అడుగడుగునా నిర్బంధం

ABN , First Publish Date - 2021-08-01T06:26:29+05:30 IST

కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్టుకు వెళ్లే దారులన్నింటినీ మూసివేశారు.

అడుగడుగునా నిర్బంధం
కొండపల్లి రిజర్వు ఫారెస్టు వద్ద పోలీసుల నిఘా

నిజనిర్ధారణ కమిటీ పర్యటన భగ్నం

టీడీపీ నేతల హౌస్‌ అరెస్టులు 

ఫారెస్టులో పోలీసుల నిఘా  

చంద్రబాబు రాకతో గొల్లపూడిలో ఉద్రిక్తం


కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్టుకు వెళ్లే దారులన్నింటినీ మూసివేశారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్టులు చేశారు. అక్రమ మైనింగ్‌పై నిజానిజాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమైన నిజనిర్ధారణ కమిటీ సభ్యుల పర్యటనను పోలీసులు నిర్బంధం ద్వారా భగ్నం చేశారు. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ శ్రేణుల దాడి, అనంతరం ఆయననే పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద నిర్బంధించి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన ఎమ్మెల్యే బావమరిది అక్రమ మైనింగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నియమించిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు శనివారం ఉదయం కొండపల్లి వెళ్లనున్నట్లు ప్రకటించారు. వారిని అడ్డుకునేందుకు శుక్రవారమే ముందస్తు హౌస్‌ అరెస్టులు చేసిన పోలీసులు శనివారం మరికొంతమందిని నిర్బంధించడం ద్వారా కార్యక్రమాన్ని భగ్నం చేశారు. మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు గొల్లపూడి రాకతో వైసీపీ దళిత నాయకులు వన్‌ సెంటరులో చేసిన హడావిడితో హైడ్రామా చోటుచేసుకుంది.


విజయవాడ, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ నాయకుల నిర్బంధంతో జిల్లావ్యాప్తంగా శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇటీవల కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లినప్పుడు ఆయనపై వైసీపీ వర్గీయులు దాడి చేయడం, పోలీసులు తిరిగి దేవినేనిపైనే కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండపల్లి రిజర్వు ఫారెస్టులో అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై నిజానిజాలు తెలుసుకునేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పది మంది పార్టీ సీనియర్‌ నాయకులతో నిజనిర్ధారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ సభ్యులు శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి కొండపల్లి రిజర్వు ఫారెస్టుకు వెళ్తామని, తమతోపాటు అటవీ, మైనింగ్‌ అధికారులను కూడా పంపించాలని శుక్రవారం కలెక్టరు నివాస్‌ను కలిసి కోరారు. రిజర్వ్‌ ఫారెస్టులోకి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతించకపోగా.. పోలీసులు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులతోపాటు జిల్లావ్యాప్తంగా ముఖ్యమైన టీడీపీ నాయకులందరినీ శుక్రవారమే గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసు నిర్బంధాన్ని ఛేదించుకుని తాము ఎట్టిపరిస్థితుల్లోను కొండపల్లికి వెళతామని టీడీపీ నాయకులు ప్రకటించడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యా రు. జిల్లావ్యాప్తంగా టీడీపీ నాయకులను ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్టులు చేసి కొండపల్లి పర్యటనను భగ్నం చేశారు. ఇంకా ఎవరైనా పోలీసు కన్నుగప్పి కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్టులోకి వస్తారనే ఉద్దేశంతో పోలీసులు జి.కొండూరులో ప్రత్యేక బలగాలను మోహరించారు. అటువైపు వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాతనే విడిచిపెట్టారు. జిల్లా నలుమూలల నుంచి కొండపల్లికి బయల్దేరిన టీడీపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీసుస్టేషన్లలో నిర్బంధించారు. 


నిర్బంధంలోనే నాయకులు

విజయవాడలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, రాష్ట్ర పోలీసు హౌసింగ్‌బోర్డు మాజీ చైౖర్మన్‌ నాగుల్‌ మీరా తదితర నాయకులను పోలీసులు శుక్రవారం కూడా గృహనిర్బంధంలోనే ఉంచారు. వారి ఇళ్ల చుట్టూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీమంత్రి నెట్టెం రఘురామ్‌ను జగ్గయ్యపేటలోను, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితర నాయకులను బందరులోను పోలీసులు హౌస్‌ అరెస్టులు చేశారు. గన్నవరం మండలం నుంచి బయల్దేరిన టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని హనుమాన్‌ జంక్షన్‌ పోలీసుస్టేషన్‌కు  తరలించారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.. ఇలా జిల్లాలో కాస్త గుర్తింపు ఉన్న టీడీపీ నాయకులందరిని పోలీసులు గృహనిర్బంధంలోనే ఉంచారు. తద్వారా టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. 



Updated Date - 2021-08-01T06:26:29+05:30 IST