నవరత్నాలన్నీ నవమోసాలే!

ABN , First Publish Date - 2021-04-13T08:48:26+05:30 IST

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలన్నీ నవమోసాలేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.

నవరత్నాలన్నీ నవమోసాలే!

ఒక్క చాన్సంటూ వచ్చారు

రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారు

ఏమిటీ అరాచకం, మాఫియా?

బందిపోట్ల కంటే విచ్చలవిడి దోపిడీ

రాష్ట్రమంతటా పులివెందుల పంచాయితీ

చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు

కేంద్రాన్ని హోదా అడుగుతున్నారా?

మడమ తిప్పడంలో జగన్‌రెడ్డి ఎక్స్‌పర్ట్‌

వెంకటగిరి, తిరుపతిల్లో బాబు ధ్వజం


వెంకటగిరి/తిరుపతి, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలన్నీ నవమోసాలేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. జగన్‌ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు అవుతోందని, ఆయన చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. అవినీతి, రౌడీయిజం పెంచడంలో మాత్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారని ఎద్దేవాచేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టీడీపీ కార్యకర్తలతో జరిగిన భేటీలో, తిరుపతి కృష్ణాపురం ఠాణా కూడలిలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ఒక్క అవకాశమివ్వండంటూ ప్రజలను బతిమాలి అధికారంలోకి వచ్చిన జగన్‌.. రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏమిటీ అరాచకం, మాఫియా అని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు బందిపోట్ల కంటే విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.


పులివెందుల పంచాయతీలు రాష్ట్రమంతా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని, తాము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రౌడీయిజం, మాఫియాలతో కూడిన పాలనతో చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని జగన్‌కు సూచించారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ విఫలమైందని, తాను పోటుగాడినని, తనను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తానని గత ఎన్నికల్లో జగన్‌ ప్రచారం చేశారు. హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని యువతను నమ్మించారు. అధికారంలోకి వచ్చాక ఇపుడు కేంద్రాన్ని హోదా అడుగుతున్నారా? కేంద్రం మెడలు వంచారా? అదే మా పార్టీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీశారు’ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబమైనా ఆనందంగా ఉందా అని ప్రశ్నించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మద్యపాన నిషేధాన్ని జగన్‌ అమలు చేశారా? చేస్తారని మీరు నమ్ముతున్నారా అని ప్రజలను ప్రశ్నించారు. మడమ తిప్పడంలో జగన్‌రెడ్డి ఎక్స్‌పర్ట్‌ అని ఆరోపించారు. 


పవన్‌పై కోపంతో సినిమాకు అడ్డంకులు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కోపంతో వకీల్‌ సాబ్‌ సినిమా ప్రదర్శనకు అడ్డంకులు సృష్టించారు. టీడీపీ హయాంలో ఎవరు సినిమాలు తీసినా రేట్లు పెంచుకోవడానికి, షోలు పెంచుకోవడానికి సహకరించాం. నేనేమీ పవన్‌ను సపోర్టు చేయడం లేదు. ఎవరికి అన్యాయం జరిగినా ముందుకొచ్చి పోరాడతా. తనకు బెదిరింపులు వస్తున్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధానికి ఫిర్యాదు చేశారు. విశాఖలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రింటింగ్‌ ప్రె స్‌ షెడ్లు కూల్చివేశారు. నేను సీఎంగా ఉన్నపుడు అనుకుని వుంటే జగన్‌ పత్రిక షెడ్లు ఉండేవా?  


వివేకాను చంపిందెవరు?

వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. చిన్నాన్న హత్యకు గురైతే, ఎవరు చంపారని ఆయన కూతురే ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులకు శిక్ష పడేదాకా వదిలిపెట్టం.  తిరుమలలో అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి. పింక్‌ డైమండ్‌ నా ఇంట్లో ఉందని రమణదీక్షితులు దుష్ప్రచారం చేశారు. దానిపై రూ.200 కోట్లకు టీటీడీ పరువునష్టం దావా కూడా వేసింది. ఇప్పుడా కేసును వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను సీఎంగా ఉన్నప్పుడు చర్చిలు, మసీదులు, గుళ్లపై దాడులు జరగలేదు. ఇప్పుడు రాముడి విగ్రహం తల తీసేస్తే ఇంతవరకూ నిందితులను పట్టుకోలేదు. అడిగినందుకు నాపై మాత్రం కేసు పెట్టారు.’




ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ఏదీ?

మా హయాంలో కష్టకాలంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. వారి సర్వీసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాం. ఉద్యోగులకు డీఏలు సక్రమంగా చెల్లించాం. బదిలీలకు కౌన్సెలింగ్‌ పద్ధతి అమలు చేశాం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వడం లేదు. డీఏలూ చెల్లించడం లేదు. చివరికి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎత్తిపోయింది. ఆదాయం లేదు. సంపద సృష్టించడం లేదు. చివరకు ప్రభుత్వం అప్పు అడిగినా కూడా ఇచ్చేవారు లేరు. లక్షా యాభై వేల కోట్ల సంపదైన అమరావతిని నాశనం చేశారు. హైదరాబాద్‌కు దీటుగా రాజధాని నగరాన్ని కట్టాలని ప్రయత్నిస్తే విధ్వంసం చేశారు.

Updated Date - 2021-04-13T08:48:26+05:30 IST