వైసీపీ ముస్లీం ఎమ్మెల్యేలు దద్దమ్మలు

ABN , First Publish Date - 2020-12-04T05:59:19+05:30 IST

ముస్లీం, ఎస్సీ సామాజిక వర్గాలపై దాడులు జరుగుతున్నా వారి ఓట్లతో గెలిచిన వారు ప్రశ్నించకుండా దద్దమ్మల్లా తయారయ్యారంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్‌ నసీర్‌ ధ్వజమెత్తారు.

వైసీపీ ముస్లీం ఎమ్మెల్యేలు దద్దమ్మలు
ముస్తఫా కార్యాలయం ముట్టడికి ర్యాలీగా వెళ్తున్న టీడీపీ, ఇతర కుల సంఘాల నేతలు

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్‌ నసీర్‌ 

ఛలో అసెంబ్లీ భగ్నంతో ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి యత్నం

గుంటూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ముస్లీం, ఎస్సీ సామాజిక వర్గాలపై దాడులు జరుగుతున్నా వారి ఓట్లతో గెలిచిన వారు ప్రశ్నించకుండా దద్దమ్మల్లా తయారయ్యారంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్‌ నసీర్‌ ధ్వజమెత్తారు. అబ్దుల్‌ సలాం న్యాయపోరాట సమితి గురువారం చలో అసెంబ్లీకి పిలుపుతో పోలీసులు టీడీపీ నేతలను బుధవారం రాత్రే గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తాఫా కార్యాలయాన్ని ముట్టడించాలని నసీర్‌ పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ నాయకులు మాయాబజార్‌ సెంటర్‌ నుంచి ఎమ్మెల్యే కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తుండగా అనుమతి లేదని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో పోలీసులు టీడీపీ నాయకులు నసీర్‌, చిట్టాబత్తిని చిట్టిబాబు, గోళ్ల అరుణ్‌ కుమార్‌ తదితరులను బలవంతంగా వాహనాల్లో లాలాపేట స్టేషన్‌కు తరలించారు. అనంతరం నసీర్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో నేను ఉన్నాను.. నేను వింటాను.. అన్న జగన్‌ మైనార్టీ, ఎస్సీలపై దాడులు జరుగుతున్నా ప్రస్తుతం స్పందించటం లేదన్నారు. సీఎం మోచేతి నీళ్లు తాగుతూ మైనార్టీ ఎమ్మెల్యేలు ముస్లీంలకు ద్రోహం చేస్తున్నారని తెలిపారు.  

ఇంత భయపడాలా?: ఎండీ హిదాయత్‌

ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడుతున్న ప్రభుత్వాన్ని మొదటి సారి చూస్తున్నానని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎండీ హిదాయత్‌ అన్నారు. చలో అసెంబ్లీకి బయదేరిన ఆయనను  తూర్పు డీఎస్పీ అడ్డుకుని కొత్తపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.    

చలో అసెంబ్లీ భగ్నం

గుంటూరు: సలాం కుటుంబం ఆత్మహత్య  కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ చలో అసెంబ్లీకి మైనార్టీ సంఘాలు ఇచ్చిన పిలుపును పోలీసులు భగ్నం చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మద్దతు పలకడంతో బుధవారం రాత్రి నుంచే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలువురు మైనార్టీ నాయకులు, టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. గురువారం అన్ని రహదారులపై పోలీసులు మోహరించి తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులు చర్యలు తీసుకున్నారు. ముఖ్య కూడళ్లలో అర్భన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి, అడిషనల్‌ ఎస్పీ గంగాధరం  సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  


Updated Date - 2020-12-04T05:59:19+05:30 IST