మైన్స్‌కి భయపడని నేను.. వైసీపీ గులకరాళ్లకు భయపడతానా?: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-04-13T18:48:21+05:30 IST

నగరంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన... తిరుపతి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని, రెండేళ్ల వైసీపీ పాలనలో తట్ట మట్టి కూడా వేయలేదని విమర్శించారు.

మైన్స్‌కి భయపడని నేను.. వైసీపీ గులకరాళ్లకు భయపడతానా?: చంద్రబాబు

తిరుపతి: నగర అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అన్నారు. తమ పార్టీకి తిరుపతి కంచుకోట అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన... తిరుపతి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని, రెండేళ్ల వైసీపీ పాలనలో తట్ట మట్టి కూడా వేయలేదని విమర్శించారు. ‘‘హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌కు నమూనాగా ఇక్కడ పార్క్ నిర్మించాలని తలపోశాం. తెలుగు గంగ నీళ్లు మనమే తీసుకొచ్చాం. కొండపైకి నీళ్లు తీసుకెళ్లాం. కండలేరు ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ వేశాం. తిరుమల పవిత్రతను కాపాడాం. ఎన్టీఆర్‌తో పాటు నేను, పార్టీ నాయకులు.. ఎవరు తిరుపతి వచ్చినా... పవిత్ర భావంతో స్వామివారి దర్శనం చేసుకునే వాళ్లం. అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. అపచారానికి దూరంగా ఉన్నాం. విద్యాసంస్థలన్నీ టీడీపీ హయాంలో వచ్చినవే. మహిళా యూనివర్సిటీ నుంచి ఐఐటీ వరకు అన్నీ టీడీపీ తీసుకువచ్చినవే. అభివృద్ధి ఒక పంథా. దాన్ని సమర్థవంతంగా ప్రజల దగ్గరకు తీసుకు వెళ్లాలి. నవరత్నాలు కావవి.. నవ మోసాలు. వాటిపై నమ్మకం ఉంటే... ఈ రౌడీయిజం ఎందుకు? చేతకాని మనుషులు.. అలిపిరి ఘటనలో మైన్స్‌కు భయపడని నేను.. గులకరాళ్లకు భయపడతానా...?  నేను అనుకుంటే ఒక్కరూ బయటకు వచ్చేవాళ్లు కాదు. రౌడీల తోకలు కట్ చేస్తాం. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. వైసీపీ అరాచకాలతో తిరుపతి శోభ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది’’ అని వ్యాఖ్యానించారు.  


Updated Date - 2021-04-13T18:48:21+05:30 IST