రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులకు భంగం!

ABN , First Publish Date - 2021-04-15T10:08:41+05:30 IST

మహా మేధావి డాక్టర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులకు రాష్ట్రంలో భంగం కలుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం

రాష్ట్రంలో రాజ్యాంగ  హక్కులకు భంగం!

నాడు ఇందిర, రాజీవ్‌లతో హుందాగా పోరాడా

ఇది చిల్లర పోరాటం

పోలీసుల సాక్షిగానే రాళ్లవర్షం కానీ వారికి కనపడలేదట!

తిరుపతి ప్రచారం నా కోసం కాదు

పదవులు, అధికారం కొత్తా కాదు

మళ్లీ నేనే వచ్చి ఉంటే.. పరిశ్రమలు, ఉద్యోగాలొచ్చేవి

రాజధాని కూడా ఏర్పడేది

జగన్‌ దొంగమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు

22 మంది ఎంపీలున్నా హోదా కోసం పోరాడరేం?

జైలుకెళ్తానని భయమా?

అరాచకాలను అడ్డుకోవాలంటే పనబాక లక్ష్మిని గెలిపించాలి

లేదంటే 30-40 ఏళ్లు వెనక్కి

సత్యవేడులో చంద్రబాబు హెచ్చరిక


తిరుపతిలో సోమవారం రాత్రి నా బహిరంగసభలో పోలీసుల సాక్షిగా కురిసిన రాళ్ల వర్షం తమకు కనబడలేదని పోలీసులే అంటున్నారు. వారి తీరు.. దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేస్తే దొంగను పట్టివ్వాలని బాధితుడినే అడిగిన చందంగా ఉంది.


నా ఆరాటం అధికారం కోసం కాదు. ఓ సీనియర్‌ నేతగా, అనుభవం కలిగిన నాయకుడిగా ఈ రాష్ట్రం ఏమైపోతుందన్నదే నా బాధ, ఆవేదన.


రెండేళ్ల పాలనలో రాష్ట్రానికి, ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేకే వైసీపీ బెదిరింపు రాజకీయాలకు దిగింది. 

   టీడీపీ అధినేత చంద్రబాబు


సత్యవేడు/గూడూరు రూరల్‌, ఏప్రిల్‌ 14: మహా మేధావి డాక్టర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులకు రాష్ట్రంలో భంగం కలుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి చిత్తూరు జిల్లా సత్యవేడు బహిరంగ సభలో, అంతకుముందు నెల్లూరు జిల్లా చిల్లకూరు సమీపంలో టీడీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వంటి వారితో హుందాగా పోరాడానని.. ఇప్పుడు రాష్ట్రంలో తన ముందున్నది చిల్లర పోరాటమన్నారు. ‘ప్రచారం చేస్తున్నది నా కోసం కాదు.. కేవలం రాష్ట్రం కోసమే. పదవులు, అధికారం నాకు కొత్త కాదు. రాష్ట్రానికి సీఎంగా నా రికార్డు ఎవ్వరూ చెరపలేరు. సమైక్యాంధ్రలో హైదరాబాదులో హైటెక్‌ సిటీ, ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎవరు కట్టించారని ఎవరిని అడిగినా నా పేరే చెబుతారు. 


నేను మళ్లీ అధికారంలోకి వచ్చుంటే పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చేవి. రాజధాని ఏర్పడి ఉండేది. అయితే జగన్‌ దొంగమాటలు చెప్పి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. 22 మంది ఎంపీలున్నా ప్రత్యేక హోదా కోసం పోరాడడం లేదు. కేంద్రంపై పోరాడితే జైలుకు వెళ్తామన్న భయం జగన్‌ను వెంటాడుతోంది. టీడీపీ ఎంపీలు ముగ్గురూ మూడు సింహాలు. పనబాక లక్ష్మిని గెలిపిస్తే నాలుగో సింహం జతవుతుంది. రాష్ట్రం కోసం చేసే పోరాటం బలోపేతమవుతుంది’ అని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..


ఇలాంటి పని ఎవరైనా చేస్తారా?

కరోనా సమయంలో అన్నింటినీ మూసివేయించిన జగన్‌ ప్రభుత్వం మద్యం దుకాణాలు మాత్రం తెరిపించింది. వాటికి టీచర్లను కాపలా పెట్టిన మహానుభావుడు జగన్‌. గురువులతో ఎవరైనా ఇలాంటి పనులు చేయిస్తారా? నేను రూ.2 వేలు పెన్షన్‌ ఇస్తే ఇప్పుడు ముష్టి రూ. 250 పెంచి అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారు. ఉద్యోగాల్లేవు.. పనుల్లేవు.. అన్ని ధరలూ పెరగడంతో పాటు పన్నుల బాదుడు కూడా మొదలైంది. టీటీడీలో ఎన్నో అపచారాలు జరిగాయి. లడ్డూ సైజు తగ్గించి ధర పెంచేశారు. ఎన్నికల్లో లడ్డూలు పంపిణీ చేశారు. టీటీడీ భూములు అమ్మేయడానికి సైతం ప్రయత్నించారు. కోర్టు జోక్యంతో ఆపేశారు. వెంకటేశ్వరస్వామి వద్ద పనిచేసిన వ్యక్తి మరో మతస్తుడిని సాక్షాత్తూ మహావిష్ణువంటే హిందువుల మనోభావాలు ఎంత దెబ్బతింటాయో ఆలోచించాలి. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ సభలకు వస్తున్న జనాన్ని చూసి వైసీపీ నేతలకు భయం పుట్టుకొస్తోంది.


అందువల్ల డబ్బుతో గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఓటుకు ఐదు వేలు ఇస్తారు. రేపో ఎల్లుండో పుంగనూరు నుంచి పుడింగులు వస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచీ మోసగాళ్లు వస్తారు. పోలీసులే వారికి స్వాగతం పలుకుతారు. టీడీపీ వారి దగ్గర డబ్బు లేకపోయినా నియోజకవర్గంలో ఉండడానికి వీల్లేదని హెచ్చరికలు జారీ చేస్తారు. భయపడితే భయమే మనల్ని చంపేస్తుంది. రాష్ట్రంలో అరాచకాలను అడ్డుకోవడానికి తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలి. లేదంటే రాష్ట్రం మరో 30-40 ఏళ్లు వెనక్కిపోతుంది.  ఎక్కడైనా వైసీపీ వాళ్లు డబ్బులు పంచితే ఆధారాలతో నిరూపించి దోషులుగా నిలబెట్టాలి. మీ ప్రాణాలకు నా ప్రాణాన్ని అడ్డుగా పెడతా.. అధైర్యపడకుండా పోరాడాలి.


బాబు సభకు కరెంటు కట్‌!

చంద్రబాబు నెల్లూరు జిల్లా నుంచి సత్యవేడులో ప్రచారానికి బుధవారం సాయంత్రం 6.20 గంటలకు చేరుకున్నారు. ఆయన వాహనంపైకి చేరుకుని ప్రసంగానికి ఉపక్రమించే సమయంలో విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. పది నిమిషాలకు పైనే గడచినా కరెంటు పునరుద్ధరణ జరగలేదు. తిరుపతిలో తన సభపై రాళ్ల దాడి జరిగితే.. సత్యవేడు సభలో విద్యుత్‌ సరఫరా కట్‌ చేశారని చంద్రబాబు మండిపడ్డారు.


నాలో పొరపాటో.. మీలో పొరపాటో..

కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రను అన్నివిధాలా అభివృద్ధిచేయాలని రాత్రింబవళ్లు ఆలోచించి సంక్షేమ, అభివృద్ధిపనులు చేపట్టాను. నాలో పొరపాటో.. మీలో (కార్యకర్తల్లో) పొరపాటో గాని.. చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయి ఉండేది కాదు. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీని ప్రక్షాళన చేస్తా. పార్టీ కోసం శక్తివంచన లేకుండా కష్టపడి పనిచేసేవారిని వెతికిమరీ తీసుకొచ్చి ప్రాధాన్యం కల్పిస్తా.

Updated Date - 2021-04-15T10:08:41+05:30 IST