంబర్‌పేట నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో టీడీపీకి పట్టున్న రాంనగర్‌ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌ పలుస బాల్‌రాజ్‌గౌడ్‌ తాజాగా మరోసారి బరిలో నిలిచారు. అడిక్‌మెట్‌లో  ఎం.కే. చిత్ర, బోలక్‌పూర్‌లో జహీరుద్దీన్‌ సమద్‌, కవాడిగూడలో సీనియర్‌ నాయకుడు ఎన్‌.యాదగిరిరావు సతీమణి శోభారాణి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో నల్లకుంట, బాగ్‌ అంబర్‌పేట, గోల్నాక, కాచిగూడ, అంబర్‌పేట డివిజన్లలోనూ టీడీపీ అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. నియోజకవర్గ ఇన్‌చార్జి బిల్డర్‌ ప్రవీణ్‌ ఆధ్వర్యంలో ఐదు డివిజన్లలోనూ టికెట్లు ఇచ్చారు. కనీసం రెండు డివిజన్లలోనైనా గెలవాలనే పట్టుదల అభ్యర్థుల్లో కనిపిస్తోంది. గోషామహల్‌ నియోజకవర్గంలోని జామ్‌ బాగ్‌, గన్‌ఫౌండ్రీ, బేగంబజార్‌, మంగళ్‌హాట్‌, గోషామహల్‌ డివిజన్లలో టీడీపీ పోటీ చేస్తోంది. పార్టీని వీడకుండా సేవలందిస్తున్న వారికి ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించారు. కుత్బుల్లాపూర్‌లో చింతల్‌, రంగారెడ్డి, సూరారం, సుభాష్‌నగర్‌, కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ల నుంచి ఐదుగురు అభ్యర్థుల్ని టీడీపీ బరిలోకి దించింది. సూరారం అభ్యర్థి మచ్చ ప్రభుదాస్‌ అనూహ్యంగా నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో నలుగురే పోటీలో ఉన్నారు. సుభా్‌షనగర్‌, కుత్బుల్లాపూర్‌ డివిజన్ల నుంచి మద్దూరి సాయి తులసి, అట్లూరి పావని పోటీ చేస్తున్నారు.


ఆధిక్యం కోసం పోరు..

ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి 2009లో బాధ్యతలు నిర్వర్తించిన ఎస్‌వీ కృష్ణప్రసాద్‌ను తిరిగి అదే హోదాలో టీడీపీ నియమించింది. ఇక్కడ 11 డివిజన్లలోనూ అభ్యర్థుల్ని నిలిపింది. ఉప్పల్‌ నియోజకవర్గంలోని కాప్రాలో మునిగడప శ్రీరాములు, ఏస్‌రావునగర్‌లో దూడల సాంబమూర్తి గౌడ్‌ సతీమణి నిర్మల, చర్లపల్లిలో రుద్రగోని రాంచందర్‌ గౌడ్‌, హెచ్‌బీ కాలనీలో ఆర్‌వీ శ్రీనివాస్‌, మల్లాపూర్‌లో సూర్నం రాజేశ్వర్‌, చిలుకానగర్‌లో పబ్బతి వినోదా శేఖర్‌రెడ్డి, రామంతాపూర్‌లో కొండ్రపల్లి మాధవి పోటీ చేస్తున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని మచ్చబొల్లారంలో సర్వే నరేష్‌, అల్వాల్‌లో లావణ్య, వెంకటాపురంలో శ్రీనివాస్‌, నేరెడ్‌మెట్‌లో మమత, మౌలాలిలో బత్తిని పద్మా నర్సింహాగౌడ్‌, ఆనంద్‌బాగ్‌లో కరణం గోపీ, గౌతంనగర్‌లో చింతల అంజమ్మ పోటీ చేస్తున్నారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని అత్తాపూర్‌ డివిజన్‌లో మాధవి బాలరాజ్‌, రాజేంద్రనగర్‌లో నాగులపల్లి రోజా బరిలో ఉన్నారు. 

కంచుకోట

కూకట్‌పల్లి 

కూకట్‌పల్లి, నవంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి నియోజకవర్గం కూడా గతంలో టీడీపీకి కంచుకోట. కార్యకర్తల బలం, ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ నాయకత్వ లేమి కారణంగా బలహీనపడింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి మాధవరం కృష్ణారావు విజయం సాధించారు. ఏడాది తర్వాత ఆయన టీఆర్‌ఎ్‌సలో చేరారు. 2016 ఎన్నికల్లో ఒకే కార్పొరేటర్‌ స్థానం దక్కింది. అయితే, 2018లో టీడీపీ తరఫున నందమూరి సుహాసిని తెరపైకి వచ్చారు. ఆమె 70 వేలకు పైగా ఓట్లు సాధించారు. తాజా గ్రేటర్‌ ఎన్నికల్లో 8 డివిజన్లలో బలమైన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 

నేరచరిత్రలేని అభ్యర్థులు.. 

గ్రేటర్‌ ఎన్నికల్లో గౌరవ ప్రదమైన స్థానాలు దక్కించుకోవాలనే లక్ష్యంతో టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నేర చరిత్ర లేని వారికి టికెట్లు ఇచ్చింది. మొత్తం 106 డివిజన్లలో ఎలాంటి నేర చరిత్ర, కేసులు లేని వారిని ఎంపిక చేసింది. అలాగే, బీసీలు.. నిమ్నకులాల వారికి 85 శాతం సీట్లు కేటాయించింది. అలాగే, సగానికిపైగా మహిళలకు టికెట్లు ఇచ్చింది. 25 డివిజన్లలో గెలుస్తాం

మరో 20 డివిజన్లల్లో రెండోస్థానంలో.. 

50 డివిజన్లలో త్రిముఖ పోటీలో ఉంటాం

టీడీపీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ పిన్నమనేని సాయిబాబా 

రాంనగర్‌, నవంబర్‌ 27(ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీ 106 డివిజన్లలో పోటీ చేస్తోందని, విజయమే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారని టీడీపీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ పిన్నమనేని సాయిబాబా తెలిపారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో 38, హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో 44 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో 25 డివిజన్లలో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని, మరో 25 డివిజన్లలో రెండో స్థానంలో, 50 డివిజన్లలో మూడో స్థానంలో ఉంటుందన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, అంబర్‌పేట, ముషీరాబాద్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌తోపాటు శివారు ప్రాంతాలలోని నియోజకవర్గాలలో టీడీపీ ప్రభావం అధికంగా ఉందన్నారు. పార్టీ ని నమ్ముకున్న వారికి ఈ ఎన్నికల్లో టికెట్‌లు ఇచ్చామని, దీంతో వారు రెట్టింపు ఉత్సాహంలో పోటీలోకి దిగారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయంలో నారా చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ, ప్రజలను ఓట్లు అడుతున్నామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీకి ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన ఉందన్నారు. తొలిసారి గ్రేటర్‌లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని, దీంతో గ్రేటర్‌లో సత్తా చాటుతామని  తెలిపారు. ప్రజలందరూ టీడీపీకి ఓట్లు వేసి, తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సాయిబాబా కోరారు.  

ప్రచారంలో మిషన్‌ కుడుతున్న బేగంపేట టీడీపీ అభ్యర్థి ఫరానా బేగం


Advertisement
Advertisement