రోడ్డెక్కి పోరాడతా!

ABN , First Publish Date - 2020-11-25T09:22:01+05:30 IST

టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను పేదలకు అప్పగించడంలో ఆలస్యం చేస్తే తానే వచ్చి నిలబడతానని... పేదలను వెంటపెట్టుకుని రోడ్డెక్కి పోరాడతానని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఒక్కొక్కరికీ రూ.10 లక్షల విలువైన ఆస్తిని ఇంటి రూపంలో టీడీపీ ప్రభుత్వం సమకూర్చి పెడితే.. వాటిని పేదలకు అందకుండా

రోడ్డెక్కి పోరాడతా!

పేదల ఇళ్ల కోసం..

దిక్కుమాలిన చర్యలను ప్రతిఘటిస్తాం

జనం తిరగబడితే రాష్ట్రం రావణకాష్ఠమే!

పనికిమాలిన ఆలోచనలు మానుకోండి

అసంపూర్తి పనులు పూర్తి చేసి ఇళ్లు ఇవ్వండి

అన్ని వర్గాల్లో జగన్‌ సర్కారుపై వ్యతిరేకత

ఓటమి భయంతోనే స్థానికంపై వెనక్కి

అరాచకాలు చేసేవాళ్లు రేపు తప్పించుకోలేరు

ప్రభుత్వం మారితే వారి గతేంటో చూసుకోండి

ఉన్మాద పాలనపై తెగించి పోరాడదాం

ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు

రూ.పదేసి లక్షల ఆస్తి సమకూర్చిపెట్టాం

అది పేదలకు అందకుండా వైసీపీ కుయుక్తులు


అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను పేదలకు అప్పగించడంలో ఆలస్యం చేస్తే తానే వచ్చి నిలబడతానని... పేదలను వెంటపెట్టుకుని రోడ్డెక్కి పోరాడతానని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత  చంద్రబాబు ప్రకటించారు. ఒక్కొక్కరికీ రూ.10 లక్షల విలువైన ఆస్తిని ఇంటి రూపంలో టీడీపీ ప్రభుత్వం సమకూర్చి పెడితే.. వాటిని పేదలకు అందకుండా చేయడానికి వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఇదే జరిగితే ప్రజలు తిరగబడి రాష్ట్రం రావణకాష్టం కాకమానదని హెచ్చరించారు. దిక్కుమాలిన చర్యలను ప్రతిఘటించి తీరతామన్నారు. మంగళవారం ఆయన టీడీపీ మండల స్థాయి నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పేదలకు ఒక ఆశగా ఏర్పడిన ఆ ఇళ్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం డ్రామాలాడుతోందని.. వారి నుంచి వాటిని లాక్కోవడానికి.. పనులు చేయకుండా వదిలివేయాలని ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ‘పనికిమాలిన ఆలోచనలు మాని.. అసంపూర్తి పనులు పూర్తి చేసి పేదలకు అప్పగించాలి.


కట్టిన ఇళ్లు లాటరీలో పొందిన లబ్ధిదారులకు స్వాధీనం చేయాలి. విస్తీర్ణం ఎంత ఉన్నా పేదల వద్ద వసూలు చేయకుండా అందరికీ ఉచితంగా ఇవ్వాలి. మిగిలిన లబ్ధిదారులకు కూడా ఇళ్లు కట్టించి ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఇల్లంటే పిచ్చుకల గూడు మాదిరిగా కాకుండా మంచి ఫ్లోరింగ్‌, వార్డ్‌ రోబ్‌, కిచెన్‌తో ఆధునికంగా ఇళ్లు నిర్మించామని.. అవి మురికి కూపాలుగా మిగిలిపోకుండా మౌలిక వసతులు అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. తన పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ప్రబలడంతో స్థానిక ఎన్నికలు పెట్టడానికి జగన్‌ ప్రభుత్వం భయపడుతోందని.. అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ మాత్రం అడ్డం పడుతోందని విమర్శించారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. బాధిత వర్గాలన్నీ ఏకమై ఓడిస్తారన్న భయంతోనే స్థానిక ఎన్నికల నిర్వహణకు వెనకాడుతున్నారు’ అని చెప్పారు.


‘ఇష్టానుసారం చెలరేగిపోతూ అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలు రేపు మనకు దొరకరా? ప్రభుత్వం మారితే తమ గతేమిటో ఈ దుర్మార్గులు, వాటికి వంత పాడుతున్న అధికారులు ఆలోచించుకోవాలి. వైసీపీ నేతల వేధింపులకు ప్రజలు తలవంచాల్సిన అవసరం లేదు. ఎదురు తిరిగి పోరాడాలి. తప్పుడు కేసులు, అక్రమ నిర్భంధాలు తప్ప అంతకు మించి ఏమీ చేయలేరు. ప్రజాగ్రహం ముందు మహా మహా నియంతలే కొట్టుకుపోయారు. ఎదురుతిరగడమే మన ఆయుధం కావాలి’ అని చెప్పారు. జగన్‌ ప్రభుత్వంలో ఉన్మాదం మితిమీరి పోయిందని.. తప్పులు దిద్దుకోవాల్సింది పోయి బూతులు తిట్టి కాలం దొర్లిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కోర్టులు ప్రతి రోజూ చెంప చెళ్లుమనిపిస్తున్నా తుడుచుకుని తిరుగుతున్నారు. కోర్టులపై కూడా ఉన్మాదం చూపిస్తున్నారు. కోర్టులు చిన్న వ్యాఖ్యలు చేసినందుకే గతంలో నీలం సంజీవరెడ్డి, నేదురుమల్లి వంటివారు పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు ప్రతి రోజూ చడామడా తిడుతున్నా జగన్‌రెడ్డికి పట్టడం లేదు’ అని తెలిపారు.


నవరత్నాల వల్ల పేదలకు కలిగిన లాభం కంటే ఏడాదిన్నరలో వేసిన భారాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ‘అమరావతి, పోలవరం, ప్రత్యేక హోదా సహా ప్రతిదానిలో వైసీపీ ప్రభుత్వం మోసానికి పాల్పడింది. బడుగు బలహీన వర్గాలను ఇష్టానుసారం అధికార పార్టీ నేతలు వేధిస్తుంటే చూస్తూ ఊరుకోం. ప్రజాక్షేత్రంలో జనాన్ని కదిలించి తగిన బుద్ధి చెబుతాం’ అని స్పష్టంచేశారు. ప్రతి వారం కనీసం ఒకట్రెండు అంశాలపై టీడీపీ ప్రజాందోళనలు జరపాలని, ఇసుక, మద్యం దోపిడీ, స్కీముల పేరుతో స్కాములను ప్రజల్లో బహిర్గతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా సూచించారు. విశాఖ నగరంలో ఏ రోజు ఎవరి ఇల్లు కూలగొడతారో.. ఎవరి భూమి లాక్కుంటారోనని జనం బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని, టీడీపీ హయాంలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు పొందిన వారి నుంచి వాటిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని భీమిలికి చెందిన పార్టీ నేత దాసరి శ్రీనివాస్‌ ఆరోపించారు. ఓదార్పు యాత్ర పేరుతో ఇంటింటికీ వెళ్లిన జగన్‌.. నంద్యాలలో సలాం కుటుంబం ఇంటికి వెళ్లకుండా గెస్ట్‌హౌ్‌సకు పిలిపించుకోవడం ఒక రకంగా బెదిరించడానికేనని చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన పార్టీ నేత నిజాముద్దీన్‌ విమర్శించారు.

Updated Date - 2020-11-25T09:22:01+05:30 IST