వ్యవసాయం దండగని బాబు ఎప్పుడన్నారు..?

ABN , First Publish Date - 2020-12-01T09:11:48+05:30 IST

వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై విపక్ష టీడీపీ విరుచుకుపడింది.

వ్యవసాయం దండగని బాబు ఎప్పుడన్నారు..?

నిరూపిస్తే మేమంతా రాజీనామా చేస్తాం లేదంటే మీరు చేస్తారా?

మంత్రి బొత్సపై టీడీపీ ఎదురుదాడి


అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై విపక్ష టీడీపీ విరుచుకుపడింది. చంద్రబాబు ఆ మాట ఎప్పుడన్నారో రుజువు చేస్తే తామంతా రాజీనామా చేస్తామని.. రుజువు చేయలేకపోతే బొత్స మంత్రి పదవికి రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్సీలు సవాల్‌ విసిరారు. మండలిలో పంట నష్టంపై చర్చకు టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ దానిని తిరస్కరించారు. స్వల్పకాలిక చర్చ అయినా చేపట్టాలని టీడీపీ కోరింది. మంత్రి బొత్స మాట్లాడుతూ.. సంబంధిత శాఖల మంత్రులు, అధికారులు అసెంబ్లీలో ఉన్నారని.. మంగళవారం చర్చ చేపట్టాలని చెప్పారు. మండలి బీఏసీ సమావేశంలో తుఫాను, వరదలు, అధిక వర్షాలపై చర్చకు అందరూ అంగీకరించారని.. చర్చ జరిపి తీరాల్సిందేని.. యనమల సూచించారు. దాంతో చైర్మన్‌ స్వల్పకాలిక చర్చ చేపట్టారు.


ఈ నేపథ్యంలోనే వ్యవసాయమే దండగని చంద్రబాబు అన్నారని బొత్స ఆరోపించారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్‌ మండిపడ్డారు. ఎప్పుడు, ఎక్కడ అన్నారో నిరూపించాలని.. లేదంటే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడడం సభ్యత కాదన్నారు. బొత్స తాను చేసిన వ్యాఖ్యలను నిరూపిస్తే సభలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీలందరం రాజీనామాకు సిద్ధమని.. రుజువు చేయలేకపోతే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. అయితే తామే శానసమండలి రద్దుకు సిఫారసు చేశామని.. ఇంక మీరేంటి రాజీనామా చేసేదని బొత్స అన్నారు. ‘మనసులో మాట’ పుస్తకం తెస్తే చంద్రబాబు వ్యవసాయం గురించి ఏమి మాట్లాడారో నిరూపిస్తానని చెప్పారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు వెల్‌లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. బొత్స రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్‌ కోపంతో ఊగిపోయారు. చంద్రబాబు రాసుకున్న మనసులో మాట అన్న దిక్కుమాలిన పుస్తకం తమ వద్దలేదని, టీడీపీ సభ్యుల వద్ద ఉంటే తీసుకొచ్చి చూపించాలన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఆయన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.


మంత్రిగా ఉండి.. అయ్యప్ప దీక్షలో ఉన్న వ్యక్తి మండలిలో అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని టీడీపీ సభ్యులు అన్నారు. మండలి వైస్‌చైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం కలగజేసుకుని అన్‌పార్లమెంటరీ మాటలు సభలో వాడవద్దని మంత్రికి హితవు పలికా రు. ఆ పుస్తకం ఇంట్లో ఉంటే లోకేశ్‌ తీసుకొస్తే చంద్రబాబు అన్న మాటలు చూపిస్తామని బుగ్గన అన్నారు. ఇలా పరస్పర విమర్శలతో సభ హోరెత్తింది. దాంతో చైర్మన్‌ సభను కాసేపు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సభ ఎంతకూ నియంత్రణలోకి రాకపోవడంతో వైస్‌చైర్మన్‌ మంగళవారానికి వాయిదా వేశారు.

Updated Date - 2020-12-01T09:11:48+05:30 IST