వెలిగొండ పోరు ఉధృతం

ABN , First Publish Date - 2021-08-14T06:48:40+05:30 IST

వెలిగొండను కేంద్ర గెజిట్‌లో చేర్చడం, నికరజలాలు సాధించడంపై పోరు ఉధృతమైంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం పలికింది.

వెలిగొండ పోరు ఉధృతం
మార్కాపురంలోని దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

ఢిల్లీ పెద్దల్ని కలుస్తాం.. కదిలిస్తాం

నికర జలాల సాధనే లక్ష్యంగా పోరుబాట 

ముగిసిన టీడీపీ ఐదు రోజుల తొలిదశ దీక్షల కార్యక్రమం 

పార్టీ రహితంగా ప్రజానీకం మద్దతు

చివరిరోజు పాల్గొన్న జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలు 

ఫలించని వైసీపీ ప్రాంతీయ విద్వేషాల కుట్ర

సాగర్‌ జలాల కేటాయింపులో జిల్లాకు జరగబోతున్న అన్యాయాన్ని నివారించేందుకు ఆరంభించిన పోరుబాటను తుది వరకూ కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. గత ఐదురోజులుగా మార్కాపురంలో జరుగుతున్న వెలిగొండ దీక్షా శిబిరం ముగింపు సందర్భంగా జిల్లాలోని టీడీపీ ముఖ్యనేతలు హాజరై దశలవారీ కార్యాచరణ కు సిద్ధమైనట్లు ప్రకటించారు. తదుపరి చర్యగా కేంద్రప్రభుత్వ పెద్దలను కలిసి వారిని కదిలించే విధంగా ప్రయత్నించాలని తీర్మానించుకున్నారు. ఆపై పాదయాత్రలు, గ్రూపు సమావేశాలు లాంటి కార్యక్రమాలతో ప్రజలను సన్నద్ధం చేసి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవాలనుకుంటున్నారు.  ముఖ్యంగా వెలిగొండ ప్రాజెక్టుకి పొంచి ఉన్న ముప్పుని ఎలుగెత్తి చాటుతూ గత 25 రోజులుగా టీడీపీ నాయకులు చేపట్టిన కార్యక్రమాలకు ప్రజల నుంచి వచ్చిన స్పందనతో వారు పోరును ఉధృతంచేయాలని నిర్ణయించారు. జిల్లాలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలతోపాటు పశ్చిమ ప్రాంత నాయకులంతా ఐక్యంగా భవిష్యత్తు ఆందోళనకు సన్నద్ధమవుతున్నట్లు  శపథం చేశారు.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

వెలిగొండను కేంద్ర గెజిట్‌లో చేర్చడం, నికరజలాలు సాధించడంపై పోరు ఉధృతమైంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం పలికింది. దానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సాగు జలాల వినియోగంపై ఆంధ్ర, తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వచ్చిన వివాదం, ఆపై రాయలసీమ ప్రాంతం కోసం అంటూ రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం లాంటి కార్యక్రమాలతో జిల్లాకు సాగర్‌జలాల రాక ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, డీబీవీఎస్‌ స్వామిలు ముఖ్యమంత్రికి లేఖరాయటం, ఆ విషయమై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగటం తెలిసిందే. అనంతరం కేంద్రప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు పేరు లేకపోవటం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్టుకి నికర జలాలనే కేటాయించాలని, సాగర్‌ కుడికాలువలో భాగంగా జిల్లాలో ఉన్న ఆయకట్టుకి, తాగునీటి అవసరాలకు పూర్తిస్థాయిలో నీరివ్వాలని టీడీపీ ప్రజా ఉద్యమానికి సిద్ధమైంది. ఆమేరకు ఇటీవల ఒంగోలులో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 


మార్కాపురం దీక్షకు మంచి స్పందన

తొలి విడతగా మార్కాపురంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గత ఐదు రోజుల నుంచి అక్కడ దీక్షా కార్యక్రమాలు జరిగాయి. రోజువారీ దీక్షలో పాల్గొనే పార్టీ శ్రేణులతోపాటు రోజుకొక ముఖ్య నాయకుడు వచ్చి మద్దతు ప్రకటించారు. అయితే ఈ దీక్షల కార్యక్రమానికి పార్టీరహితంగా సామాన్య ప్రజల నుంచి మద్దతు లభించటం విశేషం. వివిధరకాల రాజకీయ అభిప్రాయాలు ఉన్న సాధారణ  ప్రజలలో పలువురు టీడీపీ నాయకులను నేరుగా కలవటం, లేక ఫోన్‌ల ద్వారా సంపూర ్ణ మద్ధతుని తెలియజేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో జిల్లాకు ముఖ్యంగా వెలిగొండ ప్రాజెక్టుకి తీరని అన్యాయం జరగబోతోంది కదా అంటూ ప్రజలు ప్రశ్నించారు. అంతేగాక జిల్లా ఏర్పాటు లక్ష్యమైన పశ్చిమ ప్రాంతానికి సాగర్‌ జలాల మళ్లింపు విషయంలో ఎలాంటి అన్యాయం జరిగినా తమ మద్దతు ఉంటుందంటూ ఆయా వర్గాలకు చెందిన ప్రముఖులు సైతం వీరికి సంఘీభావం తెలిపారు. 


నేతల సంఘీభావ వెల్లువ

ఈ నేపథ్యంలో తొలిదశ ఆందోళన ముగింపు కార్యక్రమంగా శుక్రవారం సాయంత్రం జరిగిన సభలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరుకి చెందిన మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో పాటు అద్దంకి, పర్చూరు ఎమ్మెల్యేలు రవికుమార్‌, సాంబశివరావు, కార్యక్రమ నిర్వాహకులు కందుల నారాయణ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు డాక్టరు ఉగ్రనరసింహారెడ్డి (కనిగిరి), ఎం. అశోక్‌రెడ్డి (గిద్దలూరు), ఎరిక్షన్‌బాబు (వైపాలెం)తో పాటు సంతనూతల పాడుకి చెందిన బీయన్‌ విజయకుమార్‌, ఇంకా పలువురు ఆయా అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆలపాటితో పాటు ఎమ్మెల్యేలు, ఇతర నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మాట్లాడుతూ జిల్లాకు నికర జలాల సాధనే లక్ష్యంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. తదుపరిగా కేంద్ర వనరుల శాఖామంత్రితో పాటు ఇతర ప్రముఖులను కలిసి కేంద్ర గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టుని చేర్చేలా వత్తిడి చేయనున్నట్లు తెలిపారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కూడా కలిసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు. 


పాదయాత్రలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు

వెలిగొండ ప్రాజెక్టుపై జిల్లాలో ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడిని పెంచే విధంగా ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో పాదయాత్రలు, ఆయా ప్రాంతాల వారీ ప్రజాచైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయాలను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యనాయకులు ప్రకటించారు. అంతేగాక అటు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఇటు ఎమ్మెల్యేలు రవికుమార్‌, సాంబశివరావు, ఇతర పశ్చిమప్రాంత నాయకులు మాట్లాడుతూ జిల్లాకు పొంచి ఉన్న ప్రమాదంపై మంత్రులు కనీస అవగాహన లేకుండా వ్యవహరించటం శోచనీయమని వ్యాఖ్యానించారు. పైగా రాయలసీమ, కోస్తాంధ్ర మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నానికి వైసీపీ శ్రీకారం పలికిందని ఆరోపించారు. ఆ ప్రయత్నాలను రెండు ప్రాంతాల్లోని ప్రజలు నిజానిజాలు గ్రహించి తోసిపుచ్చారని తదనుగుణ ంగా రాష్ట్రప్రభుత్వ పెద్దలు ఆ విషయంలో మాట్లాడటం మానేశారని ఎద్దేవా చేశారు. నికర జలాలను వెలిగొండ ప్రాజెక్టుకి, అలాగే సాగర్‌ కుడికాలువ ద్వారా కేటాయించిన మొత్తంలో నీటిని పొందేవరకు రాజీ లేని పోరు సాగిస్తామని ప్రకటించారు.



Updated Date - 2021-08-14T06:48:40+05:30 IST