సాయం పొందాలంటే.. వారం ముంపులో మునగాలా?

ABN , First Publish Date - 2020-10-21T08:10:31+05:30 IST

‘వారం రోజులపాటు ముంపులో మునిగి ఉంటేనే నిత్యావసర వస్తువులు ఇస్తారా.. లేకపోతే ఇవ్వరా? ఏమిటీ అసంబద్ధ నిర్ణయం? దేశంలో ఏ ప్రభుత్వమూ ఇటువంటి దిక్కుమాలిన

సాయం పొందాలంటే.. వారం ముంపులో మునగాలా?

ఏమిటీ అసంబద్ధ నిర్ణయం.. దిక్కుమాలిన నిబంధనలు ఏ సర్కారూ పెట్టలేదు

ఔదార్యం చూపకుండా షరతులా?.. ఇది మానవత్వం ఉన్న సర్కారేనా?

నష్టం అపారం.. 500 ఇచ్చి దులుపుకొంటారా?.. జగన్‌ గాల్లో ప్రదక్షిణ చేశారు

మంత్రులను బాధితులు నిలదీస్తున్నారు.. వరుస విపత్తులతో రైతులు విలవిల

ఇంత విఫల సర్కారును చరిత్రలో చూడలేదు: చంద్రబాబు 

సాయంపై ఏమిటీ అసంబద్ధ నిర్ణయం..  చంద్రబాబు ఫైర్‌


అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ‘వారం రోజులపాటు ముంపులో మునిగి ఉంటేనే నిత్యావసర వస్తువులు ఇస్తారా.. లేకపోతే ఇవ్వరా? ఏమిటీ అసంబద్ధ నిర్ణయం? దేశంలో ఏ ప్రభుత్వమూ ఇటువంటి దిక్కుమాలిన నిబంధనలు పెట్టలేదు. ముంపులో చిక్కుకున్న అవస్థలు పడుతున్న వారికి ఉదారంగా సాయం చేసే బదులు వంద షరతులు పెడతారా? ఇది మానవత్వం ఉన్న ప్రభుత్వమేనా’ అని మాజీ ముఖ్యమంత్రి, TDP chief Chandrababu మండిపడ్డారు. టీడీపీ నూతన కమిటీల్లో పదవులు పొందిన నేతలతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విపత్తు బాధితులను ఎలా ఆదుకోవాలో టీడీపీ ప్రభుత్వం చేసి చూపించిందని, హుద్‌హుద్‌, తితలీ తుఫాన్లు వచ్చినప్పుడు సత్వరం కదిలి బాధితులకు వీలైనంత సాయం అందించిందని చంద్రబాబు గుర్తుచేశారు. ‘ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి గాల్లో ప్రదక్షిణ చేసి చేతులు దులుపుకొన్నారు. బాధితులను మంత్రులు కూడా పట్టించుకోలేదు. అందుకే వారు ఎక్కడికైనా వెళ్తే బాధితులు నిలదీస్తున్నారు.


నష్టం అపారంగా ఉంటే రూ.500 ఇచ్చి  ప్రభుత్వం చేతులు దులుపుకోవడం దుర్మార్గం. ఇన్ని రోజులు మునిగితేనే సాయం ఇస్తామంటున్న ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నాం. వరుస విపత్తులతో పంటలు దెబ్బతిని రైతులు... జీవనోపాధి పోయి కూలీలు, చేతి వృత్తులవారు తీవ్రమైన నైరాశ్యంలో ఉన్నా ఈ సర్కారు పట్టించుకోవడం లేదు’ అని విమర్శించారు. ఇంత విఫల ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదన్నారు. కరోనా నియంత్రణ, వరద నీటి నిర్వహణ, బాధితులకు సాయం, రైతులను ఆదుకోవడం సహా ప్రతి అంశంలో ఘోరంగా విఫలమైందని చెప్పారు. ‘70 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టు పనులు అడుగు కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ప్రాజెక్టుల పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, ముస్లిం మైనారిటీలపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు.. దేవాలయాలపై దాడులు ఆగడం లేదు’ అని దుయ్యబట్టారు. 


నమ్మకాన్ని నిలుపుకొంటాం: తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని.. పార్టీకి పునర్‌వైభవం సాధించడానికి కృషి చేస్తామని టీడీపీ నేతలు ఈ సందర్భంగా అన్నారు. ఎర్రన్నాయుడిని మరిపించేలా పనిచేస్తానని, తనకు అప్పగించిన బాధ్యతను సవాల్‌గా తీసుకుని ముందుకెళ్తానని అచ్చెన్నాయుడు చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనకు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, ఎన్టీఆర్‌ నుంచి మొదలుకొని లోకేశ్‌ వంటి యువ నేతల వరకూ అందరితో కలిసి పనిచేయడం ఒక అరుదైన అవకాశమని కళావెంకట్రావు అన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే కొండబాబు, వర్ల రామయ్య, బుచ్చయ్యచౌదరి, అయ్యన్నపాత్రుడు తదితరులు మాట్లాడారు.

Updated Date - 2020-10-21T08:10:31+05:30 IST